Pawan Kalyan: వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఈసారి వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా.. ఇదీ గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పొలిటికల్ సమావేశంలో మాట్లాడినా ఆయన నోటి వెంట నుండి వచ్చే మాట. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి టీవీ చర్చల నుండి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా వినిపించిన మాటలు.. ఈసారి ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీచేయడం తధ్యం.
అనుకున్నదే నిజమయ్యేలా ఉంది.. అది కూడా మరోసారి పవన్ కళ్యాణ్ పొత్తులపై కొంత క్లారిటీ ఇచ్చేశారు. పల్నాడులో జనసేన కౌలురైతుల భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈసారి వైసీపీ గెలవకుండా చూస్తానన్న పవన్.. గతంలో 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీలతో తమ పార్టీ జనసేన పొత్తు పొత్తును ప్రస్తావించారు.
2014 మాదిరి 2019లో కూడా బీజేపీ, టీడీపీలతో పొత్తులో పెట్టుకుంటే వైసీపీ గెలిచేది కాదన్న పవన్.. ఈసారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వనని చెప్పేశారు. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలలో మహా పొత్తు ఖరారైనట్లే. పవన్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. గతసారి పొత్తును ప్రస్తావిస్తూనే ఈసారి అలా జరగదని చెప్పారంటే దాని అర్ధం తెలియనిదేమి కాదు. దానికి తోడు వైసీపీ వ్యతిరేక శక్తులన్నటినీ ఏకం చేస్తానని కూడా చెప్పేశారు. సో.. మొత్తంగా ఈసారి ఏపీలో మహా పొత్తు గ్యారంటీగా కనిపిస్తుంది.