Saturday, November 23, 2024
HomeతెలంగాణVemula: కెటిఆర్ తో ఐటి ఎగుమతులు, ఐటి ఉద్యోగాలు పెరిగాయి

Vemula: కెటిఆర్ తో ఐటి ఎగుమతులు, ఐటి ఉద్యోగాలు పెరిగాయి

ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపు

నైపుణాభివృద్ధి కలిగి ఉన్న వారికి ఆయా రంగాల్లో విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే.తారక రామారావు అన్నారు. ఈ దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) సమీపంలో నూతనంగా నిర్మించిన ఐ.టీ హబ్ ను మంత్రి కేటీఆర్ అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభోత్సవం చేశారు. అలాగే, జాతీయ ఉపాధి శిక్షణ సంస్థ(న్యాక్) కార్యాలయ భవనాన్ని, దుబ్బ, వర్ని రోడ్డు, అర్సపల్లి ప్రాంతాలలో నిర్మించిన వైకుంఠధామాలను, నగరపాలక సంస్థ నూతన భవనాన్ని, ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ లకు ప్రారంభోత్సవాలు జరిపారు. మున్సిపల్ కార్మికులతో కలిసి శ్రీ రామ గార్డెన్ లో సహపంక్తి భోజనం చేశారు.

- Advertisement -

ఐ.టీ హబ్ ను ప్రారంభించిన సందర్భంగా, అన్ని విభాగాలను సందర్శిస్తూ వసతి, సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. కొత్తగా ఐ.టీ కొలువుల్లో చేరిన ఉద్యోగులతో, బాసర ట్రిపుల్ ఐ.టీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఐ.టీ రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని, అనేక అంతర్జాతీయ సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సూచించారు.

యువత ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకుని సరికొత్త ఆవిష్కరణలతో ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. నూతన ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిని ప్రభుత్వం తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. పలువురు విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను మంత్రి కేటీఆర్ పరిశీలించి, వాటి పనితీరు గురించి ఎంతో ఆసక్తితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐ.టీ హబ్ లో వివిధ కంపెనీలలో కొత్తగా ఉద్యోగాల్లో నియామకమైన వారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్, ఇది ఆరంభం మాత్రమేనని మునుముందు మరెంతోమందికి ఐ.టీ హబ్ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖా మంత్రి కే.తారకరామారావు కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 . 45 గంటలకు మంత్రి కేటీఆర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే.ఆర్.సురేష్ రెడ్డిలు మంత్రి కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో వచ్చారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు, వి.గంగాధర్ గౌడ్, రాష్ట్ర మహిళా సహకార సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ తదితరులు కేటీఆర్ ను కలిసి పూల మొక్కలు, బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగింది. మంత్రి వెంట ఐ.టీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News