World Cup 2023: ‘ఐసీసీ 2023 వన్డే వరల్డ్ కప్’ ఇండియాలో జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాలి. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ టోర్నీ ఇండియాలో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి బీసీసీఐ అనుసరిస్తున్న వైఖరితోపాటు, పన్నుల అంశం కూడా కారణాలుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఇండియాలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా, పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.
అయితే, పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్‌లో ఇండియా ఆడబోదని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా కప్‌లో ఇండియా ఆడకపోతే, తాము కూడా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఈ అంశంపై వివాదం మొదలైంది. దీనిపై ఐసీసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రెండు దాయాది జట్లు టోర్నీలో ఆడకపోతే, ఆ టోర్నీకి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఇది ఐసీసీని కలవరపెడుతోంది. అలాగే పాకిస్తాన్.. ఇండియా రాకపోయినా, ఇండియా.. పాకిస్తాన్ వెళ్లకపోయినా టోర్నీ నిర్వహణకు సమస్యే. అందుకే వచ్చే ఏడాది ఇండియాలో టోర్నీ జరుగుతుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.
ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాకపోతే, ఇండియా నుంచి వరల్డ్ కప్ వేదికను మార్చాల్సి ఉంటుంది. దీంతో ఇండియా ఈ అవకాశాన్ని కోల్పోయినట్లవుతుంది. మరోవైపు టోర్నీకి సంబంధించిన పన్నుల విషయం కూడా తేలాల్సి ఉంది. దీని ప్రకారం ఏదైనా దేశంలో వరల్డ్ కప్ నిర్వహించాలంటే అక్కడి ప్రభుత్వం టోర్నీకి సంబంధించిన పన్నులను ఎత్తివేయాలి. అంటే మన దేశం ఈ టోర్నీపై ఎలాంటి పన్ను విధించకూడదు. ఈ విషయంలో తామేమీ చేయలేమని బీసీసీఐ చెప్పింది. దీంతో పన్నుల విషయం తేలకుండా టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ భావిస్తోంది. దీంతో ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణ అంశంపై సందేహాలు కొనసాగుతున్నాయి.