జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందో లేదో, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధురి ఈ కమిటీలో కొనసాగడానికి నిరాకరించారు. ఇదంతా కంటి తుడుపు చర్య అని ఆయన ఆక్షేపించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీలో హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకుడు గులాంనబి ఆజాద్ కూడా ఉన్నారు. ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడి, జమ్మూ కాశ్మీర్ లో సొంతగా పార్టీ నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, ఆజాద్ ల మధ్య సఖ్యత ఏర్పడింది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, న్యాయవేత్త అయిన హరీశ్ సాల్వే కూడా ఇందులో ఒక సభ్యుడు. మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్.కె. సింగ్, లోక్ సభు విశ్రాంత సెక్రటరీ జనరల్ సుభాష్ సి. కాశ్యప్, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి కూడా ఇందులో ముఖ్యమైన సభ్యులు. ఇక ఈ కమిటీకి ప్రధాన సారథి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
పాలనా వ్యవహారాల్లోనూ, న్యాయ వ్యవహారాల్లోనూ ఈ సభ్యులంతా అందె వేసిన చేతుల నడంలో సందేహం లేదు కానీ, ఈ సభ్యులతో ఏర్పడిన కమిటీని గమనించినవారికి వీరంతా కేంద్ర ప్రభుత్వ ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అన్న అభిప్రాయంతో ఏకీభవించేవారేనని అర్థమవుతోంది. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్వాపరాలను, వివిధ కోణాలను పరిశీలించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండాలి కానీ, ఏకాభిప్రాయం వ్యక్తం మాత్రమే వ్యక్తం చేసే అవకాశం ఉండకూడదు. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఒక ఉమ్మడి ఓటర్ల జాబితాతో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తాను 2014లో ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచీ చెబుతూ వస్తున్నారు. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ తమ ఎన్నికల మ్యానిషెస్టోలో కూడాఈ విషయం పేర్కొంది.
అయితే, ఇప్పుడు హఠాత్తుగా ఈ విషయం తెర మీదకు వచ్చింది. దీన్ని పరిశీలించేం దుకు వెంటనే కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫలితంగా దీని మీద ఊహా గానాలు వెల్లువెత్తాయి. ఇదే ఆశ్చర్యమనిపిస్తే అకస్మాత్తుగా అయిదు రోజుల పాటు పార్ల మెంట్ సమా వేశాలను ఏర్పాటు చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ అయిదు రోజుల సమావేశానికి అజెండా ఏమిటో కూడా వెల్లడి కాలేదు. ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టబోయే కీలక బిల్లుల విషయంలో కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సమా వేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తు న్నాయి. మొత్తానికి ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే కార్యక్రమం ఏదో రూపుదిద్దుకుంటున్నట్టు కనిపిస్తోంది.
విచిత్రమేమిటంటే, లోక్ సభలో వర్షాకాల సమావేశాల చివరి రోజున ప్రభుత్వం ఐ.పి.సి, సి.ఆర్.పి.సి, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం కోసం మూడు ముసాయిదా బిల్లులను రూపొందించడం కూడా ప్రతిపక్షాలకు అంతుబట్టని విష యంగా మారింది. ఆశ్చర్యకర, దిగ్భ్రాంతికర పరిణామాలు వ్యూహాత్మకంగా ఉపయోగ పడతాయేమో కానీ, శాసన పరమైన ఏకాభిప్రాయం సాధించడానికి మాత్రం ఏ విధంగానూ ఉపయోగించకపోవచ్చు. ఎనిమిది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇటువంటి చర్యలు పార్లమెంటరీ సూత్రాలకు ఏ విధంగానూ మేలు చేయవు. ఇంతకూ జమిలి ఎన్నికల మీద చాలా కాలం నుంచి కసరత్తు జరుగుతోంది. 21వ లా కమిషన్ ద్వారా కూడా కొంత ప్రయత్నం జరిగింది. ఈ కమిటీ గతంలో లా కమిషన్ చేసిన సిఫారసులనే ప్రాతిపదికగా చేసుకునే అవకాశం ఉంది. అంటే, ఈ ఎనిమిది మంది సభ్యుల కమిటీ త్వరలోనే తన నివేదికను సిద్ధం చేస్తుందనుకోవచ్చు. ఎంత త్వరగా అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చు.
One nation one election: జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు
ఇదంతా కంటి తుడుపు చర్య-కాంగ్రెస్