Elon Musk: Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏం చేసినా సరే అది సంచలనంగా మారుతుంది. ఇటీవల ట్విటర్ పగ్గాలు అందుకున్న మస్క్.. తనదైన నిర్ణయాలతో అందరికి షాక్ ఇస్తున్నాడు. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తీసివేశాడు. ట్విటర్ విధానాలను మార్చేశాడు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టుల ఖాతాలను తొలగించాడు. దీంతో ఆయనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మరో వైపు ట్విటర్ సంస్థ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఇలాంటి సమయంలో తాను ట్విటర్ సీఈవోగా కొనసాగాలా..? వద్దా అంటూ ఓ పోల్ పెట్టాడు. అందులో వచ్చే ఫలితం ఏదైనా సరే దాని ప్రకారమే నడుచుకుంటానని కూడా చెప్పాడు. ఈ పోలింగ్‌లో 57.5 శాతం మంది సీఈఓ పదవి నుంచి మస్క్ తప్పుకోవాలంటూ ఓటు వేశారు. దీంతో మాస్క్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటారో లేదో అని ఆసక్తి నెలకొంది. దీనిపై మాస్క్ కూడా మరోసారి ఆయన ట్విట్టర్ ద్వారానే స్పందించారు.
ట్విట్టర్ చీఫ్ గా తప్పుకోవాలా? ఉండాలా అనే సర్వేలో మస్క్ కు వ్యతిరేకంగా ఔను అనే ఎక్కువ ట్వీట్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన మస్క్.. ఈ బాధ్యతలు చేయడానికి తగిన మరో మూర్ఖుడు దొరకగానే నేను సీఈఓగా తప్పుకుంటానని.. ఆ తర్వాత నేను కేవలం సాఫ్ట్ వేర్, సర్వర్ టీమ్ కు మాత్రమే హెడ్ గా ఉంటానని ట్వీట్ చేశారు. మరి అప్పుడైనా తప్పుకుంటారా? లేక అప్పుడు మరో సాకు చెప్తారో చూడాలి.