Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్విద్యతోనే సమాజంలో వినూత్న మార్పులు

విద్యతోనే సమాజంలో వినూత్న మార్పులు

అంకితభావంతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోండి

సమాజంలో అనుకూల్యత మార్పులు తీసుకురావాలంటే కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

శాసనమండలి సభ్యులు ఇసాక్ బాషా, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా, మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డీఈవో సుధాకర్ రెడ్డి, డివిఈవో సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ సమాజంలో సమూల మార్పులు తీసుకువచ్చి సానుకూల దృక్పథంతో వ్యవహరించడం విద్యతోనే సాధ్యమవుతుందని… ఈ మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉద్బోధించారు.

ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి నాడు నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, ఆణిముత్యాలు తదితర కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సాహం ఇస్తుందన్నారు. 5-18 సంవత్సరాల్లోపు బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే ప్రభుత్వం సీరియస్ గా చేపట్టిందన్నారు. జిల్లాలో ఇంకా దాదాపు 4000 మంది పిల్లలు బడి ఈడు పిల్లలు బడి బయట ఉన్నారని సంబంధిత విద్యాధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి 100 శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే పూర్తి చేసి బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చే విధంగా బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.

పదవ తరగతి అనంతరం బాలికల్లో ఆపై చదువులకు వెళ్లేందుకు గ్యాప్ ఏర్పడుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఓపెన్ స్కూల్లో కూడా అడ్మిషన్లు చేయించేందుకు కృషి చేయాలన్నారు.ఆర్థిక పరిస్థితులు చదువుకు ఆటంకం కాకూడదన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. విద్య అనేది తరగతి గదుల్లో చదవడమే కాదు ప్రవర్తనలో కూడా మార్పులు రావాలన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబమంతా విద్యావంతులవుతారన్నారు. ఉత్తమ విద్యతోనే సరైన నాయకున్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవచ్చన్నారు. విద్యార్థులు అంకితభావంతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ హితబోధ చేశారు.శాసనమండలి సభ్యులు ఇసాక్ బాషా మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నా గురువు లేనిదే ఉన్నత స్థాయి లభించదన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేదరికంలో ఉంటూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనేక ఉన్నత పదవులు అలంకరించడంతో పాటు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తన జన్మదినాన్ని గురుపూజోత్సవ దినోత్సవంగా మార్చారన్నారు. నాడు నేడు కింద ఉపాధ్యాయులకు విద్యతో పాటు మరిన్ని బాధ్యతలు పెరిగాయన్నారు.

విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతోపాటు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ మనిషి సరైన మార్గంలో నడిచి మంచి ప్రవర్తనతో మెలగాలంటే విద్య అత్యంత ఆవశ్యకరమన్నారు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికైనా ఉపాధ్యాయులే వెనుక ఉంటారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆయన కోరారు.మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య, విద్యా రంగాలకుఅత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారన్నారు.అనంతరం గుర్తించి ఎంపిక చేసిన 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News