Pawan Kalyan: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో నిర్వహించే జనసేన కౌలురైతుల భరోసా యాత్రలో పవన్ పాల్గొంటారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 280 కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఆర్ధిక సాయం చేయనున్నారు.
పల్నాడు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు, ఆఫీసులపై వైసీపీ నేతల దాడులు, తిరగబడిన తెలుగు తమ్ముళ్లతో మాచర్ల రణరంగాన్ని తలపించింది. కుప్పలు తెప్పలుగా రాళ్ళూ, రప్పలతో రోడ్లు నిండి దర్శనమిస్తున్నాయి. పోలీసులు ఇక్కడ ఇప్పటికే 144 సెక్షన్ విధించగా.. మాచర్ల నివురు గప్పిన నిప్పులా ఉంది.
మరోవైపు తెనాలిలో కూడా వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్తు తెలియని దుండగులు అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టగా అది వైసీపీ పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే నేడు పవన్ పర్యటన ఎలా ఉండబోతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఏదైనా చిన్న అల్లర్లు చెలరేగినా అది తుఫాన్ గా మారే అవకాశం ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.