మీ జుట్టు పలచగా ఉందా? ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా మీకు నప్పడం లేదా? వెంట్రుకలు ఊడుతుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా? ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదంటున్నారు శిరోజాల నిపుణులు. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో మీ జుట్టును చిక్కగా, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చని చెప్తున్నారు.
వాటిల్లో ఒకటి అలొవిరా. ఇది జుట్టును అందంగా, ఒత్తుగా చేయడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎంజైములు చర్మం మృతకణాలను బాగుచేయడంలో సహాయపడడ్డమే కాదు జుట్టు పెరిగేలా తోడ్పడతాయి కూడా. దీన్ని శిరోజాలపై ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నారా? సింపుల్ రెండు టీస్పూన్ల అలొవిరా జెల్ తీసుకుని దాన్ని మెత్తగా పేస్టులా చేయాలి. ఆ పేస్టును మాడుపై రాసి చేతి మునివేళ్లతో మాడును ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం చూస్తారు.
పలచటి జుట్టును ఒత్తుగా చేసుకునే మరో ఇంటి చిట్కా ఉంది. గుడ్లు కూడా వెంట్రుకలు బాగా పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. గుడ్డులో ప్రొటీన్లు, సల్ఫర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు బాగా పెరిగేలా సహకరిస్తాయి. ఒక గుడ్డు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి మెత్తటి పేస్టులా అయ్యేదాకా గిలకొకట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, మాడుకు బాగా పట్టించాలి. తర్వాత 20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం మరవొద్దు. తర్వావ చల్లటి నీళ్లతో శిరోజాలను శుభ్రంగా కడుక్కోవాలి. కండిషనర్ ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
జుట్టు బాగా పెరగడానికి సహకరించే మరో వంటింటి పదార్థం ఉసిరికాయ. అదేనండి ఆమ్లా. ఇందులో విటమిన్ సి, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండి కొల్లాజెన్ ప్రమాణాలను బాగా పెంచుతాయి. అంతేకాదు జుట్టు బాగా పెరిగేలా చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఆమ్లా, లైమ్ జ్యూసులు రెండింటినీ సమాపాళ్లల్లో తీసుకుని ఆ మిశ్రమాన్ని పేస్టులా చేయాలి. దాన్ని జుట్టుకు, మాడుకు బాగా పట్టించి పొడారిపోయేవరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపు, చల్లటి నీళ్లతో వెంట్రుకలను శుభ్రంగా రుద్దుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు వెంట్రుకల పెరుగుదల పరంగా మంచి ఫలితాలు చూస్తారు.
నాల్గవది, చివరిది మెంతులు. ఇవి జుట్టుకు చేసే మేలు ఎంతో. ఒక అర కప్పు నీళ్లల్లో కొన్ని మెంతులు పోసి రాత్రంతా వాటిని అలాగే నానబెట్టాలి. పొద్దున్న లేచిన తర్వాత నానిన మెంతిగింజలను మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును జుట్టకు, మాడుకు బాగా పట్టించి అరగంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత షాంపు, చల్లటి నీళ్లతో జుట్టును శుభ్రంగా రుద్దుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరిగి మీ పలచని జుట్టు సమస్యను సులువుగా అధిగమించగలరు. జుట్టు పలచబడుతున్నా, తలపై అక్కడడక్కడ బట్టతలలాగ కనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా వైద్యుని కూడా సంప్రదించడం మంచిది. వారు వెంటనే మీ వెంట్రుకలు పలచబడడానికి గల వైద్య కారణాన్ని గుర్తించి తగిన చికిత్స, మెడికేషన్స్ ఇస్తారు. అలా కూడా శిరోజాల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
జుట్టు చిక్కగా, ఒత్తుగా పెరగడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు ఎంతగానో సహకరిస్తాయి. జుట్టు బలహీన పడితే అందుకు విటమిన్లు, ఖనిజాల లోటే కారణమని గ్రహించాలి. కొన్ని రకాలైన ఆహార పదార్థాలను నిత్యం మీరు తీసుకునే డైట్ లో ఉండేట్టు జాగ్రత్తపడడం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెపుతున్నారు. వాటిల్లో పాలకూర, సాల్మన్ ఫిష్, పెరుగు, దాల్చినచెక్క, జామ, ఓట్ మీల్, గుడ్లు, ఓస్టర్స్, చిక్కుళ్లు, లివర్, బార్లీ, చిలకడదుంప వంటివి తప్పనిసరిగా తరచూ తీసుకుంటుండాలని సూచిస్తున్నారు.
అలాగే పలచటి జుట్టు సమస్యను అదిగమించాలంటే విటమిన్స్ ఎ, బి, సి, డి, ఇ , కె చాలా ముఖ్యమైనవి. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విటమిన్లలో ఏది లోపించినా దాని ప్రభావం జుట్టు మీద తీవ్రంగా పడుతుందని మరవొద్దు. విటమిన్ సి, నియాసిన్ (విటమిన్ బి3), ప్యాంన్థెనాల్ (విటమిన్ బి5), బయొటిన్ (విటమిన్ బి7) చాలా ముఖ్యమైనవి. సర్వసాధారణంగా చాలామంది వాడే హెయిర్ విటమిన్
బయోటిన్. శిరోజాల ఆరోగ్యం కోసం సప్లిమెంట్ల వాడకం కూడా మంచిది. వీటిని ప్రారంభించాలంటే సంబంధిత వైద్యుల పర్యవేక్షణ, సలహా సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే పలచని వెంట్రుకలు ఉన్నవారు వారానికి మూడుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. మాడు శుభ్రంగా ఉంటుంది. తరచూ తలకు షాంపును పెట్టకుండా ఉండడం ఉత్తమం. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తలకు షాంపు పెట్టుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మాడు, శిరోజాల ఆరోగ్యం బట్టి వారానికి మీరు ఎన్నిసార్లు తలను రుద్దుకోవాలన్న విషయం ఆధారపడి ఉంటుంది. అలాగే పలచబడిన జుట్టు పెరగడం అనేది అది పలచబడడానికి గల కారణంపై ఆధారపడి ఉంటుంది. అయితే కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే మాత్రం శిరోజాలు తిరిగి బాగా పెరగడం అనేది ఉంటుంది. జుట్టు పలచబడానికి కాలుష్యం, ఒత్తిడి, జన్యుసంబంధమైన కారణాలు కూడా కారణం కావచ్చు. మాడుకు అలొవిరా జెల్ పట్టిస్తే లేదా అలొవిరా జ్యూసు తాగినా జుట్టు బాగా పెరగుతుంది. నిత్యం ఒక కప్పు గ్రీన్ టీ తాగినా కూడా జుట్టు బాగా పెరుగుతుంది. టీలో యాంటాక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. తడి జుట్టును ఎప్పుడూ
దువ్వకూడదు. ఎందుకంటే అప్పుడు వెంట్రుకలు ఎంతో బలహీనంగా ఉంటాయి. అందుకే తడి తలను దువ్వడం వల్ల వెంట్రులు తొందరగా చిట్లే అవకాశం ఉంటుంది. అందుకే పలచటి శిరోజాలు ఉన్న వారు పైన పేర్కొన్న వంటింటి చిట్కాలతో పాటు సంబంధిత వైద్యుని సంప్రదించడం వల్ల మిమ్మల్ని వేధిస్తున్న పలచటి శిరోజాల సమస్య నుంచి బయటపడతారు.