చర్మ సౌందర్యాన్ని సహజసిద్ధంగానే మనం సంతరించుకోవచ్చు. ఎలా అంటారా? చర్మాన్ని అందంగా, మృదువుగా చేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. సమతులాహారం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలు లేని, కాంతివంతమైన, యవ్వనంతో కూడిన చర్మ సౌందర్యాన్ని ప్రతిఫలించడానికి కొన్ని ఫుడ్ టిప్స్ ఉన్నాయి.
-పండ్లు, కూరగాయలు నిత్యం తింటే చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లల్లో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మంచివి. చిలకడ దుంపలు, క్యారెట్లు, పాలకూర, బొప్పాయి వంటి వాటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నిత్యం తింటే చర్మానికి ఎంతో మంచిది. అందుకే రోజూ ఒక బౌల్ కూరగాయ ముక్కలు లేదా పండ్లముక్కలు తింటే చర్మానికి చాలా మంచిది. శరీరారోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇక చర్మానికి ఇవి చేసే మంచి చెప్పనవసరం లేదు. అయితే వీటిని రోజులో ఐదు మార్లు చిన్న మొత్తంలో తింటే చర్మంపై మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.
-సి విటమిన్ బాగా తీసుకోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు విటమిన్ సి నిత్యం తీసుకోవడం వల్ల చర్మంపై ఉండే నల్లటి మచ్చలు కూడా సహజసిద్ధంగా పోతాయి. బ్లూబెర్రీలు,, స్ట్రాబెర్రీలు, బొప్పాయి, జామ, కివి, కమలాపండ్లల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. విటమిన్ సి కొల్లాజెన్ ను (చర్మంలో ఉండే ప్రధాన ప్రొటీన్ స్ట్రక్చర్) కావలసినంత ఉత్పత్తి చేస్తుంది కూడా.
-క్రాష్ డైట్ జోలికి వెళ్లొద్దు. ఎందుకంటే తరచూ బరువు తగ్గడం, పెరగడం వంటివి చేస్తే అది పరోక్షంగా మీ చర్మంపై ప్రభావం చూపుతుంది. చర్మం ఎలాస్టిసిటీలో వేగంగా మార్పులు పొడసూపే అవకాశం ఉంది. అంతేకాదు చర్మం బాగా సాగుతుంది. క్రాష్ డైట్ వల్ల చర్మానికి అవసరమయ్యే పోషకాలు అందవు. అంతేకాదు తరచూ బరువు తగ్గడం, పెరగడం వల్ల చర్మంపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడతాయి. పైగా క్రాష్ డైట్ వల్ల సరిపడినన్ని పోషకాలు చర్మానికి అందవు. ఫలితంగా స్కిన్ ఏజింగ్ తొందరగా వస్తుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ సమతులాహారం మానొద్దు. క్రాష్ డైట్ వల్ల చర్మ ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. అందుకే క్రాష్ డైట్ కి నో చెప్పడం మంచిది.
– సెలీనియం చర్మానికి చాలా అవసరం. ఇందులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ ఏజింగ్ ను అడ్డుకుంటుంది. సూర్యరశ్మి బారిన చర్మం పడకుండా కాపాడుతుంది. బ్రెజిల్ నట్స్ లో సెలినియమ్ అధికంగా ఉంటుంది. రోజు వీటిని మూడు తింటే చాలు చర్మానికి ఒక రోజుకు కావలసిన సెలినియమ్ పరిమాణం అందుతుంది. ఈ నట్స్ ను ఇతర నట్స్ తో కలిపి తినొచ్చు. నటీ బార్ చేసుకొని స్నాక్ లా తినొచ్చు. ఇవి కాకుండా బ్రొకోలీ, గుడ్లు, టొమాటోలు, చేపల్లో కూడా సెలినియమ్ అధికపాళ్లల్లో ఉంటుంది. -నీళ్లు బాగా తాగడం వల్ల కూడా చర్మం ఎంతో ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. దీనివల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎలాంటి దుష్ప్రభావాలు చూపని బెస్ట్ మాయిశ్చరైజర్ నీళ్లు అని మరవొద్దు. నీరు బాగా ఉన్న పండ్లు, కూరగాయలు తింటే కూడా శరీరానికి మంచిది. అంటే పుచ్చకాయ, కీరకాయలాంటి వాటిని బాగా తినాలి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల , అలాగే సిగరెట్లు బాగా కాల్చడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుందని మరవొద్దు.
-తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు తప్పనిసరిగా కావాలి. కానీ చాలా రకాల డైట్లల్లో వీటికి నో చెప్పడం గమనించవచ్చు. చిక్కుళ్లు, పప్పులు వంటి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్సు ఉన్న వాటిని తినాలి. ఇవి మీ కడుపును నిండుగా ఉంచి ఆకలి వేయదు. చిరుతిళ్ల మీద మీ దృష్టిపడనివ్వదు. గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్న బిస్కట్లు, షుగరీ డ్రింకుల జోలికి అస్సలు వెళ్లొద్దు. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ విషయంలో ఈట్ రైట్ సూత్రం తప్పనిసరిగా పాటించాలి. సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఇవి మీ చర్మాన్నే కాదు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని మరవొద్దు.