అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోరుట్ల రాజకీయాలు మరింత రసకందాయంలో పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలంతా.. బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కేనని పందేలు కాసేందుకు సై అంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది కోరుట్ల రాజకీయాలు. ఇంతకీ అధినేత కేసీఆర్ మదిలో ఏముందన్నది తెలిస్తేకానీ ఈ సస్పెన్స్ కు తెరపడదు.
కోరుట్ల నియోజకవర్గంలో అన్ని పార్టీల ఆశావహులు పలురకాల యాత్రలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉన్నారు. ఇటు అధికార బీఆర్ఎస్ లో మాత్రం తండ్రీ-కొడుకుల్లో అభ్యర్థి ఎవరన్నది అన్న విషయం మాత్రం తేలటంలేదు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంట్లో టెన్షన్ టెన్షన్ గా వాతావరణం ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో తమ రాజకీయ వారసులను ఆరంగేట్రం చేయించే ఏర్పాట్లలో ఉండగా.. సీఎం కేసీఆర్ మాత్రం వారసులకు బదులు తండ్రులే పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన కుమారుడైన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ గడప గడపకు తిరుగుతూ, విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజలకు చేరువవుతున్నారు సంజయ్. ఇదంతా బాగానే ఉన్నా.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు మదిలో కోరుట్ల నియోజకవర్గ టికెట్ తండ్రికిస్తారా లేక కుమారుడికి కేటాయిస్తారా అనేది తెలలేదు. ముఖ్యమంత్రి చేయించిన సర్వేలో కొడుకు కన్నా కొంచెం తండ్రికి ఫలితాలు మెరుగు వచ్చినట్టు, దీంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో సందిగ్ధత నెలకొన్నట్టు గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. విద్యాసాగర్ రావు కేసీఆర్ దగ్గర సన్నిహిత్యం ఉంది. కేటీఆర్ సంజయ్ క్లాస్మేట్స్ కావటం సంజయ్ కి అనుకూలించే అంశం. కొందరు నేతలు ఈసారి బరిలో విద్యాసాగర్ నిలిస్తే తప్పకుండా గెలుస్తాడని, దాంతో రాబోయే మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చెబుతున్నారు. యువ నాయకులు సంజయ్ బరిలో నిలవాలని కోరుతున్నారు. వెరసి.. నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు, జూనియర్ నాయకుల మధ్య విభేదాలు పొడసూపినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వివరిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సీనియర్స్, జూనియర్స్ మధ్య పంచాయతీ నడుస్తున్నట్లు, ఎమ్మెల్యే సముదాయించినట్లు సమాచారం. తండ్రీ-కొడుకుల్లో అభ్యర్థి ఎవరనే స్పష్టత క్యాడర్ కు వచ్చేవరకూ ఈ సమస్య కొలిక్కిరాదు. దీంతో తమ అనుచరులను బుజ్జగిస్తోంది ఎమ్మెల్యే కుటుంబం.