ఒకే రోజులో 8 మోకాళ్ల కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్!మహేష్ పర్యవేక్షణలో డాక్టర్ అనిల్, డాక్టర్ శశికాంత్ బృందం మోకాలి మార్పిడి చికిత్సలు ఆగస్టు 29 న నిర్వహించింది. రోగులు వేగంగా కోలుకుంటున్నారు. ఈ సందర్బంగా వైద్య బృందం మాట్లాడుతూ ఒక్కో మోకాలి మార్పిడి చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకుంటే లక్ష 50 వేల రూపాయల నుండి 12 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని భరించలేక బాధను దిగమింగుతూ, పేద ప్రజలు ఇంతకాలం జీవనం సాగించారు. వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్న సమాచారం వారికి చేరడంతో ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా విజయవంతంగా ఆపరేషన్ లు పూర్తి చేశామన్నారు. ఈ విషయాన్ని వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
కాగా ఇప్పటి వరకూ రికార్డ్ స్థాయిలో వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 500 ఆర్థో శస్త్ర చికిత్సలు అనతికాలంలోనే నిర్వహించి మరో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒకే రోజులో 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి చరిత్ర సృష్టించాం అంటూ వైద్య బృందం సంతోషం వ్యక్తం చేశారు.మాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా,గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఓకె రోజు 8 మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేయలేదని వారన్నారు.మేము కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా శస్త్ర చికిత్సలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. వైద్యులు,సిబ్బంది సమిష్టి కృషితోనే రికార్డ్ స్థాయిలో మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగలిగామని డాక్టర్! అనీల్ స్పష్టం చేశారు.ఖరీదైన మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రిలో ఉచితంగా అందుబాటులోకి రావడంతో పేద ప్రజలు తమ మోకాళ్ళ మార్పిడి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్,ఎమ్మెల్యే రమేష్ బాబు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్నారు. పర్యవేక్షకులు డాక్టర్! మహేష్ మాట్లాడుతూ ఈ ఫీట్లో భాగస్వామ్యమైన వైద్యులు,సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఖరీదైన ఈ మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకొనే స్థోమత లేని పేద ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల్లోనే శస్త్ర చికిత్స నిర్వహించడం వారికి వరం కానుంది అని అన్నారు.పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలుగుతుందని,ఇలాంటి అరుదైన ఫీట్ సాధించడంలో భాగస్వామ్యమైన వైద్యులు,సిబ్బందికి జిల్లా యంత్రాంగం పక్షాన జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.