India vs Bangladesh : భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో మూడో వన్డేతో పాటు తొలి టెస్టుకు దూరం అయ్యాడు. అయితే డిసెంబర్ 22 నుంచి మీర్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులోకి రోహిత్ రానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు చాలా సంతోషించారు.
అయితే.. ఆ వార్తల్లో నిజం లేదు. రెండో టెస్టుకు కూడా హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండడం లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. రోహిత్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైనప్పటికీ బంగ్లా పర్యటన తరువాత ముఖ్యమైన సిరీస్‌లు ఉండడంతో రెండో టెస్టుకు దూరంగా ఉండాలని రోహిత్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం.
దీంతో రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ సారథిగా కొనసాగనున్నాడు. ఒకవేళ రోహిత్ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చుంటే రెండో టెస్టుకు జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారేది. కేఎల్ రాహుల్, కోహ్లీ మినహా అందరూ తొలి టెస్టులో రాణించారు. రోహిత్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా దించాల్సి వచ్చేది. అప్పుడు కేఎల్ రాహుల్‌పై వేటు పడేది.
వన్డే సిరీస్‌ను 1-2 కోల్పోయిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఉంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టెస్టులో 188 పరుగుల భారీ తేడాతో బంగ్లాను ఓడించడం ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.
బంగ్లాదేశ్‌తో సిరీస్ తరువాత భారత జట్టు స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ముంబై వేదికగా జవనరి 3న నుంచి భారత్, శ్రీలంక జట్లు తలపనున్నాయి.