నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో చాగలమ్మ , శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి దేవికి , చౌడేశ్వరి మాతకు , గంగమ్మ తల్లికి , పార్వతి దేవికి ఇలా అమ్మవార్లకు శ్రావణ మాసంలో ఆలయాల్లో విశేష పూజలు జరిపి ప్రత్యేక హారతులు ఇస్తారు. తొలకరి చినుకులతో పచ్చని రంగేసుకున్న పుడమితల్లి అందాలూ గుమ్మానికి అందంగా వేలాడే పచ్చటి తోరణాలూ… పసుపుపారాణితో అత్తవారింటికి కొత్తకోడళ్లు నోచే నోముల సందళ్లూ ఆలయాల్లో వాయినాలంటూ ముత్తయిదువుల పిలుపులూ… ఇలా ఒకటా రెండా శ్రావణమాసం వచ్చింది అంటే చాలు తెలుగు లోగిళ్లన్నీ పండగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. ఆషాఢం స్తబ్దతను మెలమెల్లగా తరిమికొడుతూ ఆనందంగా శ్రావణలక్ష్మికి స్వాగతం చెబుతాయి.
చంద్రుడు శ్రవణా నక్షత్రంలో అడుగుపెట్టడంతో శ్రావణమాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసానికి శ్రావణం అని పేరు. శుక్ల పాడ్యమి నుంచి పోలాల అమావాస్య వరకూ ఈ నెలలో ప్రతి తిథీ ప్రత్యేకమైందే. కార్తికమాసంలో సోమవారాలు ప్రత్యేకం… మార్గశిరంలో గురువారాలు విశిష్టమైనవి… ఇలా ఒక్కో మాసంలో ఒక్కో రోజు మంచిదని చెబుతారు. కానీ ఒక్క శ్రావణమాసంలో మాత్రం ప్రతి రోజూ పండగ రోజే. ప్రతి తిథీ విశిష్టమైందే. వీటిలో శుక్లపక్షంలో వచ్చే తిథులకూ అధిక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో మొదటిగా పూజలందుకునే తల్లి మంగళగౌరి. ప్రతి మంగళవారం ముత్తయిదువులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీదేవే గౌరీదేవిగా మారిందని శివపురాణం తెలియజేస్తోంది. శివుడూ సరస్వతీదేవీ జ్ఞానస్వరూపులు. ఇద్దరూ ధవళవర్ణంలో దర్శనమిస్తారు. అందుకే వాళ్లను అన్నాచెల్లెళ్లుగా చెబుతారు. స్థితికారకుడైన నారాయణుడూ అతడి సోదరి నారాయణీ అన్నాచెల్లెళ్లు. ఇద్దరూ నల్లని మేనిఛాయ కలవాళ్లు.
పూర్వం ఒకసారి శివపార్వతులకు ప్రణయకలహం వచ్చిందట. అప్పుడు శివుడు పార్వతీ దేవిని ఆటపట్టిస్తూ ‘కాళీ (నల్లనిదానా)’ అన్నాడట. దీంతో అలిగిన అమ్మవారు చక్కటి మేనిఛాయకోసం తపస్సు చేసిందట. అలా అమ్మవారు గౌరవర్ణం (ఎరుపురంగు)లోకి మారిపోయిందట. గౌరవర్ణంతో దర్శనమిస్తుంది కాబట్టి గౌరీదేవి అయ్యింది. శ్రావణ మంగళవారంనాడు ఆ గౌరీదేవిని పూజిస్తే సకలశుభాలూ కలుగుతాయని శివుడు వరమిచ్చాడట. అప్పటి నుంచీ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
వరప్రదాయని వరలక్ష్మి
ఈ మాసంలో వచ్చే పండగల్లో మొదటిది గరుడ పంచమి. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అంటారు. తల్లిదాస్యాన్ని పోగొట్టడానికి ఎంతో కష్టపడినవాడు గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తికి వాహనమయ్యాడు, గరుడ పురాణానికి కర్తగా నిలిచాడు. ఈ రోజున గరుత్మంతుడిని పూజిస్తే అపార శక్తిసామర్థ్యాలు లభిస్తాయంటారు. సూర్యుడిని ఆరాధించడానికి అత్యంత విశేషమైన రోజుగా శ్రావణ శుద్ధ సప్తమిని చెబుతారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశీ లలితా ఏకాదశీ అని కూడా అంటారు. సంతానం లేనివారు ఈ ఏకాదశి వ్రతాన్ని చేసినట్లయితే తప్పక సంతానం కలుగుతుందని చెబుతారు. తర్వాతి రోజును దామోదర ద్వాదశి అంటారు. ఆ రోజున మహావిష్ణువుని పూజించాలి. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడే పార్వతీదేవికి వివరించాడని భవిష్యోత్తర, స్కాంద పురాణాలు పేర్కొంటున్నాయి. ఆరోజు తమ శక్తికొలదీ లక్ష్మీదేవి రూపును బంగారంతో చేయించి, అమ్మవారిని ఆవాహనచేసి నవవిధ పిండివంటలతో అర్చిస్తారు.