BRS Party In AP: భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా అవతరించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పార్టీ భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, పలు కమిటీలనుసైతం నియమించారు. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సీఎం కేసీఆర్ కు మద్దతు లభించడంతో ఆ రాష్ట్రాల్లో మద్దతు ఇచ్చే పార్టీలతో కలిపి బీఆర్ఎస్‌ను బలోపేతానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణకు మిత్ర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో బీఆర్ఎస్ కాలుమోపేందుకు సిద్ధమైంది. క్రిస్మస్ తరువాత ఏపీలో బీఆర్ ఎస్ కార్యకలాపాలను ప్రారంభించేలా కేసీఆర్ ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
ఏపీలో ప్రస్తుతం అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ యాంటీ వర్గాన్ని కలుపుకొని బీఆర్ ఎస్‌ను ఏపీలో విస్తరించాలని కేసీఆర్ ప్లాన్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రిస్మస్ తరువాత బీఆర్ఎస్ ఏపీ కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు, వివిధ సంఘాల నేతలు దాదాపు 80మంది వరకు మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. వీరందరితో కలిపి కిసాన్ సెల్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలో అడుగు పెట్టాలని కేసీఆర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
ఏపీలో ముఖ్యంగా టీడీపీని కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీలోని కీలక నేతలకు కేసీఆర్‌కు ఎప్పటినుంచో మంచి సంబంధం ఉంది. ఈ క్రమంలో వారిలో కొందరిని బీఆర్ ఎస్‌లోకి తీసుకొచ్చి వారికి ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. క్రిస్మస్ తరువాత కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లి కిసాన్ సెల్ ను ఏర్పాటు చేస్తారా? అక్కడి నేతలే కిసాన్ సెల్ గా ఏర్పాటవుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ ఏపీకి వస్తే రాజధానిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కేసీఆర్ ఏపీ రాజధానిపై ఓ స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. కుండబద్దలు కొట్టేలా ఏపీ రాజధానిపై కేసీఆర్ సమాధానం ఉంటుందని బీఆర్ ఎస్ నేతలు పేర్కొంటున్నారు. క్రిస్మస్ తరువాత కిసాన్ సెల్ ఏర్పాటుతో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్.. జనవరి తరువాత భారీ బహిరంగ సభనుసైతం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.