ప్రభుత్వ పాఠశాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సనత్ నగర్ లోని అశోక కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమం క్రింద 2.22 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. విద్యార్ధుల సౌకర్యార్ధం పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్, సీసీ కెమెరాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్ళి విద్యార్ధులతో మంత్రులు కొద్దిసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు సమకూరుతాయని, నూతన ఫర్నిచర్ ను కూడా అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ మంచిగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని విద్యార్ధులకు సూచించారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యా శాఖ కమిషనర్ దేవసేన, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.