FIFA World Cup : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. చిన్న జట్ల సంచనాలు, పెద్ద జట్ల పతనం, స్టార్ ఆటగాళ్ల మెరుపులు, యువ కెరటాల అద్భుతాలతో ఇప్పటికే ఈ ప్రపంచకప్. అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించింది. క్రొయేషియా అద్భుతాలకు, మొరాకో సంచలనాలకు సెమీస్‌లో బ్రేక్ పడగా ఫైనల్‌లో నేడు అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అందినట్లే అందిన ప్రపంచకప్ చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా స్టార్ ఆటగాడు, కెప్టెన్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ట్రోఫీలు గెలిచినా ఇప్పటి వరకు ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగిలింది. నేడు జరిగే ఫైనల్ మ్యాచే అర్జెంటీనా తరుపున తన ఆఖరి మ్యాచ్ అని ఇప్పటికే మెస్సీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని మెస్సీ గట్టి పట్టుదలతో ఉన్నాడు.
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడి నిష్క్రమణ కత్తి వేలాడుతుండగా, ఉత్కంఠ భరిత క్షణాలను అధిగమిస్తూ ఒక్కొ అడ్డంకిని దాటుకుంటూ ఫైనల్ చేరింది అర్జెంటీనా. నాకౌట్ బెర్తు ఖరారు అయిన తరువాత ట్యునీషియా చేతిలో ఓడింది ప్రాన్స్. ఆ తరువాత అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఫైనల్‌కు దూసుకువచ్చింది.
అటు అర్జెంటీనా జట్టులో లియోనల్ మెస్సీ, ఇటు ఫ్రాన్స్ జట్టులో ఎంబా లు తమ జట్లకు అద్వితీయమైన విజయాలు అందించారు. ఈ టోర్నీలో చెరో 5 గోల్స్ చేసి సమంగా ఉన్నారు. వీరిద్దరిలో ఫైనల్‌లో ఎవరు ఎక్కువ గోల్స్ సాధిస్తే వారికే గోల్డెన్ బూట్ దక్కనుంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్‌లో ఎవరు ఫేవరెటో ఫుట్‌బాల్ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు.
రికార్డులు పరిశీలిస్తే..
అర్జెంటీనాకు ఇది ఆరో ప్రపంచకప్ ఫైనల్ 1978, 1986లలో విజేతగా నిలిచింది. 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రాన్స్ జట్టుకు ఇది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో కప్ గెలిచింది. 2006లో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలిచినా కూడా వారికి ఇది మూడో ప్రపంచకప్ టైటిట్ కానుంది.