Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్INDIA alliance: బలపడుతున్న ఇండియా కూటమి ?

INDIA alliance: బలపడుతున్న ఇండియా కూటమి ?

లోక్ సభ ఎన్నికలు సిద్ధమైన ఇరు కూటములు

ప్రతిపక్షాల ఐక్యత విషయంలో ఇండియా కూటమి మరో అడుగు ముందుకేసింది. తాజాగా దేశానికి వాణిజ్య రాజధానీ నగరమైన ముంబయిలో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నాయకులు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో 28 రాజకీయ పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇండియా కూటమిలోని పార్టీలు తీర్మానించడం ఓ విశేషం.

- Advertisement -

నోటిఫికేషన్ అంటూ విడుదల కాలేదు కానీ దేశంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఈ ఏడాది మేనెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏమాత్రం బాగా లేదు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోయి ఉన్నారు. చాణక్యుడిగా పేరొందిన గులాం నబీ ఆజాద్ సహా అనేకమంది ప్రముఖులు, పలు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన హేమాహేమీల్లాంటి నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌ బై కొట్టారు. బీజేపీ సహా అనేక ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కర్ణాటక విజయం ఇచ్చిన స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది. కాంగ్రెస్‌కు ఆక్సిజన్ లభించినట్లయింది. కన్నడ ఓటర్ల తీర్పు ఫలితంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రాధాన్యం పెరిగింది. బీజేపీయేతర పార్టీలకు కాంగ్రెస్‌ పెద్ద దిక్కుగా నిలిచింది. దీంతో ప్రతిపక్షాలు వరుస సమావేశాలు నిర్వహించాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చొరవ తీసుకుని పాట్నాలో విపక్షాల తొలి భేటీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రతిపక్షాల సమావేశాలు జరిగాయి. బెంగళూరు సమావేశాల్లో ప్రతిపక్షాలు మరో ముందడుగు వేశాయి. ప్రతిపక్షాల కూటమికి ఇండియా అంటూ పేరు పెట్టుకున్నాయి. బెంగళూరు సమావేశానికి 26 బీజేపీయేతర పార్టీలు హాజరయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముంబయి నగరంలో రెండు రోజుల పాటు ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు హాజరైన పార్టీల సంఖ్య 28 కి పెరిగింది. 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఇండియా కూటమికి కీలకమైన కన్వీనర్ పదవి ఎవరికి దక్కుతుందన్న సస్పెన్స్‌కు ముంబయి భేటీ తెరదించింది. కన్వీనర్‌గా ఒక వ్యక్తిని కాకుండా 14 మందితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంది ఇండియా కూటమి. ఇది చాలా ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం. మొదట్లో కన్వీనర్ పదవి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఖర్గేను కన్వీనర్‌గా ఎంపికి చేసుకుంటే మమతా బెనర్జీ లాంటి వారికి కంటగింపు కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు అలగవచ్చు. దీంతో విభేదాలకు ఆస్కారం లేకుండా అన్ని ప్రముఖ పార్టీల భాగస్వామ్యంతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంది ఇండియా కూటమి. భవిష్యత్తులో కూటమికి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకునే అధికారం ఈ సమన్వయ కమిటీకి దఖలు పరచింది ప్రతిపక్షాల కూటమి. బీజేపీపై కలిసికట్టుగా ప్రతిపక్షాల పోరు ! బీజేపీని ఢీకొట్టడానికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసికట్టుగా పోటీ చేయాలన్నది ఇండియా కూటమి తీసుకున్న మరో ముఖ్య నిర్ణయం. ఈ మేరకు ప్రతిపక్షాలు ఒక తీర్మానం కూడా చేయడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి వెంటనే కసరత్తు మొదలెట్టడానికి ప్రతిపక్షాల కూటమి సన్నాహాలు మొదలెట్టింది. సెప్టెంబర్ 30 నాటికి ఈ సీట్ల సర్దుబాటు కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ప్రతిపక్షాల నాయకులు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి సమావేశాలకు ఒక అనుకోని అతిథి హాజరయ్యారు. ఆయన ఎవరో కాదు…చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్. ఆహ్వానం లేకపోయినా ఇండియా కూటమికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు కపిల్ సిబల్‌. కిందటేడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబల్‌ ఆ తరువాత సమాజ్‌వాది పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఆంతర్యం ఏమిటి ? ఒకవైపు ఇండియా కూటమి ఇలా వరుస సమావేశాలతో తలమునకలై ఉంటే మరోవైపు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. అయితే సమావేశాలు ముగిసిన 40 రోజుల్లోపే ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం నిర్ణయించుకుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే పార్లమెంటులో బిల్లు పెట్టడానికి వీలుగా ప్రత్యేక సమావేశాల నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుందన్న ప్రచారం హస్తిన రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాగా రోజురోజుకు బలపడుతున్న ప్రతిపక్షాల ఇండియా కూటమికి చెక్ పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాల నిర్ణయం తీసుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి మరోసారి జనం మధ్యకు వెళ్లనున్నారు. భారత్ జోడో యాత్ర రెండో విడతకు ఆయన రెడీ అవుతున్నారు. దీని కోసం మహాత్మా గాంధి జయంతి రోజైన అక్టోబరు రెండో తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు. రెండో విడత భారత్ జోడో యాత్ర గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి మేఘాలయ వరకు కొనసాగుతుంది. తొలి విడత భారత్ జోడో యాత్రకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కేవలం భారతదేశాన్ని అధ్యయనం చేయడమే లక్ష్యంగా రాహుల్ పాదయాత్ర చేశారు. అయితే రెండో విడత పాదయాత్ర మాత్రం భిన్నమైంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండో విడత భారత్ జోడో యాత్రకు రాహుల్ రెడీ అవుతున్నారు. ఏమైనా ఇటు ఎన్డీయే కూటమి అటు ఇండియా కూటమి ఎన్నికల యుద్ధానికి సన్నాహలు చేసుకుంటున్నాయి.

                        -ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News