ENG VS PAK : కరాచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని చూసిన పాకిస్తాన్ కు ఘోర పరాభవమే మిగిలింది.
167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 28.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బెన్ డక్కెట్(82 నాటౌట్; 78 బంతుల్లో 12 ఫోర్లతో ) అర్థశతకంతో చెలరేగగా.. అతడికి కెప్టెన్ బెన్ స్టోక్స్(35 నాటౌట్), జాక్ క్రాలీ(41) చక్కని సహకారం అందించారు. టీ20 తరహాలో ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను హరీ బ్రూక్ అందుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ 354 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ కు 50 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆడిన పాక్ 216 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 167 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది. ఇంగ్లీష్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించారు. 17 ఏళ్ల తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లీష్ జట్టు 3-0 తో సిరీస్ గెలిచి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
బాబర్ ఆజామ్ చెత్త రికార్డు
ఒక క్యాలెండర్ ఇయర్‌లో సొంత గడ్డపై వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఓడిన మొదటి పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 1-0తో పాక్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు డ్రా గా ముగియగా ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇంగ్లాడ్ 3-0తో వైట్ వాష్ చేసి సిరీస్ ను సొంతం చేసుకుంది. దీంతో బాబర్ కెప్టెన్సీపై ఆ జట్టు మాజీలు, అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. చెత్త కెప్టెన్సీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.