యావత్ ప్రపంచం దాదాపుగా కరోనా నుండి బయటపడింది. కానీ.. కరోనా పుట్టినిల్లైన చైనాలో మాత్రం మరోసారి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టినా.. చైనాలో లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగించడంతో.. ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేయడంతో.. ఆంక్షలను ఎత్తివేసింది చైనా ప్రభుత్వం.
పూర్తిస్థాయిలో ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో.. కరోనా మళ్లీ దాడిచేసింది. వేల సంఖ్యలో కేసు నమోదవుతుండటంతో.. ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఆదివారం ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ దాదాపుగా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితిని చూస్తే.. అక్కడ కరోనా తీవ్రత ఎంత ఉందో తెలుస్తుంది. కరోనా మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడి శ్మశాన వాటికలు రద్దీగా ఉండటం కరోనా మరణాలు పెరిగాయన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఆంక్షలను ఎత్తివేశాక అక్కడ సంభవిస్తున్న కరోనా మరణాలను అధికారికంగా వెల్లడించలేదు.