TDP Public Meeting: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే.. తెలంగాణలోని టీడీపీ క్యాడర్‌లోనూ జోష్ నింపేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీకి కంచుకోటగా చెప్పుకొనే ఖమ్మం జిల్లా నుంచి చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బహిరంగ జరగనుంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. చంద్రబాబు భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్తారు. ఖమ్మం జిల్లా బార్డర్ లోని కూసుమంచి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలకనున్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను బహిరంగ సభకు తరలించేలా ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు చంద్రబాబు తన తొలి అడుగు వేయనున్నారు. చంద్రబాబు సభ విజయవంతం అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు బహిరంగసభలో చేయబోయే ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. చంద్రబాబు తన స్పీచ్‌లో తెలంగాణలోని టీడీపీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు బహిరంగ సభపై ఇప్పటికే భారతీయ రాష్ట్ర సతిమి (బీఆర్ఎస్) అధిష్టానం ఓ కన్నేసి ఉంచినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీజేపీసైతం ఖమ్మంలో జరిగే చంద్రబాబు సభపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లోని సగానికిపైగా క్యాడర్ టీడీపీ నుంచి వెళ్లిందే. ఈ క్రమంలో టీడీపీ తెలంగాణలో బలపడితే అది బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం బహిరంగ సభ విజయవంతం అయితే.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలోని టీడీపీతో పొత్తుపెట్టుకొని బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలూ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో చంద్రబాబు, బీజేపీకి రెండు విధాలుగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో బీజేపీ బలం పెరగడంతో పాటు, ఆంధ్రాలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్ర పార్టీ టీడీపీకి అనుకూలంగా మారడం ద్వారా టీడీపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మాస్టర్ ప్లాన్‌తోనే ఖమ్మంలో చంద్రబాబు బలప్రదర్శనకు దిగుతున్నట్లు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చజరుగుతుంది.