రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం గుర్తుకు వస్తుంది. రక్షా బంధన్ వారి మధ్య బంధానికి ప్రతీక. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ పండుగ. కానీ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ఈ బంధాలు కాస్త సన్నగిల్లుతున్నాయి. అలాంటి రోజుల్లో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒంటరిగా 8 కిలోమీటర్లు నడిచింది. శరీరంలో బలం చచ్చిపోయినా.. తమ్ముడిపై తనకున్న ప్రేమకు అలుపు లేదని నిరూపించింది. ఎర్రటి ఎండను పట్టించుకోకుండా కాలినడకన తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలుదేరింది. తల్లిదండ్రుల కంటే తోబుట్టువులే ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ పొరుగున ఉన్న కొండయ్యపల్లికి వెళ్లింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా చెప్పులు లేకుండా 8 కిలోమీటర్లు నడిచి వస్తున్న వృద్ధురాలిని చూసిన ఓ యువకుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అవ్వా అంటూ పలకరించాడు. అప్పుడు వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టబోతున్నానని బదులిచ్చింది. తను కొత్తపల్లిలో ఉంటున్నానని, కొండయ్యపల్లిలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పింది. ఆ వీడియోను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తమ్ముడంటే అంటే ఎంత ప్రేమో చెబుతూ తమ అక్కా, చెల్లెల్లను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
మానవ సంబంధాలన్నీ డబ్బు సంబంధ బాంధవ్యాలుగా మారిన ఈ కాలంలో ఇలాంటి ప్రేమ నిజంగా అద్భుతం అని కొనియాడారు. ఇది కదా అక్క-తమ్ముడి అనుబంధానికి నిదర్శనం ఈ అనుబంధాన్ని మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఇలాగే కొనసాగించాలని కామెంట్ చేస్తున్నారు