Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: గిరిజన జీవన దారి ఇప్పపూలు

Telugu literature: గిరిజన జీవన దారి ఇప్పపూలు

40 కథలతో ‘ఇప్పపూలు’ మలికథా సంకలనం

తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలది ఒక ప్రత్యేక స్థానం, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఎలాంటి విశిష్టత, ప్రత్యేకతలు, కలిగి ఉంటాయో ఆ కథలు కూడా అంతే వైవిధ్యం నింపుకొని సాగుతాయి. 1910 లో తెలుగు సాహిత్యంలో కథల తలుపులు తెరుచుకుంటే 1932 లో గూడూరు రాజేంద్ర రావు ‘చెంచి‘ కథతో గిరిజన కథల ప్రవేశం మొదలైంది. ప్రారంభంలో గిరిజన జన జాతికి చేరువలో జీవనం సాగించిన, అడవి బిడ్డలపై అభిమానం గల రచయితల నుంచి అరకొరగా గిరిజన ప్రత్యేక కథలు వెలువడ్డాయి.
అనంతర కాలంలో ఆదివాసుల్లో కూడా అక్షరాస్యత దినదిన ప్రవర్తమానమై వారిలో కూడా రచయితలు ఆవిర్భవించారు. అంత కు ముందుగల వారియొక్క ‘నోటి సాహిత్యం’ను అక్షరబద్దం చేసే పని ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది.
గతంలో గిరిజనుల పోరాటాలు, అన్యాయాలకు గురవుతున్న తీరు, వారి కష్టాలు మాత్రమే కథా వస్తువులుగా కథలు వెలువడి అవి అన్ని ‘సానుభూతి కథల’ జాబితాలో చేరిపోయాయి. అనంతరం వచ్చిన గిరిజనులే వ్రాసిన గిరిజన కథల్లో విస్తృత మార్పులు చేరి వారి సంస్కృతి సాంప్రదాయాలే కథా వస్తువులుగా గిరిజన కథలు వెలబడుతూ.. ‘స్వానుభవ కథల’ జాబితాగా తయారయ్యాయి, కథలు అవే అయినా వస్తువుల్లో భిన్నత్వం సంతరించు కొని అటు పాఠకులకు ఇటు పరిశోధకులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు ఒక ప్రత్యేక తను సంతరించుకున్నాయి.
గిరిజన జీవితాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తృత పరిశోధనలు జరిగిన గిరిజన కథల గురించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మంకు చెందిన ప్రముఖ సీనియర్‌ రచయిత, జీవన్‌ అవిశ్రాంత సాహితీ కృషిలో భాగంగా ఆయన సంపాదకత్వంలో 2009 సంవత్సరంలో 29 కథలతో ‘ఇప్పపూలు’ గిరిజన సంచార తెగల కథా సంకలనం వెలువడింది, దానికి లభించిన అత్యధిక ఆదరణతో మరో పదకొండు అచ్చమైన గిరిజన కథలు జోడించి మొత్తం 40 కథలతో ‘ఇప్పపూలు’ మలికథా సంకలనం ఇటీవల వెలువడింది.
దీనిలో 30% సంచార జాతుల వారి జీవన దర్పణాలైనా కథలు మినహాయిస్తే అన్ని అచ్చమైన అడవి జాతి బిడ్డల కథలే…!!
జయధీర్‌ తిరుమలరావు, వంశీకృష్ణ, వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల గీటురాళ్ల వంటి ఆప్త వాక్యాలు అదనపు ఆకర్షణ గల ఈ కథా సంకలనం నిజంగా తెలుగు కథ సాహిత్యంలో వెలువడ్డ తొలి గిరిజన కథా సంకలనంగా చెప్పవచ్చును.
బోయ జంగయ్య వ్రాసిన ‘ఇప్ప పూలు’ కథనే శీర్షికగా ఎంచుకున్న ఈ కథా సంకలనంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లంబాడా గిరిజన కుటుంబాలలో పేదరికం వల్ల, పుట్టిన ఆడపిల్లల సంతానాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దీన పరిస్థితులకు అక్షర రూపం అయిన ‘ఇప్పపూలు‘ కథలో ఇప్ప సారా తయారు చేయడం కుటీర పరిశ్రమగా చెబుతూ పోలీసులు ఆ నెపంతో లంబాడా సామాజిక వర్గం వారిని శారీరకంగా ఆర్థికంగా ఎలా దోచుకుంటున్నారో కూడా ఈ కథలో మరో కోణం ద్వారా చూపించారు.
ముందుతరం గిరిజన కథకుడు గూడూరు రాజేంద్ర రావు మొదలు నేటితరం యువ గిరిజన కథకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ వరకు 40 మంది కథకుల నవ్య కథా రీతులు ఇందులో మనం చదవవచ్చు. బహు విశేషాల వేదిక అయిన ఈ కథల పందిరిలో ప్రజావాగ్గేయ కారుడు పాటల పోరు బిడ్డ వంగపండు ప్రసాదరావు వ్రాసిన కథ కూడా ఉండటం మరో విశేషం!!
‘వంగపండు’ అంటే పాట గాడు గానే అందరికీ తెలుసు, కానీ అతనిలోని అద్భుతమైన కథకుడిని ఆవిష్కరించింది ఆయన వ్రాసిన ‘కొండ పందికొక్కు’ కథ , అమాయకపు అడవి బిడ్డలు వ్యాపారస్తుల మోసాలకు ఎలా బలి అవుతున్నారో తెలుపుతూ తద్వా రా ఉద్యమాలవైపు, సంఘాల వైపు, గిరిజనులు మొగ్గు చూపుతున్న తీరు గురించి తనదైన ఉద్యమ శైలిలో ఈ కథను వంగపండు వ్రాశారు.
ఇక గిరిజన రచయితలైన మల్లిపురం జగదీష్‌, భూక్యా తిరు పతి, పద్దం అనసూయ, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌, తిమ్మక రాం ప్రసాద్‌, వంటి వారి కథలు ఈ సంపుటికి మరింత ప్రత్యేకతను అందించాయి ఈ ఐదు కథలు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రధాన భూమికగా చెప్పబడ్డాయి.
భూక్య తిరుపతి ‘కాక్లా’ కథలో లంబాడా సామాజిక వర్గంలో గల కాకుల కలయికతో ముడిబడ్డ ఒక అపనమ్మకాన్ని వారు సంప్రదాయంగా ఎలా కొనసాగిస్తున్నారో చెబుతారు. మల్లిపురం తన ‘దారి’ కథలో అడవి బిడ్డల రోజువారి దినచర్యలను కళ్ళకు కట్టి నట్టు ఆవిష్కరిస్తూనే ఆదివాసులు ఐకమత్యంతో తమను మోసగించిన తమ ప్రాంతపు అధికారిపై ఎలా ఎదురు తిరిగారో ఆవిష్కరించారు. ఇక చావు నేపథ్యంలో కథలు వ్రాసి తనదైన ప్రత్యేకతను చాటుకున్న ‘పద్దం అనసూయ’ వ్రాసిన ‘మూగబోయిన శబ్దం’ కథలో గిరిజన జన జాతి అన్యమత ఊబిలో ఎలా కూరుకుపోతున్నదో చక్కగా వివరించారు, సంస్కృతి సాంప్రదాయాలపై అన్య మత దాడి గురించి ఈ కథలో ఆలోచనత్మకంగా చెప్పారు.
‘ప్రాచీన పురుడు’ తీరు గురించి సందేశాత్మకంగా ఆవిష్కరించిన మరో గిరిజన కథారచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన కథ ‘పురుడు’, పాత్రోచితమైన సంభాషణ తీరు దీనిలో మనకు ఆవిష్కరించబడింది ఇదే తీరుకు తార్కాణకంగా నిలిచే మరో కథ ‘పిన్లకర్ర’ గిరిజన యువత పట్టణాలపై మోజుతో అక్కడకు చేరి తమ చక్కని సంస్కృతితో పాటు విలువైన ఆరోగ్యాలను ఎలా కోల్పో తున్నారో.. ఈ కథ కళ్ళకు కట్టింది.
మొత్తానికి ఈ కథా సంకలనంలో 40 కథలు వ్రాయబడ్డ కాలాల రీత్యా 50 సంవత్సరాల నిడివి ఉంది ఈ ఐదు దశాబ్దాల నడుమ అనేక ఆధునిక మార్పులు వచ్చి చేరాయి కానీ గిరిజన జీవన విధానంలో వారి అణిచివేతలు, దోపిడి, ఆధిపత్యం, తదితర మోసాల్లో మాత్రం తేడా రాలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోబడే వారి మీద అన్యాయాలు అక్రమాలు రూపాంతరం చెందాయి.
ప్రాంతాలవారీగా విభజించబడ్డ, ఈ గిరిజన కథల సమా హారంలోని కథల తీరు గమనిస్తే,.. ఆస్తులు అంతస్తులు కాదు పీడన, దోపిడి కూడా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ అదో గొలుసు వలయమై నిరంతరం కొనసాగుతుంది, కానీ దానిని ఎక్కడో ఒక చోట ఛేదించి నియంత్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆదిమ తెగల మనుగడకు భారీ ప్రమాదం ఏర్పడి మహా ఉత్పాతం కలగవచ్చు, దాని నుంచి రక్షించే దిశగా సాగుతున్నదే ఈ అక్షర చైతన్య కథాయాత్ర.
తరాలు మారిన తలరాతలు మారని గిరిజన స్త్రీల స్థితిగతులు, ఆందోళన కలిగిస్తున్న తీరును ఈ గిరిజన సంచార జాతుల కథా సంకలనం ఆవిష్కరించింది. గిరిజన హక్కులు మానవ హక్కులే అని ఎలుగెత్తి చాటిన ‘పోరాట శీలి’ బాలగోపాల్‌, స్మృతిగా ఈ ‘ఇప్పపూలు’ కథా సంకల నం ప్రచురించిన సంపాదకులు ప్రచురణకర్త జీవన్‌ గారు అభినందనీయులు.
అడవి బిడ్డలతో పాటు అణగారిన వర్గపు సంచార తెగల బతుకుల వెతలు కూడా ఇందులో మనం చదవవచ్చు, పెద్దింటి అశోక్‌ కుమార్‌, బిఎస్‌ రాములు, ఏ. విద్యాసాగర్‌, బోయ జంగయ్య, జాతశ్రీ, అల్లం రాజయ్య, అట్టాడ, గంటేడ, వంటి లబ్ద ప్రతిష్టలైన వారి కథల్లోని భావ సొగసులతోపాటు వర్ధమాన కథా శీలురైన డా: జడా సుబ్బారావు, బాల సుధాకర్‌ మౌళి, ఆప్త చైతన్యల ఆధునిక కథన రీతులు ఈ కథా సంకలనంలో మనం గమనించవచ్చు. బహురుచుల విందు భోజనంలా బహుముఖీయమైన కథల సమాహారం ఇది, కథ ప్రియులకే కాక పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శి వంటి అపురూప కథా పేటిక, ఇదో చారిత్రక దీపిక.

  • డా॥ అమ్మిన శ్రీనివాసరాజు,
    7729883223.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News