Marri Shashidhar Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందా? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ చేరబోతున్నారా ? ఈ విషయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వీరిద్దరి భేటీనే మర్రి పార్టీ మారుతున్నారన్న వస్తున్న వార్తలకు ప్రధాన కారణం. త్వరలోనే ఆయన కాంగ్రెస్ ను వీడి.. కాషాయ కండువా కప్పుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అప్పటి నుండి ఆయన పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ఆయన ఆ వార్తలపై స్పందిస్తూ.. కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లేనా అని ఎదురు ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత రెండ్రోజులకే అమిత్ షా ను కలవడంతో మళ్లీ పార్టీ మార్పు వార్తలు ప్రచారం అందుకున్నాయి. మర్రి శశిధర్ రెడ్డి నిజంగానే పార్టీ మారితే.. అది కాంగ్రెస్ కు తీరని లోటనే చెప్పాలి. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు ఇది పెద్ద షాకే అవుతుంది.
తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పటి నుండి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటు ఏపీలో, అటు తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో కనీసం డిపాజిట్లు కూడా రావట్లేదు. బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ దే విజయమైనప్పటికీ.. బీజేపీ-టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో పెద్ద తేడా లేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు ప్రధాని మోదీ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.