ఆడపిల్లలు బయటకు రావడమే పాపంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. ఆడపిల్లలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. వావి వరసలు లేకుండా.. మానవ విలువల్ని మరిచిపోయి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో ఉండి.. ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. 16 ఏళ్ల బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధిత బాలికను కలిసిన ఓ బాలుడు ఆమెకు మాయమాటలు చెప్పి సముద్ర తీర గ్రామంలోని ఓ ఖాళీ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడికి మరో ఏడుగురు నిందితులు వచ్చారు. అందరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి మరోమారు సామూహిక అత్యాచారం చేశారు. రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయానికి ఇంటికి చేరుకుంది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డిసెంబరు 16న ఈ ఘటన జరిగిందని, దాదాపు రాత్రి 8 గంటల సమయంలో బాలికపై మొదలైన లైంగిక దాడి తర్వాతి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగిందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 మంది నిందితుల్నీ అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.