ఒకప్పుడు వలసల జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ నేడు ఎవరూ ఊహించని విధంగా మహానగరంగా విస్తరిస్తోందని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ అంటే అభివృద్ధికి చిరునామాగా మార్చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ వెనుక వైపు ఉన్న వడ్డెర బస్తీలో (పద్మావతి కాలనీ) రూ.10 లక్షలతో నిర్మించిన ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన నూతన భవనాన్ని ప్రారంభించారు.
ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు… ఒకప్పుడు తాగు నీటి కోసం గోస పడిన మహబూబ్ నగర్ ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోయే పరిస్థితి ఉండేదని, అభివృద్ధి అంటే ఏమిటో తెలియని దుస్థితి ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందని, నిర్మాణ రంగం ఊపందుకుందని మంత్రి తెలిపారు. భారీగా భవన నిర్మాణాలు జరగడం వల్ల మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు మొదలైన వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఈ రంగంపై ఆధారపడిన వ్యాపారాలు కూడా పెరిగాయన్నారు. గుర్తింపు పొందిన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం ద్వారా అండగా నిలుస్తున్నామని తెలిపారు.
త్వరలో పాలమూరు నీళ్లు… పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి త్వరలో కరివెన రిజర్వాయర్ కు నీటి విడుదల చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమీక రాష్ట్రంలో తిరిగి అన్యాయానికి గురైన ఈ ప్రాంతాన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటితో సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారన్నారు. జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీటిని అందించడమే తమ అధ్యయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టంగా చేశారు. ప్రాజెక్టులకు నీటి విడుదలతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, బీఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి, కౌన్సిలర్లు అంజాద్, అనంతరెడ్డి, ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సలీం బాషా, అధ్యక్షుడు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు గౌడ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.