వ్యవహారిక భాష ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. దైనందిన వ్యవహారాలతో పాటు, విద్యాబోధనలో పండితుల భాష కాకుండా పామరుల భాషను వాడాలి అని గిడుగు రామమూర్తి పంతులు జీవితకాలం పోరాటం చేశాడు. అమ్మ భాష అంటే అమృతం లాంటిది అందరికీ అందుబాటులో ఉండాలని చేసిన పోరాటాల ఫలితంగా వ్యవహారిక భాష విస్తృత ప్రచారంలోకి వచ్చింది.
తేనెలొలుకు భాష: ‘తెలుగుభాష తీయదనం.. తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం..’ ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. ఏలికలు మేల్కొని తేనెలొ లుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతోంది. పరభాషా పద ఘట్టనల కింద నలిగి పోకుండా తల్లి భాష ఉనికిని కాపాడుకోవాలి.
తెలుగులో గొప్ప సాహిత్యం: తెలుగులో ప్రాచీన కాలంలోనేగాక, ఆధునిక కాలంలో కూడా గొప్ప సాహిత్యం వస్తోంది. పల్లె పదం నుంచి జానపదుల సంస్కృతి సంప్రదాయాలు అలరారుతోంది. ‘దేశభాష లందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు వారు ప్రపంచానికి చాటిచెప్పిన ఘన చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష.
మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన కొనసాగించాలి
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350ఏ లో చెప్పిన విధంగా మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన కొనసాగించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆర్టికల్ 350బి ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో చదువుకొని తరువాత విద్యార్థులు అభిప్రాయం మేరకు ఏ భాషలోనైనా ఉన్నత విద్య చదువుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలో 6,600 భాష లు ఉంటే.. అందులో తెలుగు ఒకటి.
తెలుగుభాష పరిరక్షణ కొరకు ఈ క్రింది చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది
1.కుటుంబం నుంచే తెలుగు భాష అమలు కావాలి. 2.తెలుగు రచయితలను ప్రోత్సహించాలి. వారు రాసిన పుస్తకాలను ముద్రించి సమాజానికి అం దించాలి. 3.ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కార్యాల యాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధనలు రావా లి. 4.తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్యగ్రంథాల్లో ప్రవేశ పెట్టాలి. 5.విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచాలి. 6.తెలుగు కావ్యాలలోని సామా జిక గతాన్ని సమాజానికి చాటి చెప్పాలి. 7.పరభాషను గౌరవించు. మాతృభాషను ప్రపంచానికే చాటి చెప్పు అన్న నినాదాన్ని ఇంటింటికి చేర్చాలి. 8.జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, ప్రతి పల్లెల్లోనూ తెలుగు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేయాలి. 9.జానపదాలు, జానపద కళాకారులపై విస్తృత ప్రచారం చేయాలి. 10.తెలుగు సాహిత్యంలో పరిశోధనలు కొనసాగాలి.
తెలుగుభాష పరిరక్షణకు కృషి చేయాలి
తెలుగు భాష గొప్పతనం ఈనాటిది కాదు. ప్రపంచ దేశాలలో తెలుగు గొప్పతనం ఏనాడో చాటి చెప్పారు. యునెస్కో అంచనా ప్రకారం అంతరించి పోతున్న భాషల జాబితాలో తెలుగు ఉంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని తెలుగును బతికించే విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. తెలుగు సాహిత్యాన్ని సమాజానికి అందించాలి. తెలుగు భాష దినదినాభివృద్ధి చెందాలంటే సాహిత్యం అత్యుత్తమ స్థాయిలో రాణించాలి. ప్రపంచ భాషలన్నింటిలో తెలుగు భాషకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. తెలుగు కవులను ప్రోత్సహించి, వారు రచించిన పుస్తకాలను ప్రభుత్వమే అచ్చు వేయించాలి.
ప్రైవేటు పాఠశాలల విధానం మారాలి
ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే నేరమ న్నట్లు శిక్ష విధిస్తున్నారు. ఇది మారాలి. ప్రైవేటు పాఠ శాలల్లో సైతం 6వ తరగతి వరకు తెలుగు ఖచ్చితం చేయాలి. పరభాష వ్యామోహంలో నేడు తెలుగును ప్రజలకు దూరం చేస్తున్నారు.
తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలి
తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు నడుం బిగించాలి. ప్రాచీన సాహిత్యం విశిష్టత ప్రచారం చేయాలి. తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణించడం అక్షరాలకు అందనిది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు ఎంతో విశిష్టత ఉంది. అలాంటి తెలుగు ఆంగ్ల భాష మమకారంతో గతి తప్పుతోంది. ఈ భాషను పరిరక్షించుకోకపోతే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అంతరించిపోతున్న మాతృ భాషను మృతభాషగా కాకుండా అమృత భాషగా సంరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది.
- పిన్నింటి బాలాజీ రావు
9866776286. - (నేడు తెలుగు భాషా దినోత్సవం)