Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Mother Teresa: థెరీసా అమ్మ మాత్రమే కాదు.. దేవత కూడా..

Mother Teresa: థెరీసా అమ్మ మాత్రమే కాదు.. దేవత కూడా..

దయ, దాతృత్వం మూర్తీభవించిన కరుణా మూర్తి

ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీ తంగా యేమీ ఆశించకుండా నిస్వార్థంగా కేవలం మానవత్వంతో మానవసేవ చేసే మానవ మూర్తులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండరు…! కొంత మంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమందిలో తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా సేవకే అంకితం చేసిన వారు చాలా అరుదుగా ఉంటారు. ఇటు వంటి వారిలో మహిళలు అయితే వ్రేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. వారిలో ప్రథమ స్థానాన్ని పొందే అర్హత కేవలం ఒకే ఒక్క వ్యక్తికి సొంతం..! ఆ మహిళా మూర్తే మేరీ తెరెసా బోజాక్సియు….! ఇంతకీ ఎవరీమే..? ఆవిడే మథర్‌ థెరీసా.. ఆమె అల్బేనియన్‌ కాథలిక్‌ తల్లిదండ్రులైన నికోలా మరియు డ్రానాఫైల్‌ బోజాక్షియులకు ఆగస్ట్‌ 26, 1910వ సంవత్సరంలో మూడవ సంతానంగా మాసిడోని యాలోని స్కోప్జేలో జన్మించారు. ఆమె తండ్రి ఒక వ్యాపార వేత్త, తల్లి గృహిణి. ఈమెకు ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, ఆమె తండ్రి అనుకోకుండా మరణించారు. బోజాక్షియు కుటుంబం ఆర్థికంగా అతలాకుతలమయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో యేమి చెయ్యాలో తోచక ముగ్గురు పిల్లల ఒంటరి తల్లి అయిన డ్రానాఫైల్‌ కుటుంబ పోషణ నిమిత్తం వస్త్రాలు మరియు ఎంబ్రాయిడరీని విక్రయించే చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈమెను సన్యాసినిగా దేవుణ్ణి సేవించాలని ఆమె భావించడం జరిగింది. సన్యాసిని కావాలని నిర్ణయించుకోవడం చాలా కష్టమైన నిర్ణయం. సన్యాసిని అవ్వడమంటే పెళ్లి చేసుకోవడానికి మరియు పిల్లలను కనే అవకాశాన్ని వదులుకోవడమే కాదు, ఆస్తులను మరియు కుటుంబాన్ని, శాశ్వతంగా వదులుకోవాలాని ఈమెకు తెలుసు. ఐదేళ్లపాటు మదర్‌ థెరిసా సన్యాసినిగా మారాలా వద్దా అని గట్టిగా ఆలోచించింది. ఈ సమయంలో, ఆమె చర్చి గాయక బృందంలో పాటలు పాడేవారు, చర్చిలో కార్యక్రమాలను నిర్వహించడంలో తన తల్లికి సహాయకారిగా ఉండేవారు. పేదలకు ఆహారం మరియు సామా గ్రిని అందించడంలో తన తల్లికి చేదోడువాదోడుగా ఉండే వారు. చివరకి బలీయమైన లక్ష్యంతో సన్యాసిని కావాలని నిర్ణయించుకుంది. అప్పటికి ఈమె వయస్సు 17 సంవత్స రాలు. ఐర్లాండ్‌లో ఉన్న లోరెటో సన్యాసినులకు దరఖాస్తు చేసింది.
భారతదేశంలో క్యాథలిక్‌ మిషనరీలు చేస్తున్న పని గురించి అనేక కథనాలను చదివిన ఈమె జనవరి 6, 1929న మనదేశానికి చేరుకుంది. రెండేళ్ల తర్వాత, మే 24, 1931న లోరెటో సన్యాసినిగా తన మొదటి ప్రమాణం చేసింది. సన్యాసినిగా, మదర్‌ థెరిసా (అప్పట్లో సిస్టర్‌ థెరిసా అని మాత్రమే పిలిచేవారు, తరువాత సెయింట్‌ థెరిసా ఆఫ్‌ లిసియక్స్‌ ఆమె ఎంచుకున్న పేరు) కోల్‌కతాలోని లోరెటో ఎంటల్లీ పాఠశాలలో స్థిరపడ్డారు. ఇక్కడ పాఠశాలో చరిత్ర మరియు భూగోళశాస్త్రం బోధించేవారు. సాధారణంగా, లోరెటో సన్యాసినులు పాఠశాల నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు. అయితే, 1935 లో, 25 ఏళ్ల థెరిసా పాఠశాల వెలుపల ఉన్న సెయింట్‌ థెరిసాస్‌ పాఠశాలలో బోధించడానికి ప్రత్యేక మినహా యింపు ఇవ్వబడింది. సెయింట్‌ థెరిసాలో రెండు సంవత్సరాల తరువాత, థెరిసా మే 24, 1937న తన ఆఖరి ప్రమాణం చేసి అధికారికంగా ‘మదర్‌ థెరిసా’ అయ్యారు. ఆమె తన చుట్టూ ఉన్నవారి బాధలు, మరియు కష్టాలను చూసి తట్టుకోలేకపోయారు, అందుకే ఆమె తన శేష జీవితాన్ని పేదలు మరియు అణగారిన వర్గాల వారికి సేవ చేయాలని, జీవితాంతం సేవకే అంకితం అవ్వాలని ధృఢంగా నిర్ణయించుకున్నారు. దీనికిగాను మదర్‌ థెరిసా ఆగస్ట్‌ 16, 1948న పాఠశాలను విడిచిపెట్టి కలకత్తాలోని మురికి వాడల్లో చిన్న గుడిసెలో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అక్టోబర్‌ 7 1950వ సంవత్సరంలో ఆకలితో ఉన్నవారు, నగ్నంగా ఉన్నవారు, నిరాశ్రయులు, వికలాంగులు, అంధులు, కుష్ఠురోగులు, సమాజం అంతటా అవాంఛనీయమైన, ప్రేమించబడని, పట్టించుకోనట్లు భావించే వారందరికీ సేవ చేయాలనే లక్ష్యంతో కలకత్తాలో (ఇప్పుడు కోల్‌కతా) 12 మంది సభ్యులతో ఒక చిన్న సంఘంగా ప్రారంభమైంది. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ కలకత్తా అంతటా లెప్రసీ-ఔట్రీచ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. మందులు, డ్రెస్సింగ్‌లు మరియు ఆహారాన్ని అందజేసేది. ఆసుపత్రులు బతికే అవకాశం ఉన్న రోగులతో నిండిపోతుండగా, మదర్‌ థెరిసా మరణిస్తున్న వారి కోసం ఆగస్ట్‌ 22, 1952న నిర్మల్‌ హృదయ్‌ (ప్లేస్‌ ఆఫ్‌ ది ఇమ్మాక్యులేట్‌ హార్ట్‌”) అనే ఇంటిని తెరిచారు. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిరాశ్రయులైన పిల్లలు, అనాధ పిల్లల కోసం 1955లో, మదర్‌ థెరిసా నిర్మల శిశు భవన్‌ని ప్రారంభించారు. భారతదేశంలోని మురికివాడలలో, పెద్ద సంఖ్యలో ప్రజలు కుష్టు వ్యాధి బారిన పడ్డారు. ఆ సమయంలో, కుష్ఠు రోగులు (కుష్టు వ్యాధి సోకిన వ్యక్తులు) వారి కుటుంబాల నుండి బహిష్కరించబడ్డారు. కుష్ఠురోగుల పట్ల విస్తృతమైన భయం కారణంగా, నిర్లక్ష్యం చేయబడిన ఈ ప్రజలకు సహాయం చేయడానికి మదర్‌ థెరిసా ఒక మార్గాన్ని కనుగొనడానికి చాలా కష్టపడ్డారు. చివరికి లెప్రసీ ఫండ్‌ మరియు లెప్రసీ డేని ఏర్పాటు చేసి వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మరియు కుష్టురోగులకు వారి ఇళ్ల దగ్గర మందులు మరియు బ్యాండేజీలను అందించడానికి అనేక మొబైల్‌ లెప్పర్సీ క్లినిక్‌లను (మొదటిది సెప్టెంబర్‌ 1957లో ప్రారంభించబడింది) స్థాపించారు. 1960ల మధ్య నాటికి, మదర్‌ థెరిసా కుష్టురోగులు నివసించడానికి మరియు పనిచేయడానికి శాంతి నగర్‌ (‘ది ప్లేస్‌ ఆఫ్‌ పీస్‌’) అనే కుష్టురోగి కాలనీని స్థాపించారు. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి భారతదేశం వెలుపల సంస్థలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వబడింది. మొదటిది 1965లో వెనిజులాలో స్థాపించబడింది. కొద్ది కాలానికే ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ హౌస్‌లు ఏర్ప డ్డాయి. మదర్‌ థెరిసా యొక్క మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్థాయిలో సేవలందించాయి.1980లలో, మదర్‌ థెరిసా, అప్పటికే తన 70వ ఏట, న్యూయార్క్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, డెన్వర్‌ మరియు ఇథి యోపియాలోని అడిస్‌ అబాబాలో ఎయిడ్స్‌ బాధితుల కోసం గిఫ్ట్‌ ఆఫ్‌ లవ్‌ హోమ్‌లను ప్రారంభించింది. 1996 నాటికి, మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ 100 దేశాలలో 517 మిషన్లను కలిగి ఉంది. సిస్టర్ల సంఖ్య పన్నెండు నుండి వేలకు పెరిగింది.
అవార్డులు మరియు గుర్తింపు
ఈమె 1962లో పద్మశ్రీ మరియు 1969లో అంత ర్జాతీయ అవగాహన కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ అవార్డును అందుకుంది. ఇంకా ఈ సంవత్సరములోనే శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన కోసం రామన్‌ మెగసెసే అవార్డును అందుకున్నారు అంతర్జాతీయంగా 1979 లో శాంతి విభాగంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ అవార్డు అందుకున్నారు. 1980లో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న బహుకరించబడింది. ఆమె పుట్టిన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, భారత ప్రభుత్వం 28 ఆగస్టు 2010న ఒక ప్రత్యేక రూ. 5 నాణెంని విడుదల చేసింది.
మరణం: 87 సంవత్సరాల వయస్సులో ఆమె 5 సెప్టెంబర్‌ 1997లో కలకత్తాలో మరణించారు. 2016 వ సంవత్సరంలో ఆమెను సెయింట్‌ థెరిసాగా ప్రకటించారు.
ఆమె ప్రపంచానికి ఒక ప్రేరణ: వినయం, దయ మరియు దాతృత్వం యొక్క పరిపూర్ణ మిశ్రమం. పేద, నిస్సహాయ ప్రజలకు ఆమె నిస్వార్థ సేవకు పేరుగాంచింది. ఆమె తన జీవితమంతా భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో గడిపింది.

  • డీజే మోహన రావు
    9440485824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News