ఆయన గొప్ప కవి, రచయిత, బహు భాషా కోవిదుడు. నిరంతరం అతను పుస్తకాలే అలవాటుగా చదివే వారు. ముక్కుసూటిగా స్పష్టంగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వం. తెలంగాణ పోరాటాన్ని కళ్ళారా చూసిన సాహితీ యోధుడు డా. దాశరథి రంగాచార్య. ఇక్కడి ప్రజల జీవన పోరాటాన్ని, అస్తిత్వాన్ని తన రచనల ద్వారా ప్రతిఫలింప జేశాడు. 1928 ఆగస్ట్ 24న దాశరథి వెంకటాచార్యులు- వెంకటమ్మ దంపతులకు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో జన్మించిన వీరి 94వ జయంతి. తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి అభినవ వ్యాసునిగా పేరుగాంచారు.
‘చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు.. ఆపదల్లోనే ఉన్నతుడవు తాడు.. మనిషైనా జాతైనా అంతే..’ అన్న డాక్టర్ దాశరథి రంగాచార్య తెలంగాణ రైతాంగ పోరాటం ఆయుధాలను చేతబూనడం వలన వారు పోలీసు యాక్షన్ తర్వాత బయటికి వచ్చారు. 1951 లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 1957లో అనువాదకులుగా సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో చేరారు. రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు. చిల్లర దేవుళ్లు, మోదుగు పూలు, మాయ జలతారు, జనపదం, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం, పావని, అమృతంగమయ. తెలంగాణ గురించి రాయబడిన దాశరథి రంగాచార్య గారి తొలి నవల చిల్లర దేవుళ్లు. దీన్ని ఐదు వారాలలో పూర్తి చేశారు. అక్షరమే ఆయన ఆయుధం, సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ కెరటం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన అభ్యుదయవాది, తన రచనలతో నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించిన మహోన్నత వ్యక్తి, తన రచనలతో సమాజాన్ని చైతన్యం చేసిన అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య….
సాహిత్య సాగరంలో ఆయన ఉరికే కెరటం.. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని వీరుడు. మడమ తిప్పని నాయకుడు. వేదం జీవన నాదం అంటూ వేదాలను ప్రజా జీవితంలోకి తెచ్చి వచన రూపంలో అందించిన సాహితీ పిపాసి. నవసమాజం కోసం తాపత్రయపడిన ఉద్యమశీలి.
ప్రజా ఉద్యమంలో వేద భారతాన్ని అన్వేషించిన అక్షర తపస్వి. అమృత వాత్సల తేజస్వీ డాక్టర్ దాశరధి రంగాచార్య.. ఆయన శ్వాస, ధ్యాస అంతా మానవ శ్రేయస్సు గురించే. సమసమాజ ఆవిష్కరణ గురించే సద్గుణ సంపన్నుడైన సద్గుణ మానవున్ని దర్శించాలన్నదే ఆయన మహా సంకల్పం..
తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్‌కు ముచ్చెమటలు పట్టించారు దాశరధి రంగాచార్య. తెలంగాణ మట్టి జీవితాన్ని, వెట్టి జీవితాన్ని అక్షరాల్లోకి ఎలుగెత్తి చాటిన రచయిత, ఉద్యమకారుడు దాశరథి రంగాచార్య. తన రచనలతో పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. రంగాచార్య చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలను చవిచూశారు. దాశరథి రంగాచార్య పుట్టింది పండిత కుటుంబమే అయినా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వీరి అన్న దాశరథి కృష్ణమాచార్యుల నుంచి అభ్యుదయ భావాలను అలవర్చుకున్నారు రంగాచార్యులు. తెలంగాణ సాయుథ పోరాటంలో ఇద్దరూ కలిసి సైనికులుగా పనిచేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ఉద్యమ జీవితాన్ని సాహిత్య రూపంలో ప్రజలకు అందించారు రంగాచార్య.
12 ఏళ్ల వయస్సులోనే నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు రంగాచార్య. నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ పోరాటాలకు ఆకర్శితులై వాటి తరపున ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు దాశరథి రంగాచార్య. 1948లో పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్‌కు విముక్తి లభించింది. సాయుధ పోరాటం విరమణ తర్వాత ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 32 ఏళ్లు ఉద్యోగం చేసి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైరయ్యారు.
తన 40 ఏళ్ల జీవితంలో అక్షర ప్రస్థానం ప్రారంభించి ఎన్నో నవలలు, గ్రంధాలు రాశారు. శ్రీమద్రామాయణం, మహాభారతాలను సరళంగా తెలుగులో రాశారు దాశరథి రంగాచార్య. తెలుగు సాహిత్య చరిత్రలో మోదుగుపూలు, చిల్లరదేవుళ్లు, జనపది, రానున్నది ఏది నిజం, మాయజలతారు వంటి ఎన్నో అద్భుతమైన నవలలు ఆయన కలం నుంచి జాలువారాయి. తన ఆత్మకథగా వచ్చిన జీవనయానం కూడా తెలంగాణ ఉద్యమం, ప్రజల జీవన స్థితిగతులను చాటిచెబుతోంది.
వేదవాఙ్మయాన్ని ప్రజలందరికి చేర్చడానికి అభ్యుదయ దృక్పథమే తనను పురిగొల్పిందని ఆయన చెప్పుకున్నారు. వేదాలను స్త్రీలు, శూద్రులు చదవకూడదనే దృక్పథాన్ని ఆయన తోసిపుచ్చారు. దాశరథి రంగాచార్య జీవన యానం చదివితే మొత్తం ఆయననే చదివినట్టే. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో సమగ్రంగా చదివినట్టు.
ఒడ్డున కూర్చుని పుంఖానుపుంఖాలుగా రచనలు చేసిన వారికి పూర్తి భిన్నంగా, తెలంగాణ కవుల సంప్రదాయానికి అనుగుణంగా స్వయంగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల పక్షం నిలిచారు. తన నెత్తిపై నుంచి తుపాకి గుండు దూసు కుపోయినా చలించని ధీశాలి రంగాచార్య.
రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్లు పలు భాషల్లోకి అను వాదమైంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. ‘అభినవ వ్యాసుడిగా’ బిరుదు అందుకున్న రంగాచార్య 2015 జూన్ 8వ తేదీన కన్నుమూశారు. అక్షర వాచస్పతి దాశరథి రంగచార్యులు పుట్టిన మహబూబాద్ జిల్లాకు దాశరథి జిల్లాగా పేరు పెట్టాలి. వారి కాంస్య విగ్రహాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలి. ప్రతీ కవి, రచయిత, సాహితీ వేత్త వారిని స్ఫూర్తిగా తీసుకుని రచనలు చేయాలి.
- కామిడి సతీష్ రెడ్డి
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
9848445134.
(నేడు దాశరథి రంగాచార్యులు జయంతి)