నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, గత జూలైలో ధరల సూచి 11.5 శాతానికి చేరుకుంది. 2014 తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఇంతగా పెరిగిపోవడం ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం ప్రభుత్వం ధరల పెరుగుదలను అరికట్టడానికి మరో పెద్ద ప్రయత్నం చేసింది. ఉల్లిపాయల ఎగుమతి మీద 40 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. తక్షణమే అమలులోకి వచ్చే ఈ ఆదేశాలు డిసెంబర్ 31 వరకూ అమలులో ఉంటాయి. గత జూలైలో బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం విదితమే. అంతేకాదు, అంతకు ముందు నెలలో కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఎగుమతి మీద కూడా నిషేధం విధించడం జరిగింది. గత ఏడాది ఉల్లిపాయల ఉత్పత్తి 65 శాతానికి పైగా పెరిగింది. దేశంలో మొత్తం ఉల్లిపాయల వినియోగంలో దేశీయ ఉత్పత్తి 8 శాతం వరకూ ఉంటుంది. వీటి నిల్వలను మరో రెండు లక్షల టన్నులకు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది.
అయితే, దేశంలోని ఉల్లిపాయల ఉత్పత్తిదారులు ఈ చర్యల పట్ల తీవ్ర నిరుత్సాహం, నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని విధంగా ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల లబ్ధి పొందిన ఉత్పత్తిదారులకు ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఉల్లిపాయల ధరలు గణనీయంగా పడిపోతాయని, దీనివల్ల తాము నష్టాలను చవి చూడాల్సి వస్తుందని వారు భయాందోళనలు చెందుతున్నారు. ఆసియాలోనే అత్యధికంగా ఉల్లిపాయలు పండించే నాసిక్ లో ఉత్పత్తిదారులు ఇందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ఒక రోజు మార్కెట్ బంద్ కూడా పాటించారు.
భారతదేశంలో మొత్తం ఉల్లిపాయల పంటలో 60 శాతం పంట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనే పండుతుంది. ఈ రాష్ట్రాలలో ఈ నెల అత్యధికంగా వర్షాలు పడినప్పటికీ, జూలైలో అసలు వర్షాలే లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ లో ఈ పంట దిగుబడి ఏ స్థాయిలో ఉంటుందోనని ఉత్పత్తిదారులు బెంబేలు పడుతున్నారు. రెండు నెలల క్రితం వరకూ కిలో 23 రూపాయలున్న ఉల్లిపాయ ధరలు గత నెల 31 రూపాయలకు చేరుకున్నాయి. దేశంలో కూరల్లో అత్యధికంగా వాడే ఉల్లిపాయలు, టమేటాల ధరలు ఈ విధంగా పెరుగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ పెరుగుదలను బట్టి సెప్టెంబర్ నెలలో ఉల్లిపాయల ధర కిలో 70 రూపాయలకు చేరే అవకాశం కనిపిస్తోంది.
మార్కెట్ ధర నిర్ణయించకుండా ఉల్లిపాయల ఎగుమతి మీద భారీగా సుంకాన్ని విధించడంతో ఆందోళన, ఆగ్రహం చెందుతున్న ఉత్పత్తిదారులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ఆహారం, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెంటనే రంగప్రవేశం చేశారు. ప్రభుత్వమే క్వింటాల్ 2,410 రూపాయల చొప్పున చరిత్రాత్మక ధరకు ఉల్లిపాయలు కొనుగోలు చేస్తుందని ఆయన ఉల్లిపాయల ఉత్పత్తిదారులకు హామీ ఇచ్చారు. అవసరమైతే ఉల్లిపాయల నిల్వలను మరింతగా పెంచుతామని కూడా ఆయన అభయమిచ్చారు. అయితే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక నివేదికలో ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. ఏ నిత్యావసర వస్తువు ఎగుమతి పైన అయినా నిషేధం విధించే పక్షంలో ఈ వస్తువుకు కొరత ఏర్పడబోతోందన్న భయాందోళనలు మార్కెట్లో చోటు చేసుకుంటాయని ఆ నివేదిక తెలిపింది. దీనివల్ల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని అది పేర్కొంది.
వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య ఏవిధంగా సమతూకం పాటిస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. ఇక ప్రభుత్వం పట్టుదలగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పంట పండించ డానికి సంబంధించిన ప్రాధాన్యాలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ పంటలకు కొత్త ఏడాదిలో కొరతలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ధరల పెరుగుదల కారణంగా ఏ నిత్యావసర వస్తువుల ఎగుమతిపై నిషేధాలు విధించడం జరిగిందో అవే వస్తువులకు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకు బదులుగా సరఫరాలను క్రమబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూరగాయాలు, ధాన్యాల విషయంలో తప్పనిసరిగా సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. మార్కెట్ విధానాలను, ఆర్థిక విధానాలను అందుకు తగ్గట్టు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, గత నెల నేపాల్ నుంచి టమేటాలను దిగుమతి చేసుకుని, ఇక్కడ ధరలను, కొరతను నియంత్రించడం జరిగింది. అదే విధానాన్ని శాశ్వత ప్రాతిపదికన కొనసాగిస్తే టమేటాల సరఫరాతో సమస్య ఉండదు.
bans on necessities: నిత్యావసరాలపై కొత్త నిషేధాలు
ఉత్పత్తిదారులు ఇందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు