Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Kautilya: కౌటిల్యుని అర్థశాస్త్రం : ఒక పరిశీలన

Kautilya: కౌటిల్యుని అర్థశాస్త్రం : ఒక పరిశీలన

అర్థ శాాస్త్రం ఓ ఎన్ సైక్లోపీడియా

కౌటిల్యుడు @ దాణుక్యుడు @ విష్ణు గుప్తుడు మౌర్య సామ్రాజ్య నిర్మాత చంద్రగుప్తుని గురువు. నందవంశ రాజులతో తాను చేసిన శఫదాన్ని నెరవేర్చుకునే క్రమంలో చంద్రగుప్త మౌర్యునికి సరైన దిశా నిర్దేశం చేసే నంద వంశాన్ని కూలదోసి మౌర్య వంశానికి అంకురార్పణ చేసిన మహా మేధావి. క్రీస్తు పూర్వం 3 మరియు 4 శతాబ్దాల మధ్యకాలంలో భారతదేశంలో ప్రభావాన్ని చూపిన కొద్దిమందిలో చాణుక్యుడు ఒకరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కౌటిల్యుడు, గోత్రసంబంధ నామం చాణుక్యుడు. అందరూ పిలిచే నామం విష్ణు గుప్తుడు. తక్షశిల విద్యాలయ విద్యార్ధి, ఉపాధ్యాయుడు అయిన కౌటిల్యుడు ఎప్పుడో 2350 సంవత్సరాల కిందట రాసిన ఒక పుస్తకం నేటికీ జన సామాన్యంలో నానుతుంది అంటే, మేధావుల చర్చల్లో విరివిగా వాడబడుతుంది అంటే అదెంత ప్రామాణికమైనదో చెప్పకనే చెప్పవచ్చు. మారిన కాలంలో నేడా పుస్తకం అందులోని విషయాలు ఆచరణ సాధ్యం కానివే కావచ్చు. అప్రస్తుతాలే కావచ్చు కాని నేటి మన న్యాయసూత్రాలకు, పరిపాలనా సూత్రాలకు మూలాలు అందులో నుండే. ఏర్పడ్డాయంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
అర్ధశాస్త్రం అనే పేరు వినగానే అందరి మదిలో మెదిలేది అది ఆర్ధిక సంబంధ వ్యవహారాల గురించి, ఆర్ధిక నిర్వహణ గురించిన గ్రంధం అనే అనుకుంటారు. వాస్తవానికి కౌటిల్యుని అర్ధశాస్త్రం పరిపాలనకు సంబంధించినది, ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే శిక్షాస్మృతికి సంబందించిన శాస్త్రం ఇది. రాచరిక పరిపాలన ఏ విధంగా ఉంటే దృఢంగా మనగలుగుతుంది, మంత్రులను నియమించుకోవడంలో ఏవిధమైన మెలకువలను పాటించాలి. గూఢ చారుల పాత్ర, రకాలు, రాజ్య పరిపాలన సులభతరం కావడానికి రాజ్యాన్ని పట్టణాలు, పల్లెలుగా ఎలా విభజించాలి, వాటిని ఎవరి అదుపాజ్ఞలలో ఉంచాలి. న్యాయస్థానాల ఏర్పాటు, వివిధనేరాలు, శిక్షలు, ప్రత్యేక విభాగ అధిపతులు, యుద్ధ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉద్యోగులు ఎన్నిక, వారిని అదుపుచేయడం, పొరుగు రాజ్యాలతో మెలగవలసిన తీరు, నగరాల నిర్మాణ పద్ధతులు, విద్య, వివిధ వర్ణాల భాద్యతలు, రాజమందిరాలలో పాటించాల్సిన మర్యాదలు ( ప్రోటోకాల్స్‌), రాజు మరణిస్తే వారసులు ఎన్నిక విధానం, పరిపాలనలో రాజు. వ్యవహరించాల్సిన తీరు, ఆక్రమించిన రాజ్యాలతో, అక్కడి ప్రజలతో వ్యవహరించవలసిన తీరు తదితర అంశాలను స్పృశించిన గ్రంథమిది. ఒకరకంగా ఆనాటి రాజ్యాలకు ఇది రాజ్యంగమనే చెప్పవచ్చు. సంస్కృతంలో రచించబడిన ఈ గ్రంథంలో మొత్తం 15 అధికరణాలు, 150 అధ్యాయాలు, 180 ప్రకరణలతో సుమారు 5 వేల శ్లోకాలు కలిగిన విస్తృత గ్రంథం కౌటిల్యుని అర్థశాస్త్రం.
అర్థశాస్త్రం మొదటి ప్రకరణలో మొదటి అధ్యాయం వివిధ ప్రకరణాలను విశదీకరిస్తుంది. మొదటి ప్రకరణ మిగతా అధ్యాయాలు పదవులకు అర్హులైన వారిని మంత్రులుగా ఎన్నుకోవడం, వారిమీద నిఘా ఉంచడం, గూఢచారులు ఎన్నిక, వారి విభజన, రాజ అంతఃపుర నియమావళి, రాజకుమారుల విధి, రాజు విధినిర్వహణ, ఆత్మ రక్షణ తదితరాలను వివరించడం జరిగింది. త్రయి, వార్త (వ్యాపార సంబందం), దండనీతి ఇవి మాత్రమే నాటి విద్యలు. త్రయీ విద్యలో అన్విక్షకి కూడా భాగమే. అన్విక్షకి అనగా సాంఖ్యము, యోగము, లోకాయతనము ( నాస్తికవాదం) మూడింటి కలయిక. త్రయీ అంటే మూడు వేదాలు. రెండో అధికరణలో వ్యవసాయ భూముల నిర్వహణ, వినియోగంలో లేని భూములను ఉపయోగించవలసిన తీరు, ఉద్యానవనాల నిర్మాణం, రాజ్యపరి పాలనా నిమిత్తం అవసరమైన వివిధ భవనాల నిర్మాణం, గనుల శాఖ, సముద్ర వ్యాపారం, స్వర్ణ వ్యాపారం, విదేశాంగ శాఖ, పరిశ్రమల శాఖ, ఆయుదాగార నిర్వహణ తదితర శాఖల అద్యకుల నియామకాలు, ఉద్యోగుల నియామకం, అదుపు, పట్టణ నాయకుల ఎన్నిక, గ్రామాల పరిపాలనాధికారులు ఎన్నిక తదితర అంశాలను రెండవ ప్రకరణలో వివరించడం జరిగింది. వివిధ ఒప్పందాలు, ఉల్లంగనలు, శిక్షలు, తాకట్లుకు సంబంధించిన విధివిధానాలు, న్యాయ స్థానాల ఏర్పాటు, న్యాయస్థానంలో దావాలు ఏవిధంగా వేయాలి ఆదిగా గల అంశాలు మూడవ ప్రకరణలో విశదీకరించారు. న్యాయస్థానా ప్రక్రియ సంపూర్ణంగా వివరించారు. వారి దావాలో వ్రాసింది కాకుండా వేరుగా మాట్లాడినా, ప్రతివాదికి సరైన జవాబు ఇవ్వలేకపోయినా, సరైన సమయంలో దావా నడుపలేక పోయినా దావా కొట్టివేయబడును. అందుకు గాను అతను దండము చెల్లించవలెను. అడ్మిషన్‌లు, కన్ఫెషన్‌లు (నేర అంగీకారాలు) వివరించారు. మూడో అధికరణం రెండవ అధ్యాయంలో వివాహ సంబంద న్యాయాలను సవిస్తారంగా చర్చించారు.

- Advertisement -

9 రకాల వివాహాలు చర్చించారు, మొదటి నాలుగు తండ్రి సమ్మతిస్తి ధర్మ వివాహాలు అవుతాయి. ఎందుకంటే శుల్కాన్ని తీసుకునేది అతనే గనుక ( అంటే ఆ కాలంలో కన్యా శుల్కం ఉన్నది అని అర్ధం). భరణము, అలంకారాలు( నగలు ఆది వస్తువులు) స్త్రీ ధనము. అయితే రెండు వేల మణుగులకు మించనిది మాత్రమే భరణము, అలంకారానికి పరిమితి లేదు (అంటే శుల్కానికి పరిమితి ఉన్నది). భర్త చనిపోతే ఆ భరణాలు ఆమెక చెందును, ఒకవేళ మారు వివాహం చేసుకుంటే తిరిగి ఇవ్వాలి. ఆ కాలంలో స్త్రీ మారు వివాహాలు నిషేధం కాదు. అనేక రకాల వివాహాలలో స్త్రీ పురుష విడాకులు కూడా ఉన్నాయి. విడిపోయి మళ్ళీ వివాహం చేసుకున్న స్త్రీ. మొదటి భర్త ఇచ్చిన భరణం తిరిగి అతనికి చెల్లించాలి. భార్య గొడ్రాలు అయితే 8 సంవత్సరాల తరువాత, గర్భస్రావం అవుతుంటే 10 సంవత్సరాల తరువాత, అందరూ ఆడపిల్లలే పుడుతుంటే 12 సంవత్సరాల తరువాత భర్త మళ్ళీ పెండ్లి చేసుకోవచ్చు. బార్యలకు నష్టపరిహారం చెల్లించి బహు భార్యత్వం చేసుకోవచ్చు. ఆడవారికి 12 సంవత్సరాల వయసు, పురుషునికి 16 సంవత్సరాల వయసు వ్యవహార ప్రాప్తి వయసు (మెజారిటీ), ఆ తరువాత వివాహం చేసుకోకపోవడం చట్టవిరుద్ధం. పరస్పర అంగీకారం లేని విడాకులు లేవు. తొందరగానే తిరిగి వస్తానని దేశాంతరానికి వెళ్లిన శూద్ర, వైశ్య, కత్రియ, బ్రాహ్మణుల భార్యలు పిల్లలు లేని పక్షంలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ వివాహం చేసుకోవచ్చును. అధ్యాయానికై వెళ్ళిన బ్రాహ్మణుని భార్య పిల్లలు లేని పక్షంలో 10 సంవత్సరాలు, పిల్లలున్నచో 12 సంవత్సరాల తరువాత వివాహం చేసుకోవచ్చు. రాజోద్యోగి భార్య యావజ్జీవం ఎదురు చూడాలి. తండ్రి ఆస్తికి కొడుకులు వారసులు, కొడుకులు లేని పక్షంలో ధర్మ వివాహానికి కలిగిన కూతుళ్ళు వారసులు, వారు కూడా లేని పక్షంలో అతని సోదరులు వారసులు. ఒకే గర్భమున పుట్టిన సోదరులు వేరు వేరు తండ్రులు ఉన్నట్లైతే వారి తండ్రుల ఆదరంగా విభజన చేసుకోవాలి. వర్ణాంతర వివాహం చేసుకున్నట్లయితే ఆయా వర్ణాల ఆధారంగా ఆస్తిలో కుమారుల వాటా నిర్ణయమౌతుంది. ఉదాహరణకు బ్రాహ్మణునికి శూద్ర స్త్రీ వలన పుట్టిన కొడుక్కు ఆస్తిలో మూడవ వంతు మీద మాత్రమే హక్కు ఉంటుంది. బ్రాహ్మణునికి వైశ్య స్త్రీ వలన పుట్టినవాడు ‘అంబష్టుడు’. బ్రాహ్మణునికి శూద్ర వనిత వలన కలిగిన వాడు నిషాదుడు లేక పాఠశవుడు. క్షత్రియునికి, శూద్ర స్త్రీ వలన జన్మించినవాడు ఉగ్రుడు, వైశ్యునికి శూద్ర వనితకు పుట్టినవాడు శూద్రుడు. శూద్రునికి బ్రాహ్మణ స్త్రీతో జన్మించిన వాడు చండాలుడు, శూద్రునికి వైశ్య స్త్రీతో జన్మించిన వారు అయోగవులు, శుద్రునికి క్షత్రియ స్త్రీతో జన్మించన వారు కత్తెలు. వైశ్యునికి క్షత్రియ స్త్రీ వలన పుట్టినవారు మాఘదులు. వైశ్యునికి బ్రహ్మణ స్త్రీ వలన జన్మించిన వారు వైదేహకులు. క్షత్రియునికి బ్రాహ్మ ణ భార్య వలన జన్మించిన వారు సూతులు. పురాణాల్లో చెప్పబడిన సుతమాగాదులు వీరు కాదు. నగరంలో ఇండ్ల నిర్మాణం, ముందు వెనుకల విడువవలసిన ఖాళీ ప్రదేశం తదితరాలు వివరించారు. అమ్మ జూపిన ఆస్తిని కొనుక్కునే మొదటి హక్కు ఆయా వంశీయులది. తరువాత పక్కింటి వారిది. తరువాత అప్పిచ్చిన వారిది ఆ తరువాత మిగతా వారిది. గ్రామాల మద్య భూవివాదాల పరిష్కార మార్గాలు చూపినారు. చెరువుల నిర్మాణం, ఆయా నీటి పన్నుల మినహాయింపు కాలాలు వివరించారు. నూరు పణములకు (రూపాయలకు) ఒకటిన్నర రూపాయలు ధర్మ వడ్డీ, వ్యాపారునికి 5 రూపాయలు ధర్మ వడ్డీ, అరణ్యంలో పోయేవానికి పది రూపాయలు ధర్మ వడ్డీ, నౌకాయానం చేసేవానికి 20 రూపాయలు ధర్మ వడ్డీ. 10 సంవత్సరాల తర్వాత అప్పుల మీద వాజ్యము చెల్లదు. (లిమిటేషన్‌ అయిపో తుంది). ఎవరెవరు సాక్షులుగా ఉండవచ్చు, వారి సాక్షానికి ఎంత విలువ ఇవ్వవచ్చో వివరించారు. తనవద్ద తాకట్టులో ఉన్న స్త్రీని బలవంతంగా కోరుకుంటే శిక్షార్హము. వివిధ ఒప్పందాలు, పొత్తు వ్యవహారాల గురించి, పెద్ధతుల గురించి వివరంగా మూడవ అధికరణలో చెప్పడం జరిగింది. శుద్ధమైన గవ్వలను అందించని జూద శాల యజమానులు శిక్షార్హులు. గెలిచిన సొమ్ములో 5 శాతం జూద శాల యజమానికి చెందును, దానితోపాటు గవ్వలకు, ఇతరత్రాలకు కిరాయి చెల్లించాలి.
రాజ్య రక్షణ, ప్రవాసుల రక్షణ, గూడచారుల మీద నిఘా, మృతశరీరాల పరీక్ష ( హత్య లేక సహజ మరణమా తెలుసుకోవడం కొరకు), నిర్ధారణకు ఉపయుక్తమైన సూచనలు, నిందితులను విచారించవలసిన తీరుతెన్నులు, వారినుండి సేకరించవలసిన సమాచారం, రాచవస్తువులను దొంగిలించే వివిధ ఉద్యోగులకు విధించే శిక్షలు, న్యాయబద్ధంగా తీర్పు చెప్పని న్యాయాధికారులకు విధించే శిక్షలు, అదుపులో ఉన్న స్త్రీలను, నిందితులు భార్యలను బలాత్కరించిన (కష్టోడియల్‌ రేప్‌) అధికారులకు విధించవలసిన శిక్షలు, పెంపుడు జంతువులను దొంగతనం చేసినవారికి, చంపిన వారికి విధించవలసిన శిక్షలను, జంతువులకై కేటాయించిన అడవుల నుండి జంతువులను తెలలించినా, చంపిన వారికి విధించ వలసిన శిక్షలను, కలహంతో వ్యక్తులను గాయపరచిన వారికి ఏదించవలసిన శిక్షలను, సదరు వ్యక్తి తరువాత కొన్ని రోజులకు మరణిస్తే ఆ కాలాన్ని బట్టి వేయవలసిన శిక్షలను, నేర విచారణ క్రమంలో ఏ ఏ సందర్భాలలో బలప్రయోగం ( థర్డ్‌ డిగ్రీ) చేయవచ్చునో, రాజ్యం మీద తిరుగుబాటు. రాజుకు వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టడం లాంటి వారికి మరణశిక్ష విధించడం తదితరాలు నాలుగవ ప్రకరణలో విశదీకరించ బడ్డాయి, మొత్తం 18 రకాల బలప్రయోగాలను ( థర్డ్‌ డిగ్రీ ) రక్షకభట అధికారులు ప్రయోగించవచ్చు అని ఇందులో విశదీకరించారు. మనుష్య మాంసము విక్రయించువానికి మరణశిక్ష విదించబడింది. నీటితో ఉన్న చెరువు గట్టును తెంపితే అతన్ని నీటిలో ముంచి చంపివేసే శిక్షలు నిర్దేశించారు. ఒకే వర్గానికి చెందిన రజస్వల కాని కన్యను బలాత్కరిస్తే హస్తవద, ఒకవేళ ఆ కన్య చనిపోతే మరణశిక్ష నిర్దేశించారు. రజస్వల అయిన కన్యను బలాత్కరిస్తే చేతి వేళ్లు నరికివేయబడతాయి. ఒకవేళ ఆమె అంగీకరిస్తే వివాహం చేసుకోవచ్చు. రజస్వల అయిన 3 సంవత్సరాలలోపు సవర్ణున్ని చేసుకోవడం కన్యకు న్యాయసమ్మతం, ఆ తరువాత తన అలంకరణను వదిలేసి (తండ్రీ నగలు వగైరా) అపవర్ణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. కన్యను అపహరించిన వారికి, వేశ్యను లేక ఆమె కూతురును బలత్కరించిన వారికి శిక్షలు నిర్ణయించారు. తినుటకు నిర్దేశించని పదార్థాలను బలవంతంగా తినిపించి నవానికి (నాలుగు వర్ణాలలో ఎవరికీ తినిపించినా) శిక్షలు నిర్దేశించారు. వివిధ వ్యాపారులు, గ్రామ సందర్శకులు తమ వస్తువులను గ్రామాధికారికి, నగర అధికారులకు తెలియజేసి గ్రామంలో ఉంచుకోవచ్చును, ఒకవేళ సదరు వస్తువులు దొంగిలించబడితే, సంబందిత ప్రాణులు హత్యకు గురైతే ఆ గ్రామాధికారి, నగరాధికారి పరిహారము చెల్లించవలెను. (రాజ్యం యొక్క భాద్యత ). బలహీనంగా నిర్మించిన ఇండ్ల వలన, బలహీనంగా తయారైన బండి వలన, సరిగ్గా కప్పివేయని గోతుల వలన జరిగే ప్రమా దానికి ఆయ్యావ్యక్తులు బాధ్యులు ఆగుతారు. చెట్టును కొట్టినప్పుడు, జంతువులను మచ్చిక చేసుకోనునప్పుడు, కట్టడాలను కుల్చునప్పుదు, రాళ్ళను విసురునప్పుడు ముందస్తుగా హెచ్చరిక చేసినవ్యక్తి తదుపరి జరిగే ప్రమాదానికి బాధ్యుడు కాడు. నిషిద్ద వరుసలలో గల వ్యక్తులతో ( తల్లి తోబుట్టువు, మేనత్త తదితరులు) శృంగారం జరిపిన వ్యక్తికి త్రిలింగ చేదనం నిర్ణయించబడింది. సృష్టి విరుద్ధమైన పద్ధతిలో శృంగారం శిక్షార్హం. నిర్దోషిని శిక్షించిన రాజు ప్రాయశ్చిత్తంగా అంతకు అంతకు ముప్పైరెట్లు నష్టపరిహారం బ్రాహ్మణులకు చెల్లించాలి..
ఐదవ ప్రకరణలో రాజ్యంలో అంతరంగకలాహం రాకుండా, మంత్రులు, అధికారులు పైచేయి సాధించకుండా గురులను ఏవిధంగా ఉపయోగించుకోవాలి, వారి నెలా తెలివిగా శిక్షించాలి వివరించారు. రాజు ధనాగారం సమృద్దిగా ఉండేలా చూడాలి. ఉత్తమ పంటలో మూడవ లేదా నాలుగవ వంతు పన్నుగా స్వీకరించాలి. మిగాతాది పరిస్తితిని బట్టి నిర్ణయించాలి. కొత్త నివాసస్థానాలు ఏర్పడినప్పుడు వ్యవసాయానికి, గృహ నిర్మాణాలకు సాయం చేయాలి. పట్టను రైతుల కుటుంబ అవసరాలను మినహాయించి రాజు కొనుగోలు చేయాలి. వివిధ వ్యాపారుల మీద పన్నులు ఎలా విదించాలో ఈ ప్రకరణలో వివరించారు. వేశ్యా గృహాల మీద, వేశ్యల ఆదాయం మీద కూడా పన్నులు నిర్దేశించారు. రాజు కోశాగారాన్ని నింపుకోడానికి వివిధ కుటిల విద్యలు వివరించాడు. మంత్రులకు, రాజ పుత్రులకు, వివిధ ఉద్యోగులకు వేతనాలు నిర్దేశించాడు. ఆదాయంలో నాల్గవ వంతు జీతాల కింద ఇవ్వవచ్చని నిర్దేశించాడు. రాజుకు ఆపద సంభవించిన సమయంలో మంత్రి వ్యవహరించవలసిన తీరును ఇందులో వివరించారు. ప్రమాదమని తలచిన సామంతులను, తిరుగుబాటు దారులను ఏవిధంగా అణచివేయాలో వివరించారు.
ఆరో అనుకరణలో రాజ్యానికి ఉండవలసిన ఆరు అంగములను వివరించారు. రాజు, అమాత్యుడు, జనపదము, దుర్గము, కోశము, సేన, మిత్రుడు ఇవి ఆ ఆరు అంగాలు. వీటి లక్షణాలను సవివరంగా వివరించారు. పొరుగు రాజ్యాలతో అనుసరించవలసిన విధానాలు వివరించారు. ఏడవ అనుకరణలో సంధి చేసుకోవలసిన సందర్భాలను ఆయా సమయాల్లో నియమాలను వివరించారు. పొరుగు రాజ్యాలు ఆపదలో ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరుమీద వివరంగా విశదీకరించారు. ఎనిమిదవ ప్రకరణలో ఏకకాలంలో ఆపద వస్తే దండయాత్ర మంచిదా, దుర్గాన్ని రక్షించుకోవడం మంచిదా వివరించారు. అంతర్గత తిరుగుబాటు సంభవించినప్పుడు ధనాగారం, సైన్యం రాజు స్వాధీనంలో ఉండేవిధంగా చర్యలను నిర్దేశించారు. రాజుకు ఉండకూడని వివిధ బలహీనతలను (కామ, క్షోద, లోభా, మొహాది) వివరించారు. సైన్యంలో సామాన్యంగా చోటుచేసుకునే బలహీనతలు, వాటిని అధిగమించాల్సిన పద్దతులు సవివరంగా చెప్పారు. తొమ్మిదవ అనుకరణలో ఎప్పటికప్పుడు శత్రు బలాలను, ఇతర రాజుల బలాలను ఏవిధంగా అంచనా వేయాలో వివరించారు. క్షయ, వ్యయాల గురించి వివరించారు. పొరుగు రాజ్యాల వలన సంభవించబోయే వివిధ ఆపదలను వివరించారు. పడవ అనుకరణలో ఆపద కాలంలో, దండ యాత్రల సమయంలో సైన్యాన్ని ఏవిధంగా కాపాడుకోవాలో వివరించారు. కూటముల ఏర్పాటు, వివిధ యుద్ధ పద్ధతులు వివరించారు. యుద్ధానికి సరైన భూమిని ఎన్ను కోవడం. విడుదులు ఏర్పాటు చేసుకోవడం వివరించారు. పదకొండో అధికరణ వివిధ సంఘాల అధికారంలో ఉన్న రాజ్యాలను వశపరచుకోను విదానాలు, కుటిల ఉపాయాలు వివరించారు. ఆ సంఘంలో కలహాలు ఏవిధంగా పెట్టాలో వివరించారు. పన్నెండో అధికరణలో సామ దాన దండోపాయాలు పనిచేయనప్పుడు దూతకర్మ చేసి రాజీ చేసుకొని) అధికారాన్ని ఎలా నిలుపుకోవాలో వివరించారు. వివిధ కుటిల పద్దతుల ద్వారా శత్రువును ఏ విధంగా దారి తప్పించాలి. తుదముట్టించాలో వివరించారు. పదమూడవ ప్రకరణలో ఇతర రాజ్యాలలో తిరుగుబాటును ఏ విధంగా ప్రోత్సహించాలో వివరించారు. యోగుల రూపంలో గూడచారులను ఏర్పాటు చేసి, భక్తి భావాన్ని వాడుకుని ఇతర రాజులను ఏవిధంగా వంచించవచ్చో వివరించారు. జయించిన శత్రు రాజ్యంలో ఏవిధంగా ఉండాలో వివరించారు. పద్నాలుగవ ప్రకరణలో వివిధ విష ప్రయోగాలు, హత్యలు, అంగచేదనలు, రోగాల వ్యాప్తి ఎలా చేయవచ్చో వివరించారు. వివిధ ఔషదాలు, చికిత్సలు, తంత్రాలు, మంత్రాలు వివరించారు. పదిహేడవ ప్రకరణ తంత్రయుక్తులు వివరించింది. కావ్య విషయాన్నీ స్థూలంగా పరిశీలించింది.
కనిష్కుని అర్ధశాస్త్రం నేటి పరిస్థితులలో ఆచరణ సాధ్యం కానిదే కావచ్చు. అందులోని ఎన్నో శిక్షలు, రాజులను గెలవడానికి నిర్దేశించిన పద్ధతులు, ప్రజలను, అధికారులను అదుపులో ఉంచడానికి వివరించిన పద్దతులు కఠినమైనవి. కర్కషమైనవే కావచ్చు, కాని అవన్నీ ఎప్పుడో క్రీస్తుకు పూర్వం మానవ నాగరికత అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలంలో, ప్రాజాస్వామ్య భావన అంకురించక ముందు రాచరిక పాలనలో విశదీకరించబడ్డాయి. అప్పుడప్పుడే పౌరహక్కులు గుర్తించబడ్డ కాలంలో వ్రాయబడిన శాస్త్రమది. తరాలు గడిచినకొద్దీ అందులోని మంచి, చెడు అవగతమై, మానవహక్కుల ప్రాధాన్యం పెరిగి, ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డ తరువాత నేటి ఆధునిక న్యాయం, పరిపాలనా విధానం రూపుదిద్దుకున్నది. అది మనజాతి మొదటి అడుగు, ఆ అడుగును ఆధారం చేసుకుని మనం ఈనాడు ఎన్నో అడుగులు ముందుకు వేసాం. ఇంకా ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నాం.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News