Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Indo Sino friendship: భారత్‌తో మైత్రికి చైనా మరో అడ్డంకి

Indo Sino friendship: భారత్‌తో మైత్రికి చైనా మరో అడ్డంకి

భారత్‌ అతిగా స్పందించాల్సిన అవసరం లేదన్న చైనా

దక్షిణాఫ్రికాలో భారత్‌, చైనా దేశాల మధ్య గత వారం కొద్దిపాటి చర్చలు జరిగినప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే అంతా భావించారు. అయితే, ఆ తర్వాత ఈ సంబంధాలు ఏమాత్రం మెరుగుపడకపోగా, మరింతగా దిగజారిన సూచనలు కనిపిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ల మధ్య చాలా నెలల తర్వాత జరిగిన చర్చలు ఇక ముందుకు సాగే అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం చైనాయే అనడంలో సందేహం లేదు. ఇటీవల చైనా విడుదల చేసిన దేశ మ్యాపు ఈ రెండు దేశాల మధ్య కొత్తగా చిచ్చు రగల్చింది. వచ్చే వారం న్యూఢిల్లీలో జరగబోయే జి-20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌ పింగ్‌ హాజరు కాకపోవచ్చని కూడా భావిస్తున్నారు. కొత్త మ్యాపునకు సంబంధించి భారత్‌ అభ్యంతరాలు తెలియజేసినప్పుడు చైనా నిర్ధారించనూ లేదు, ఖండించనూ లేదు. 1980లలో ఏ విధంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అడుగంటాయో ఇప్పుడు కూడా ఆ స్థితికి సంబంధాలు చేరుకున్నాయి.
గత ఆగస్టు 28న చైనా 2023 సంవత్సరానికి గాను ఒక ‘ప్రామాణికమైన మ్యాపు’ను విడుదల చేసింది. ఇందులో యావత్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఆక్సాయ్‌ చిన్‌ ను, దక్షిణ చైనా సముద్రాన్ని చైనా భూభాగంలో ఉన్నట్టుగా చూపించారు. దీనిపై భారత్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌ లు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశాయి. ఇది రొటీన్‌ గా విడుదల చేసే మ్యాప్‌ మాత్రమేనని, దీని మీద భారత్‌ అతిగా స్పందించాల్సిన అవసరం లేదని చైనా జవాబిచ్చింది. అయితే, భారత్‌ మాత్రం తన విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా దీనిపై నిరసన తెలియ జేసింది. ఈ మ్యాపులో కొత్త ప్రాంతాలను చేర్చలేదు కానీ, ఇదివరకు ప్రదర్శించిన మ్యాపునే తిరగి ప్రదర్శిండం జరిగింది కానీ, అసలే రోజుకో వివాదం రాజుకుంటున్న సమయంలో కొత్తగా ఒక వివాదాస్పద మ్యాపును విడుదల చేయడం ద్వారా సమస్యలను మరింత జటిలం చేయడం జరిగింది. ఇతర ఇరుగు పొరుదు దేశాలు కూడా చైనా కొత్త మ్యాపుపై తీవ్ర అభ్యంతరం తెలియజేశాయి.
కొత్తగా ఏర్పడిన జమ్మూ, కాశ్మీర్‌, లడాఖ్‌ ప్రాంతాలను కలిపి 2019లో భారత్‌ ఒక కొత్త మ్యాపును విడుదల చేసినప్పుడు చైనా అభ్యంతరాలను తెలియజేసింది. ఈ మ్యాపులో భారత్‌ విదేశాలతో తమకున్న సరిహద్దులను మార్చనప్పటికీ చైనా ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతా మండలిలో దీనిని చర్చకు కూడా పెట్టింది. ఆక్సాయ్‌ చిన్‌ తమ పరిధిలోని ప్రాంతంగా భారత్‌ ఆ మ్యాపులో పేర్కొనడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఆ కారణంగానే చైనా వాస్తవాధీన రేఖ వద్ద తన సైన్యాన్ని మోహరించింది. అప్పటి నుంచి భారత్‌, చైనా సంబంధాలు అతి వేగంగా దిగజారిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ వేదికలపై ఈ రెండు దేశాల ఈ వివాదాస్పద అంశాలను లేవనెత్తడం కూడా జరుగుతోంది. డోక్లామ్‌ ప్రాంతంలో చైనా తన సైన్యాన్ని మోహరించినప్పుడు భారత్‌ ఈ అంశాన్ని 2017 బ్రిక్స్‌ సమావేశంలో ప్రస్తావించింది. ఇతరత్రా కూడా అనేక శిఖరాగ్ర సమావేశాలలో ఈ రెండు దేశాలు తమ సమస్యల గురించి ప్రస్తావించడం కొనసాగుతూ వస్తోంది.
వచ్చే వారం న్యూఢిల్లీలో జరగబోయే జి-20 సమావేశానికి చైనా అధ్యక్షుడు హాజర వుతారో, లేదో తెలియదు కానీ, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకా శాలు మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. ఈ సంబంధాలు మెరుగుపడడానికి ఎన్నో సున్నిత మైన అంశాలను అతి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చైనా ఏమాత్రం సిద్ధంగా లేదన్నది జగమెరిగిన సత్యం. నమ్మకం కలిగించే ప్రయత్నాలేవీ చైనా నుంచి జరగడం లేదు. తమ ఇరుగు పొరుగు దేశాలతో చైనా మరింత సున్నితంగా, మృదువుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆధిపత్య ధోరణితో సంబంధాలు మెరుగు పడే అవకాశం లేనే లేదు. వాస్తవానికి భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి చైనా ఏమాత్రం సిద్ధంగా లేదు. కయ్యానికి కాలు దువ్వడమే దాని విదేశాంగ విధానంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News