Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Freedom fighters: సమర యోధుల కలలను సాకారం చేయండి

Freedom fighters: సమర యోధుల కలలను సాకారం చేయండి

‘అవినీతి వటా వృక్షానికి’ తల్లి వేరు రాజకీయ అవినీతే

భారత స్వాతంత్య్ర సుదీర్ఘ పోరాటంలో ఆ సేతు హిమాచలం అనుక్షణం అలుపెరుగని పోరాటం సాగించారు. హింసో, అహింసో తిరుగుబాటో రూపమేదైనా ఉద్యమాల సమ్మేళనమై సాగింది. ఇవ్వాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం, స్వేచ్ఛల కోసం ఆనాటి పోరాటంలో ఆగిపోయిన ఊపిరిల్లెన్నో, ఉరితాళ్లను ముద్దాడిన ప్రాణాలు ఎన్నో, కుమిలిన కుటుంబాలు ఎన్నో, కనిపించని కష్టాలు – కన్నీళ్లు, వేదనలు ఎన్నో.. ఆస్తులను, సుఖాలను వదులుకున్న త్యాగాలు ఎన్నెన్నో అలా నాయకత్వాలతో పాటు సకల జనుల త్యాగాలు అనన్య సామాన్యం. ఆంగ్లేయుల పీడన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛను సాధించడంతోనే స్వాతంత్రోద్యమం ముగిసిపోలేదు.. సమరయోధుల లక్ష్యం అదొక్కటే కాదు. పాలితులను అన్ని (రంగాల్లో) విధాలుగా ఉన్నత స్థితికి ఎదిగేలా చేయడంతో పాటు సామాజిక, ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛ, సాధికారత సాకారం చేస్తేనే పాలకులు తమపై ఉన్న మహత్తరమైన బాధ్యతను నెరవేర్చినవారవుతారు. మన దేశంలో, రాష్ట్రాల్లో 75 ఏళ్ల అమృతో(వజ్రో)త్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 75 ఏళ్ల కాలంలో అభివృద్ధి జరగలేదా అంటే! జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదనేది కాదనలేని వాస్తవం. దీనికి పాలకులు చట్టసభల్లో వెల్లడించిన గణాంకాలే నిదర్శనం. స్వాతంత్య్ర ఫలాలు, అభివృద్ధి ఫలితాలు కొద్దిమందికే చేరుతున్నాయి. అంతేకాదు సామాజిక, ఆర్థిక సమానత్వం, రాజకీయ అధికారం కొన్ని వర్గాల (కొంతమంది)కే పరిమితమైపోతుంది. ముఖ్యంగా ఈ దేశంలో విస్తరించిన ‘అవినీతి వటా వృక్షానికి’ తల్లి వేరు రాజకీయ అవినీతేనని అనేక నివేదికలు స్పష్టపరిచినాయి. ఈ దేశాన్ని ఆర్థిక ఉగ్రవాదంలా పట్టి పీడిస్తున్న నకిలీ నోట్లు, నల్లధనాన్ని నేటికీ సమూలంగా నిర్మూలించలేకపోయినారు. ఇది గత, ప్రస్తుత పాలకుల వైఫల్యమే కదా! నకిలీ నోట్లను, నల్లధనాన్ని, అవినీతిని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి పెద్ద నోట్లు(కరెన్సీ) రద్దు చేయడంతో ఈ సమస్య తీరిపోతుందన్న పాలకుల విధానాలతో ప్రజానీకానికి మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులకు గురిచేసింది. చివరికి వద్దన్న పెద్ద నోట్లనే ముద్రించినారు. ఆ ధనమంతా మళ్లీ ధనవంతులు, కుబేరుల వద్దకే చేరింది. ఈ అవినీతి ధనంతోనే ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నారు. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఓటర్లకు మందు, మనీ, ఉచితాలు, తాయిలాల రూపంలో అరచేతిలో స్వర్గాన్ని చూపేలా ఎన్నికల మేనిఫెస్టోలు రూపొందించి, మరోవైపు డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసే ఓటు బ్యాంకు రాజకీయంలో అన్ని పార్టీలు ఆరితేరిపోయినాయి. ‘అందరూ ఆ తాను ముక్కలే’ రాజకీయ విలువలను మూకుమ్మడిగా పాతరేస్తున్నారు. అధికార పీఠం ఎక్కడమే ధ్యేయంగా, ప్రలోభాల ఎరవేసి పాలనా పగ్గాలు చేపట్టాక.. నాటి, నేటి పాలకులు వంతుల వారిగా దేశ సంపదను పంచుకు తి(oటు)న్నారు. అందుకే దేశ సంపద కొద్దిమంది ధనవంతుల వద్దకు చేరిపోయింది. దాని మూలంగా పేదరికం, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, వైజ్ఞానిక, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ, లింగ వివక్ష, నిరుద్యోగం, ఉపాధి లేమిలో మనకన్నా చిన్న దేశాల కంటే వెనుకబడిపోతుంది. స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో 75 ఏళ్ల ప్రజా పాలనలో అనేక పథకాలు పట్టాలెక్కినా ప్రజాధనం ‘కరి మింగిన వెలగపండోలే’ కరిగిపోయి అది కాగితాలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదు. దాని ఫలితంగా దేశంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఉపాధి లేమి, పేదరికం, లింగ వివక్ష అగాధంలా పెరిగిపోయింది. పౌర స్వేచ్ఛ పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్నారు. రాజకీయానికి మకిలి పట్టించి, నోట్లు వెదజల్లి ఓట్లు కొల్లగొడుతూ ఎన్నికైన నాయకులు, ప్రభుత్వాలు ‘నాకిది- నీకది’ అంటూ అంతర్గత (అదృశ్య) ఒప్పందాలతో దేశ సంపదను దోచుకుంటున్నారు. కుర్చీ దిగేలోపు ఎంత కూడబెట్టుకున్నామా అన్నదే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు. ఎన్నికల్లో ధనవంతులు, అవినీతితో సంపాదించిన నల్లధనం గలవారిని గెలుపు గుర్రాలుగా అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఇందులో అన్ని పార్టీల తీరు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగానే ఉంది.
మనదేశ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షలు, సమరయోధుల స్వప్నాలను సాకారం చేసేందుకు పాలకులు, పాలితులు చిత్తశుద్ధితో కంకణబద్ధులు కావాల్సి ఉంది. ఆంగ్లేయుల నాటి బానిస ఆలోచనలను వదులుకోవాలి. మన మూలాలను గుర్తించడం, గౌరవించడంతో పాటు ఐక్యమత్యంతో ముందుకు సాగాలి. పాలకుల విధులైన నైతిక విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను పునరుద్ధరిస్తూ, పాలితుల హక్కులను, బాధ్యతలను పరిరక్షించాలి. రాజ్యాంగబద్ధ పాలన సాగించాల్సిన అవసరం ఎంతోఉంది. నేటి స్వార్థ, ద్వంద్వ రాజకీయాలకు స్వస్తి పలికి, కనీసం స్వాతంత్య్ర శత వసంతోత్సవాల నాటికైనా వికసిత (శ్రేష్ట) భారతం ఆవిష్కృతం కావాలంటే? మన రాజ్యాంగంలో రాసుకున్న మేరకు దేశాన్ని ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామ్య’ విలువలతో కూడిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయంతో పాటు ప్రజలందరి హక్కైన భాష, వాక్‌, మత, ఆహార, జీవన స్వేచ్ఛలు పరిరక్షించబడాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటికి భంగం కలిగించరాదు. అలాగే నేడు రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగిన అత్యున్నత వ్యవస్థలకు రాజకీయ నీలినీడలు కమ్ముకున్నాయి. అవి పాలకులకు సానుకూలంగా వ్యవహరిస్తూ.. పాలకవర్గానికి వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలను, వ్యక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చి వేస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు డబ్బు ఎరవేసి పార్టీలను మార్చే దుర్వ్యవస్థకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు. అంతే కాదు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో సరైన ప్రతిపక్షాలు లేని విధంగా దుర్వ్యవస్థ కొనసాగుతుంది. పాలకులకు ఎవరు ఎదురు నిలువరాదు? అనే తరహాలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో వ్యక్తి పూజ పెరిగిపోయింది. పౌర స్వేచ్ఛను హరిస్తున్నారు. కుల, మత, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే పెడధోరణులు దశాబ్ద కాలంగా పెరిగిపోయినాయి. ‘భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత‘. భిన్నత్వంలో స్వేచ్ఛను గౌరవిస్తూ.. ఏకత్వం ద్వారా సంఘీభావాన్ని చాటాల్సిన చోట అనైతిక అవకాశవాద రాజకీయ ద్వంద్వ విధానాలకు పాలకులు పూనుకుంటున్నారు.
ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల పాలన. ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములవ్వాలి. కానీ నేడు జరుగుచున్న ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో 30-40% ప్రజల ఆమోదం మాత్రమే పొంది అత్యధికులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. వీళ్లను ఎన్నుకున్న ప్రజలకు ప్రతినిధులుగా కాకుండా తమ రాజకీయ పార్టీలకు, అధినాయకులకు ప్రతినిధులుగా వారి ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత! వారి భాగస్వామ్యం ఎంత? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఎన్నికల విధానం, పాలనలో నాణ్యత, భిన్నాభిప్రాయాలకు విలువ, విద్యలో స్వేచ్ఛ ఇవ్వాల్సిన చోట బలహీనపరుచుతున్నారు. తమ అభిప్రాయాలతో విభేదించే వ్యక్తుల, సంస్థల, పార్టీల, మేధావుల, పాత్రికేయులపై అణచివేత, ప్రభుత్వ వ్యవస్థలో పక్షపాత ధోరణి, ప్రశ్నించే వారిని వేధించడం, అసంతృప్తిని అణచిపెట్టడం లాంటివి అధికార పార్టీలో పెచ్చరిల్లుతున్నాయి. ప్రతిపక్షం లేని భారతదేశం కోసమో ఏమో! రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో ఇవే ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకే పార్టీకి ఓటు వేయాలని శాసించడం ప్రజాస్వామ్యం కాదు?. ‘నోట్లతో ఓట్లు కొనే’ ధోరణి ఫలితంగా పేద, మధ్య తరగతి వారు మరియు మహిళలు చట్టసభల్లో అడుగు పెట్టలేకపోతున్నారు. దేశంలో, రాష్ట్రాలలో చట్టసభల్లో ధనవంతులు, నేర చరిత్ర కలిగినవారు అధికమనేది చేదు నిజం. ఇది కాదనగలరా! అంతేకాకుండా లింగ వివక్ష కొనసాగుతుంది. అన్ని రంగాల్లో మహిళలకు సముచిత అవకాశాలు రావాలంటే? ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’ను ఆమోదించి రాజకీయ, ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సాధించి లింగ వివక్షను రూపుమాపాలి. కేంద్రంలోని పార్లమెంటులో.. రాష్ట్రాల్లోని శాసనసభల్లో మెజారిటీని అడ్డం పెట్టుకొని ప్రజా ఆకాంక్షలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకునే తీరు మారాలి. ప్రజలు వ్యక్తిగతంగా బలహీనులే కావచ్చు! కానీ తమ ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, రక్షణకు, ఐక్యతకు భంగం వాటిల్లినప్పుడు ఎంత నిరంకుశ పాలకులనైనా డాక్టర్‌ అంబేద్కర్‌ అందించిన ‘ఓటు వజ్రాయుధం’ ద్వారా అధికార పీఠం నుండి పడదోస్తారని గమనించండి.
మన దేశంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృతో (ఆనందో)త్సవాల ముగింపు సరే.. ఆంగ్లేయులు నింపిన విభజించి పాలించు, ఆత్మన్యూనత, వలస పాలన విధానాలు, పెట్టుబడిదారీ వ్యాపారీకరణ, ఆంగ్లభాష మోజు నుంచి స్వేచ్ఛ వచ్చిందా.. అనేది ప్రశ్నించుకోవాలి?. ఇంకా ఆ జాడ్యాలను, మూస విధానాలను, నిరంకు శత్వాన్ని, నాటి బ్రిటిష్‌ కాలంలోని కర్కశ చట్టాలు కొనసాగిస్తున్న దాఖలాలను నేటి ప్రజా పాలనలో కూడా చూస్తున్నాం. అత్యున్నత న్యాయస్థానం మందలించినా పాలకుల విధానాలలో మార్పు రావడం లేదు. ఆనాటి అమరుల త్యాగాల ఫలాలను, జాతి సంపదను కొల్ల గొట్టుచూ, మరోవైపు పన్నుల పొటుతో పాటు అప్పుల భారాన్ని మోపుచున్నారు. కుల, మత విద్వేషాలు, అవినీతి, హింస పెచ్చరిల్లుతూ, జాతి సంపద కొద్దిమంది కుబేరుల చేతిలో కేంద్రీకృతం అవుతుంది. అక్రమాలు చేసే ప్రబుద్దులే పాలకులవుతున్న అవ్యవస్థను తుదముట్టించాలి. పుట్టుక, కులం, మతం, సంప్రదాయాలపై ఆధారపడిన మధ్యయుగం నాటి పద్ధతి నుంచి భారతదేశాన్ని బయట పడవేయాలి. చట్టం, వ్యక్తిగత ప్రతిభ, లౌకిక విద్యలో ఆధునిక పునాదుల మీద సామాజిక వ్యవస్థను పునర్నిర్మించాలి. ఆర్థిక వ్యవస్థను శాస్త్రీయంగా, ప్రణాళిక బద్ధంగా తీర్చిదిద్దే సామాజిక విప్లవానికి ప్రభుత్వాలు సారథ్యం వహించాలి. రాజ్యాంగబద్ధ పాలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. సామాజిక స్వేచ్ఛ, ఆర్థిక సమానత్వం ఏర్పడినప్పుడే దేశ ప్రజల తలరాత మారుతుంది, సమ్మిళిత అభివృద్ధి సాధ్యమౌతుంది. పాలకులారా.. అధికార పీఠం (విజయం) కోసం కాకుండా, రాజకీయ విలువలతో కూడిన పాలితుల జీవన ప్రమాణం మెరుగుపరచడమే లక్ష్యం కావాలి. ప్రజల ఆకాంక్షలు.. సమరయోధుల కలలు.. కనీసం స్వాతంత్య్ర శతాబ్ధి ఉత్సవాల నాటికైనా సాకారం అయ్యేలా ప్రతినపూని అమలు చేయండి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఎదిగినవేళ పాలితులారా.. సమర యోధుల త్యాగాల స్పూర్తిని గుర్తుకు తెచ్చుకోండి. సామాజిక బాధ్యత బరువనుకుంటే! ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే? మళ్ళీ బ్రిటిష్‌ కాలం నాటి బానిస బతుకులకు సిద్ధపడాల్సి వస్తుంది. పాలకులు.. పాలితులపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తించండి.. సాధించే దిశగా ముందడుగు వేయండి.
మేకిరి దామోదర్‌
సామాజిక విశ్లేషకులు

  • 9573666650
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News