BRS Party : తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించి నిదానంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ భవన ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలను ఆహ్వానించారు.
జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి సరైన ప్రత్యామయ్నం బీఆర్ఎసేనని చాటి చెప్పాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీ నీ వ్యతిరేకిస్తున్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు, రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ వరుసగా సమావేశమవుతున్నారు.
ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నగరంలో జరుగుతున్న పెట్టుబడి దారుల సదస్సులో పాల్గొనేందుకు పంజాబ్ సీఎం హైదరాబాద్‌కు రాగా కేసీఆర్ ఆయన్ను ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయాల గురించి ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.