చలికాలం రాగానే పల్లీలతో చేసిన రకరకాల తినబండరాలను ఇంట్లో పెద్దవాళ్లు తినమంటారు. వేయించిన పచ్చిపల్లికాయలు ఈ సీజన్ లో పెద్దపిన్న అందరి ఫేవరేట్ అంటే అతిశయోక్తి కాదు. ఇళ్లల్లో చేసుకునే రకరకాల ఫుడ్ ఐటమ్స్ లో సైతం పల్లీలను వాడుతుంటారు . ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక అధ్యయనంలో పల్లీలతో చేసిన స్నాక్స్ తినడం వల్ల రుమినోకొకాసియా అనే బాక్టీరియా శరీరంలో పెరుగుతుంది. ఈ బాక్టీరియా కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ బాగా జరిగేలా తోడ్పడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది.పల్లీలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
పీచుపదార్థాలకైతే కొదవే లేదు. ఇవి రెండూ కూడా శరీర బరువును తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. పీచు పదార్థాల వల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. కడుపునిండినట్టు ఉంటుంది. అందుకే పల్లీ స్నాక్స్ తినడం వల్ల కడుపునిండినట్టు ఉండి ఎక్కువ తినలేము. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పల్లీలు ఎంతో
మంచి చేస్తాయి. పల్లీలలో మెగ్నీషియం బాగా ఉంటుంది. ఇది కొవ్వును, పిండిపదార్థాలను జీర్ణమయ్యేట్టు సహకరిస్తుంది. దీంతో రక్తంలోని షుగర్ ప్రమాణాలు క్రమబద్ధంగా ఉంటాయి. పల్లీలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తినకూడదని చాలామంది అనుకుంటారు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే పల్లీల్లో ఉండే ఫ్యాట్ ఆరోగ్యకరమైన ఫ్యాట్. పల్లీలను అతిగా కాకుండా సరైన పాళ్లల్లో తినడం వల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
పల్లీల్లో ఓలిక్ యాసిడ్స్, మోనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పోలీ అన్ శాచ్యరేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. అంతేకాదు రక్తంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. పల్లీల్లోని ఎమినో యాసిడ్ ట్రిప్టోఫోన్ మెదడులో కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి.
వాటివల్ల మనం డిప్రషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్ వంటి వాటి బారిన పడం. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లీలు గుడ్ మూడ్ బూస్టర్లనమాట. పైగా పల్లీల్లోని ఆరోగ్యకరమైన ఫ్యాట్ వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. పల్లీల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, రెస్విరోట్రాల్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని యంగ్ గా ఉంచుతాయి. యాంటి ఏజింగ్ ఏజెంటుగా పల్లీలు పనిచేస్తాయి.
పల్లీల వల్ల శరీరంలో బయొటిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఇది శిరోజాల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. మరి ఆలస్యం ఎందుకు ఈ వింటర్ అంతా పల్లీలతో పండగచేసుకోండి అందరూ.