ఇటీవల పలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న చాలామంది యువతీయువకులు ఉద్యోగాలు కోల్పోవడం చూస్తున్నాం. హఠాత్తుగా ఉద్యోగం పోవడం, జాబ్ లేదన్న భావన వీళ్లల్ల్లో తీవ్ర ఒత్తిడి, నిరాశానిస్పృహలను రేకెత్తిస్తుంది. జీవితం అయిపోయిందని తీవ్ర ఉద్వేగానికి వీళ్లు గురవుతుంటారు. ఈ రకమైన ఒత్తిడి వల్ల వాళ్లు తీవ్ర మానసిక అనారోగ్యాకి గురవడమే కాదు వాళ్ల సామాజిక జీవనం మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కారణం కొందరికి ఉద్యోగం ఒక హాబీ అయిండవచ్చు. కానీ కొందరికి అదే జీవితం. ఉద్యోగం లేకపోతే వాళ్ల జీవితాలు ఛిద్రమవుతాయి. కొంతమందికి అది కెరీర్ డ్రీమ్. వాళ్లు సాధించాలనుకున్న లక్షాణాలకు తొలి మెట్టు. అలాంటి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నామన్న భావన వారిలో ఎంతో మానసిక వేదనను రేకెత్తిస్తుంది. కానీ ఉద్యోగం కోల్పోతే జీవితమే కోల్పోయామని నిస్సత్తువకు లోనుకావడం సరికాదంటున్నారు మానసిక నిపుణులు.
ఉద్యోగమే జీవితానికి ప్రారంభం, అది లేకపోతే జీవితమే ముగిసిపోయిందనుకోవడం తప్పుడు ఆలోచన అని నిపుణులు యువతకు సూచిస్తున్నారు. ఉద్యోగం పోవడమనేది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చు. ఆర్థికంగా వారిని సమస్యల్లోకి నెట్టవచ్చు. కానీ వారి ప్రొఫెషనల్ జీవితంలో అదొక తాత్కాలిక ఒడిదుడుకుగా మాత్రమే చూడాలి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి చాలామంది ఇంకో ఉద్యోగం వెతుక్కోవడమే తక్షణ కర్తవ్యం అనుకుంటారు. నిజమే కానీ కొత్త ఉద్యోగం రావడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకూ మెచ్యూరిటీతో వ్యవహరించాలే తప్ప మానసికంగా, ప్రవర్తనాపరంగా డీలా పడిపోకూడదు.
ముందు ముందు ఎలా జీవించాలి అనేదానిపై ప్రశాంతంగా ఆలోచించాలే తప్ప ఇక జీవితమే లేదు అన్నట్టు ప్రవర్తించడం సరికాదు అని నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఎదురైన ఈ సమస్యను సవాలుగా తీసుకుని ప్రొఫెషనల్‌గా మరింత ఎదిగేలా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి. ఉద్యోగం పోవడానికి ఒక వాస్తవంగా గుర్తించి కెరీర్ పరంగా తర్వాత వేయాల్సిన అడుగుల గూర్చి శ్రద్ధ తీసుకోవాలంటున్నారు. భవిష్యత్ ప్రణాళికలపైనే తమ శక్తియుక్తులను పెట్టాలని చెప్తున్నారు. ఉద్యోగం పోవడం వల్ల ఒక రకమైన అనిశ్చితత్వం వీళ్లని వెన్నాడుతుంటుంది. నిజమే కానీ సమస్యను ఉన్నది ఉన్నట్టు తీసుకుంటేనే దాన్ని ప్రశాంతంగా పరిష్కరించుకోగలరు అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కొందరు ఉద్యోగం పోయిన వెంటనే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయినట్టు ప్రవర్తిస్తుంటారు. అలా ఉండకుండా తమ స్నేహితులతో, చుట్టూ ఉన్న వారితో సంబంధాలను తెంచుకోకుండా మరింత బలోపేతం చేసుకోవాలి. ఇది వారికి ఇచ్చే మానసికస్థైర్యం ఎంతోనని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
ఉద్యోగం పోవడమనేది వారి తప్పయినట్టు నలుగురిలో రావడానికి సిగ్గుపడడం, అవమానంగా ఫీలవడం సరికాదని కూడా వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వీరికి ఎమోషనల్ సపోర్టు చాలా అవసరమని వైద్యులు సలహా ఇస్తున్నారు. మానసికంగా, శారీరకంగా వీళ్లు బలంగా ఉండాలి. రోజంతా యాక్టివ్‌గా ఉండాలి. వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. చిరుతిళ్లు, చాక్లెట్లవంటి వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఇలా ఉండడం వల్ల వాళ్ల మైండ్ షార్పుగా ఉంటుంది.
శారీరకంగా దృఢంగా ఉండడం కూడా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంటున్నారు. మరో ఉద్యోగం దొరికే వరకూ ఏదైనా కొత్త కోర్సును లేదా వారికి ఇష్టమైన పనిపై దృష్టిపెట్టాలని మానసిక వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసికమైన, ప్రవర్తనాపరమైన స్థిరత్వం వీరిలో పెంపొందుతుందట. ముఖ్యంగా ఇలాంటి వాళ్లు తమలోని శక్తిసామర్థ్యాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి అని మానసిక నిపుణులు చెప్తున్నారు.