చాగలమర్రి పూర్వపు పేరు త్యాగాలమర్రి. ఆ పేరు కాలానుగుణంగా చాగలమర్రిగా మారిందని స్థానిక పెద్దలు సగర్వంగా వివరిస్తున్నారు. చాగలమర్రి గ్రామం కర్నూలు-కడప జిల్లాలకు సరిహద్దులో ఉంది. ఒకనాటి స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజును వంచించి చంపిన బాస్టియన్ దొర కర్నూలు-కడప ప్రాంతాలకు కలెక్టర్ గా ఉండేవాడు. ఆ సమయంలో చుట్టుపక్కల తిరుగుబాటు దారులను చాలామందిని చాగలమర్రి ప్రాంతాల్లోని చెట్టుకొమ్మలకు ఉరి తీయించారు. ఆనాటి మౌన త్యాగాలకు ఈనాటి నిశబ్ధ సాక్షి చాగలమర్రి.
పదకవితా పితామహుడు ఇక్కడి ఆలయంలో..
క్రీస్తుశకం 1424-1503 సంవత్సరాల మధ్య కాలంలో వెంకటేశ్వరుడిపై 32 వేల సంకీర్తనలు చేసిన పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు దేశ సంచారం చేస్తూ చాగలమర్రిలోని చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. “చాగలమర్రి చెన్నకేశవా’ అనే మకుటంతో ఒక సంకీర్తన రాశాడు. ఈ చెన్నకేశవ ఆలయం నమూనా ఉత్సవ విగ్రహాలు తిరుమలలోని మ్యూజియంలో ఉందని పెద్దలు చెబుతున్నారు. 1802 మార్చి 20న థామస్ మన్రో సమర్పించిన మెమొరాండం ప్రకారం సీడెడ్ జిల్లాల్లో 80 మంది పాలెగాళ్లు ఉండేవారు. అందులో 10 మంది చాగలమర్రి వాసులే ఇందులో లక్ష్మణ్ నాయక్, వెంకటనరసింహులు ప్రముఖులు 1800-1807వ సంవత్సరం వరకూ కలెక్టర్ గా ఉన్న రోజుల్లో మొదటి ఏడాది సమయాన్ని పాలెగాళ్లను అణచివేయ డానికి ఉపయోగించారు. కొందరిని నయాన, భయాన లొంగదీసుకున్నారు.
సైరా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి
పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవదీశారు. చాగలమర్రి ప్రాంతానికి చెందిన చెంచులతో కలిసి 9 వేల మంది సైనికులతో రుద్రవరం, శిరివెళ్లపై దాడిచేసి ఆపారనష్టం కలుగజేశారు. మరుసటి దినం కోవెలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టారు. నరసింహారెడ్డిని పట్టించిన వారికి ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించింది. కొన్ని కుట్రల ఫలితంగా పేరు సోముల కొండ దగ్గర నరసింహారెడ్డి పట్టుబడ్డాడు. 1847, జనవరి 9న కోవెలకుంట్ల ప్రాంతంలో ఇనుప సంకేళ్లతో నరసింహారెడ్డిని ఊరేగించి జుర్రేడు తీరంలో దారుణంగా ఉరితీశారు. ఆయన శిరస్సును కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీయగా అది దాదాపు 30 సంవత్సరాలు (1877) వరకూ అలాగే నిలిచి ఉంది.
1905 బెంగాల్ విభజనాంతరం స్వదేశీ ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో చాగలమర్రి వాసులు పాలు పంచుకున్నారు. 1940 గాంధీ నాయకత్వంలో జరిగిన సత్యాగ్రహంలో చాగలమర్రి వాసులు పాల్గొన్నారు. 1929 మే 21న గాంధీ తన సతీమణి కస్తూరీతో కలిసి ఖద్దరు ఉద్యమంలో ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రికి చేరుకున్నారు. ప్రస్తుతం కేరళ ఆస్పత్రిలోని ముందుగదిలో (ఆనాడు రామసుబ్బయ్య తోట అనేవారు) విశ్రాంతి తీసుకున్నారు. 1860లో జిల్లాలోని ఎనిమిది తాలూకాల్లో చాగలమర్రి మొదటిది. 1860-61లో చాగలమర్రి తాలూకాను రద్దు చేసి శిరివెళ్ల తాలూకాలో కలిపారు. 1860 లక్టోబరు 1న కడప జిల్లా దువ్వూరు తాలూకాలోని 10 గ్రామాలను చాగలమర్రి తాలూకా పరిధిలో చేర్చినట్లు తెలుస్తోంది. అనంతరం 1878లో ప్రొద్దుటూరు తాలూకాలోని చింతలచెట్టు గ్రామం శిరివెళ్ల తాలూకా ప్రధాన కేంద్రం ఆళ్లగడ్డకు మార్చబడింది. స్వాతంత్య్ర సమరంలో మొదటి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న చాగలమర్రి వాసులు ఆర్ రామ్, బండారు నీలన్నలు జైలులోనే తొలి పాఠాలు నేర్చుకున్నారు. 14 ఏళ్ల వయస్సులోనే మహాత్మ గాంధీ ఆశయాలను వంటపట్టించుకుని ముందుకు సాగారు. 1941 జనవరి 9న మహాత్మగాంధీ చాగలమర్రికి వచ్చారు. ఈ సమయంలో పోలీసులు ఆర్కే రామ్ , నీలన్నను అరెస్ట్ చేసి నంద్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. సబ్ కలెక్టర్ విచారణానంతరం వారికి నాలుగు నెలలు జైలు శిక్ష విధించడంతో బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వీరిలో చాగలమర్రికి చెందిన వారు కూడా ఉండటం గ్రామానికే గర్వ కారణమని పెద్దలు చెబుతున్నారు.
— వల్లంకొండు సాయి సుదర్శన్ రావు.