Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Teaching: బోధన.. ఓ ఆరాధన

Teaching: బోధన.. ఓ ఆరాధన

సార్‌ అనే పిలుపులో అవినాభావ ఆప్యాయత

ఆక్‌..‘శరం‘.. మెదడులో దూరి, వజ్రం ప్రకాశ తేజస్సును ఇస్తుంది. ఆజ్ఞానాన్ని అంతమొందిచే..ఆ శరాలను ఎక్కుపెట్టే వారే ఉపాద్యాయులు. వ్యక్తి జీవితాన్ని దేదీప్యమానం చేసేది విజ్ఞాన జ్యోతి. ‘సద్వినోడు ఎన్నడూ.. చెడడు’.. సదువు లేని వాని కెరుక సదువు, సంధ్య విలువ’ అని.. విద్య విశిష్టతను.. విడమరచి.. చెప్పేవారు మా నాన్న మాచన అభిమన్యు.
ఎవరు తనకు ఎపుడు తారసపడినా?!
చదవడం మరవకు ..రా.!
చదువు మానకు
అని ఎందరికో పదే పదే చెప్పేవారు.
తన స్వంత డబ్బుతో, నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, ఏకరీతి దుస్తులు కొని ఇవ్వటమే గాక, విద్యార్థులను స్వంత బిడ్డ ల్లా చూసుకున్న.. అభిమానధనుడు.
అభ్యసించే, విద్య అర్ధించే శిష్యులకు గురువే.. జీవిత దిశ, దశను నిర్దేశించే దైవత్వం.
విద్వత్తు, తేజస్సు మూర్తీభవించిన బోధకులుగా శిష్యు లకు ఉద్భోధ చేస్తారు ఉపాధ్యాయులు. అర్జునుడి విలు విద్య గొప్పతనం అతనికి, విద్య నేర్పిన ద్రోణాచార్యులదే.
వైద్య విద్యను అభ్యసించే వైద్య విద్యార్థులకు శరీర ధర్మ శాస్త్రము, ప్రాణాల్ని దక్కేలా చేసే వైద్యం బోధించే అధ్యాపకులకు ఇంకెంత సముచిత స్థానం దక్కాలి. చేతులు జోడించి నమస్కరించాలి. అలాగే విద్య, వైద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య, ఇలా ఎన్నో రకాల విద్యలతో సానపెట్టబడి, సమాజానికీ కావలసిన సత్తాను తమతమ విద్యార్థులకు అందించే ఉపాధ్యాయులు నిజంగా ధన్యులు . ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న నానుడి ఎలా ఉందో.. ఎంతటి వారైనా సరే ఓ గురువుకు శిష్యులే. అందుకే బోధనా వృత్తి అనేది ఆరాధనకు పాత్రం చేస్తుంది. టీచర్‌ లను విద్యార్థులు అమితంగా అభిమానించే లా ప్రీతి పాత్రుల్ని చేస్తుంది. ఈ విషయం ఒక ఉపాధ్యాయుడి కుమారుడుగా నేను స్వయంగా అనుభవించిన ఆత్మీయ ఆరాధనా భావం.
ఉపాధ్యాయ వృత్తి ఎంతటి మహోన్నత గౌరవం ఇస్తుందంటే ఊరుకు ఊరే.. తమకు జ్ఞానం ప్రసాదించిన సార్‌ కు ఊరేగింపు నిర్వహిస్తుంది. ఓ..ముత్యాల కొమ్మ, ఓ మురిపాల రెమ్మ. ఓ…రాములమ్మ ,రాములమ్మ అన్న ఈ పాటను రాసిన సుద్దాల అశోక్‌ తేజపై ప్రభుత్వ పురస్కరాల జల్లు కురిస్తే ఊరు పుష్పాల బాట వేసి పూవుల వాననే సార్‌పై కురిపించింది.
బడి, పాఠశాల, స్కూల్‌, కాలేజీ, కళాశాల, విశ్వవిద్యా లయం, యునివర్సిటీ ఇలా ఎన్నో పేర్లతో స్థాయిని బట్టి పిలుచుకునే సరస్వతీ సామ్రాజ్యాలకు తమ సర్వస్వం ధార పోసే ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు, ఆచార్యులు ఎంత వారైనా విద్యార్థుల ప్రేమతో కరిగిపోయెవారే.
ఇంట్లో అమ్మా నాన్నా ప్రేమల కన్నా.. సార్‌ అని పిలిచే పిలుపులో జాలువారే అవినాభావ ఆప్యాయత అనురాగం విద్యార్థులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. తల్లీ, తండ్రి కన్నా గురువునే అధికంగా ఆదరించి, అభిమానించే వృత్తి బోధన ఒక్కటే. అందుకే గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. తన సొంత పిల్లల బాగోగుల కంటే తనను, తన ప్రేమైక బోధననే తమ జీవితం అని నమ్మి అధ్యాపకులకు ప్రణమిల్లే విద్యార్థుల ప్రేమ, ఆదరణలే ఉపాధ్యాయులను వీరూ.. నా వాళ్ళే అన్న నమ్మిక కల్గిస్తాయి.
నేను స్వయంగా పండిత పుత్రున్ని కావడం నా పూర్వజన్మ సుకృతమైతే.. బడి, కళాశాల, విశ్వవిద్యాలయ వాతావరణాన్ని పలుకోణాల్లో ప్రేరణాత్మకంగా పరిశీలించే మహద్భాగ్యం నాకు కలగడం నిజంగా సరస్వతీ కటాక్షమే. మాచన అభిమన్యు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఆంగ్ల భాషా పండితులుగా పనిచేసి తన ఆఖరి శ్వాస వరకూ..బడి గురించే కలవరిచేవారు. ఉపాధ్యాయ వృత్తి ధర్మం అనుసారం తన అనుభవ సారాన్ని విద్యార్థుల విజ్ఞాన వికాసానికి ధారపోశారు. 1975 నుంచి 2009 వరకు మైల్వార్‌, ఆలూర్‌, మహేశ్వరం, తుక్కుగుడా, రాంపల్లి దాయర, ఎదులబాద్‌, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేసి ఆంగ్లం అంటే ఆమడ దూరం ఉండే గ్రామీణ విద్యార్థులను తనదైన శైలిలో గ్రామర్‌కు, గ్లామర్‌ జోడించి బోధించారు. ఇంగ్లీషును ఇష్టపడేలా పాఠాలు చెప్పారు. అందుకే ఆనాటి రాష్ట్రపతి కలాంతో కలిసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. కలలో కూడా అనుకోలేదు ఓ మహోన్నత వ్యక్తి నీ అందునా భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం టీచర్‌గా తనకు దక్కుతుందని భావించలేదని అభిప్రాయ పడ్డారు. ఎంతో ఆత్మసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంతుష్ట హృదయంతోనే దివికేగారు. ఇప్పటికీ ఎందరో విద్యార్థులకు అభిమన్యు ఆరాధనీయుడు అయ్యారు.
టీచర్‌ కొడుకుగా పుట్టడమే నా జన్మ పావనం అనుకున్న నాకు 2007లో ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంకు పౌర సంబంధాల అధికారిగా పనిచేసే భాగ్యం దక్కింది. మేధో ఉద్దండులైన సాంకేతిక శ్రష్టలు కొలువు దీరిన జేఎన్‌టీయూకు పీఆర్‌ఓగా సేవ చేసే అవకాశం నాకు కలిగించారు అప్పటి ఉపకులపతి ఆచార్య డాక్టర్‌ కుడేరు రాజ గోపాల్‌ సార్‌. ఎన్నో వైసిష్య్యాలతో అలరారే ఆ విశ్వవిద్యాలయంలో పనిచేసిన మూడు సంవత్సరాల కాలం నా జీవితంలో ఓ మైలురాయిలా నిలిచింది. బడిపంతులు కొడుకైన నాకు పెద్దల బడి అని అనదగ్గ విశ్వవిద్యాలయం ఒడిలో పనిచేసే అవకాశం ఓ అద్భుతం. ప్రపంచాన్ని తమ ప్రజ్ఞా పాటవాల ప్రదర్శనతో ప్రకాశింపజేయాలని ఉవ్విళ్లూరే యువ తరంగం జేఎన్‌టీయూ ప్రాంగణంలో తమతమ ప్రతిభకు పదును పెట్టుకునేవారు. బోధనను ఓ తపనగా భావించి, వజ్రాల్లాంటి మెరికలను భారతావని భవితకు అందించాలని ఆరాటపడే అధ్యాపకుల అనుపమాన భోదనా శక్తి ఆసక్తి అసాధారణ ప్రతిభ గల ఇంజనీర్లను అందించడానికి ఆరాటపడేది. నా స్టూడెంట్‌ గేట్‌ నేషనల్‌ టాపర్‌ అని అధ్యాపకులు ఎన్‌వీ రమణారావు ఎంతో ఆనందం వ్యక్తంచెయ్యడం ఇప్పటికీ మరవలేను.
మర్కట, మర్జాల సూత్రం విద్యార్థులకు ఆచరనీయ నియమం అని ఆచార్య డాక్టర్‌ కూడేరు రాజగోపాల్‌ ఒక సందర్భంగా ఓ పాత్రికేయునికి ఇచ్చిన ఇంటర్వులో చెప్పిన తీరు చదువు నేర్చుకోవడంలో, చెప్పడంలో విద్యార్థుల అధ్యాపకుల సమన్వయం ఎలా ఉండాలో తేటతెల్లం చేసింది.

  • రఘునందన్‌ మాచన
    రాష్ట్ర ప్రచార కార్యదర్శి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News