Lemons In China: చైనాలో నిమ్మకాయల కోసం అక్కడ ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఫ్రూట్, వెజిటబుల్ మార్కెట్లలో ఎక్కడ చూసినా నిమ్మకాయల కోసం ప్రజల బారులు కనిపిస్తున్నాయట. ఇంతకీ ఇక్కడ నిమ్మకాయలకి ఇంత డిమాండ్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? ఇంకేముంది కరోనా వల్లనే. ఔను.. చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. ఇక్కడ ఆసుపత్రుల దగ్గర ఎక్కడ చూసినా ప్రజలు సెలైన్లు పట్టుకొని క్యూలో కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఆసుపత్రులలో బెడ్లు లేక తగిన మందులు లేక అవస్థలు పడుతున్నారు.
కొవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత కేసులు అమాంతం పెరిగగా.. రాబోయే మూడు నెలల్లో 60శాతం మంది కొవిడ్ బారిన పడే అవకాశముందని అటు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు గృహ వైద్యంపై దృష్టిపెట్టారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నిమ్మకాయ రసాన్ని తెగ తాగేస్తున్నారు.
మొన్నటి వరకు ఇలాంటి చిట్కాలు, హోమ్ రెమిడీస్ వంటి వాటిని చైనా ప్రజలు పెద్దగా నమ్మకపోగా ఇప్పుడు మాత్రం వీటిపై దృష్టి పెట్టారు. దీంతో ఇటీవలి కాలంలో చైనాలో వీటి గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో నిమ్మకాయలకు గిరాకీ బాగా పెరిగిందట. మహమ్మారిని ఎదుర్కొనేలా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ‘సి’ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు మెరుగ్గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు నిమ్మకాయలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారట. వీటితో పాటు నారింజ, పియర్స్, పీచ్ వంటి పండ్లకు కూడా గిరాకీ పెరిగి దుకాణాల వద్ద ప్రజల బారులు కనిపిస్తున్నాయట.