పటాన్చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు రెవెన్యూ డివిజన్ సేవలు అత్యంత అవసరమని ఇటీవల పటాన్చెరులోనిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
దీంతోపాటు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరులో పాలిటెక్నిక్ కళాశాల లేకపోవడం మూలంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదని విన్నవించామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ప్రజల సమక్షంలోని హామీలు ఇవ్వడంతో పాటు, గురువారం వీటికి సంబంధించిన జీవోలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
ఇప్పటివరకు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో గల పటాన్చెరువు, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మండలాలతో కూడిన పటాన్చెరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. నూతన పాలిటెక్నిక్ కళాశాలకు సైతం అతి త్వరలో స్థలం కేటాయించి భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో పటాన్చెరుకి సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీరో జారీ చేసిందని, ఇందుకు సంబంధించి పలువురు అభ్యంతరాలు లేవనెత్తడంతో.. కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసి తిరిగి ఉత్తర్వులిచ్చారన్నారు.
వచ్చేనెల సెప్టెంబర్ రెండవ వారంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు పనులకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. వీటితోపాటు ఉస్మాన్ నగర్ లో ఐటీ టవర్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత శాఖ సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు.
ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు వాటి అమలుకు కృతనిచ్చయంతో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతో పాటు, సంక్షేమంలో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నామని తెలిపారు. వీటితోపాటు మండల కేంద్రమైన గుమ్మడిదలలో మినీ స్టేడియం, జూనియర్ కాలేజ్, వ్యవసాయ గోదాం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.