Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Professionals: వృత్తి పనివారికి సరైన వెసులుబాటు

Professionals: వృత్తి పనివారికి సరైన వెసులుబాటు

ఈ పథకం ద్వారా సంప్రదాయ వృత్తులకు అన్ని విధాలా సాయం

వృత్తి పనివారికి, సాంప్రదాయిక వృత్తి కళాకారులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడానికి కేంద్ర మంత్రివర్గం ‘విశ్వకర్మ’ పేరుతో ఒక కొత్త పథకానికి ఆమోదం తెలియజేయడం ఈ వృత్తుల వారికి తప్పకుండా ఒక వరమేనని చెప్పవచ్చు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెలువరించిన తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఈ పథకం గురించి ప్రకటించారు. ప్రాథమిక స్థాయిలో ఈ పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయించారు.ఈ పథకం కింద వృత్తి పనివారికి కేవలం 5 శాతం వడ్డీతో రూ. 3 లక్షల వరకూ రుణ సహాయం అందజేయడం జరుగుతుంది. ఇది సుమారు 18 రకాల వృత్తి పనివారికి వర్తిస్తుంది. ఇందులో చర్మకారులు, బొమ్మల తయారీదార్లు, లాండ్రీవారు, క్షురకులు, మేస్త్రీలు, కొబ్బరి పీచుతో వస్తువులు తయారు చేసేవారు కూడా ఉన్నారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు దీనితో లబ్ధి చేకూర్చాలని, అయిదేళ్ల కాలంలో దీన్ని 30 లక్షల కుటుంబాలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి, ప్రస్తుతం బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో తలెత్తుతున్న సమస్యల నుంచి, కష్టనష్టాల నుంచి గట్టెక్కించడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని వృత్తి పనివారు, వృత్తి కళాకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ కొద్దిపాటి ఆర్థిక సహాయంతో వారు కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఇందులో ఏమాత్రం ఊహించని ఇబ్బందులు అనేకం ఉన్నాయి. ఇప్పటికే అనేక విధాలుగా అవస్థలు పడుతున్న ఈ వర్గాలకు రుణ సహాయం అందజేసినంత మాత్రాన వారి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని భావించడానికి వీల్లేదు. వీరు ఉత్పత్తి చేసే వస్తు పరికరాలను కొని ఆదరించేవారు కరువయ్యారు. వీరి వస్తువులను విక్రయించడానికి సరైన మార్కెట్‌ సదుపాయం లేదు. మిగిలిన వృత్తిపనివారి సేవలకు కూడా తగినంత గుర్తింపు లేదు. వాటికి బాగా తక్కువగా విలువ కట్టడం జరుగుతోంది.
వారికి రుణాలు లభ్యం కాకపోవడానికి, బ్యాంకులు సైతం వారికి రుణాలు మంజూరు చేయకపోవడానికి ప్రధాన కారణం వారి ఉత్పత్తికి, సేవలకు సరైన విలువ లేకపోవడమే. వారి వస్తువులకు సరైన విలువ, సరైన ధర లభ్యం కానంత కాలం వారికి ఎటువంటి రుణ సహాయం అందించినా ఆశించిన ప్రయోజనం ఒనగూరకపోవచ్చు. వారి ఉత్పత్తులు, సేవలకు లాభదాయకత ఏమీ లేదు. ఈ ప్రాథమిక సమస్య మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ పథకం ద్వారా వారి ముందుకు కొత్త మార్కెట్‌ అవకాశాలు రాని పక్షంలో, వారి సంక్షేమం కోసం అందజేస్తున్న ఆర్థిక సహాయం వారిని, వారి కుటుంబాలను మరింతగా రుణాల ఊబిలో ముంచేసే ప్రమాదం ఉంది. అంతేకాక, మార్కెట్‌ అవకాశాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా, వీరి తరువాతి తరానికి శిక్షణలు, నైపుణ్యాలు అందజేసే పక్షంలో మరికొన్ని తరాల వారు ఈ నష్టదాయక, రుణగ్రస్త ఊబిలో కూరుకుపోయే అవకాశం కూడా ఉంటుంది.
ఈ విశ్వకర్మ పథకం కింద ఈ వృత్తి కళాకారులకు, వృత్తి పనివారికి ఆధునిక నైపుణ్యాలు, ఆధునిక పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు విడిగా స్టైపెండ్‌ కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ పథకం ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ, దీన్ని సమర్థంగా, పటిష్టంగా అమలుచేయడం మీదే దీని విజయం ఆధారపడి ఉంది. వారికి శిక్షణనివ్వడానికి, ఆధునిక పరికరాల వినియోగంలో నైపుణ్యాలు అందజేయడానికి ప్రభుత్వం తప్పనిసరిగా వృత్తి నిపుణుల సేవలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వృత్తి పనివారిలో ఒక వ్యవస్థాపకత్వాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. వారు తమ నైపుణ్యాల్ని పెంచుకుని, ఆధునిక పద్ధతుల్లో వస్తు పరికరాలను తయారు చేసి, సేవలను మెరుగుపరచుకుని, ప్రభుత్వం కల్పించిన మార్కెట్‌ వసతులను ఉపయోగించుకుని లబ్ధి పొందడానికి చాలా సమయం పడుతుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News