Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Moody's report: విదేశీ పెట్టుబడులపై వివాదాస్పద వ్యాఖ్యలు

Moody’s report: విదేశీ పెట్టుబడులపై వివాదాస్పద వ్యాఖ్యలు

మూడీ రిపోర్ట్ పై మండిపడుతున్న కేంద్రం

భారతదేశ అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ పెట్టుబడుల గణన సంస్థ మూడీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాస్పదంగా మారాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ, ఈ దేశంలో విదేశాలు పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై మూడీ సంస్థ కేవలం ‘బి.ఎ.ఎ.3’ రేటింగ్‌ మాత్రమే ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్పటికీ, గత 7 నుంచి 10 ఏళ్ల కాలంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నా యంటూ మూడీ వ్యాఖ్యానించింది. సాధారణంగా జి.డి.పి వృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయస్థాయులు పెరుగుతాయని, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం జరుగుతుందని మూడీ పేర్కొంది. దీనివల్ల కాలక్రమంలో ద్రవ్య స్థిరత్వం ఏర్పడుతుందని, ఉన్నత స్థాయిలో ప్రభుత్వ రుణం కూడా తగ్గుతూ ఉంటుందని మోడీ వ్యాఖ్యానించింది.
భారతదేశం అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, సాంఘిక సంక్షోభాలు, పౌర సమాజంపై ఉక్కుపాదం, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు, రాజకీయ విమర్శలను పట్టించుకోక పోవడం, వ్యవస్థలు బలహీనపడుతుండడం వంటి కారణాల వల్ల విదేశాలు పెట్టుబడులు పెట్ట డానికి సందేహిస్తున్నాయని కూడా అది వ్యాఖ్యలు చేసింది. ఇది మరికొన్ని వివాదాస్పద, అసంగత వ్యాఖ్యలు కూడా చేసింది. దేశంలో పేదరికం పెరుగుతోందని, అసమానతలు పెరుగుతున్నాయని, విద్యావకాశాలు ఉండడం లేదని, వీటితో పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, రాజకీయపరమైన ఇబ్బందులు కూడా ఉంటున్నాయని ఇది పేర్కొంది.
మూడీ వంటి కొన్ని రేటింగ్‌ సంస్థలు పనిగట్టుకుని, ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రచారాలు సాగిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం నుంచి చెబుతూ వస్తోంది. భారతదేశ స్థూల ఆర్థిక పరామితుల మెరుగుదలను తక్కువ చేసి చూపించడానికి మాత్రమే ఈ సంస్థలు పరిమితం అవుతున్నాయని అది గతంలోనే ఒకసారి ఘాటుగా విమర్శించడం జరిగింది. దేశంలోని కొన్ని కుట్రపూరిత రాజకీయ సమస్యలను ఆర్థిక, సామాజిక, భద్రతా సమస్యలుగా చిత్రీకరించడానికి ఇవి ప్రయత్నిస్తున్నాయని కూడా అది విమర్శించింది. నిష్పక్షపాతంగా భారతదేశ ప్రగతిని అంచనా వేయాలని గత జూన్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం మూడీ ప్రతినిధులకు స్పష్టంగా తెలియజేసి నప్పటికీ, ఆ సంస్థ బి.ఎ.ఎ.3 రేటింగ్‌ ను మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం రేటింగ్స్‌ లో చిట్టచివరి రేటింగ్‌.
భారత్‌ ఉన్నత స్థాయిలో రుణాలు సేకరించిందంటూ మూడీ తన నివేదికలో వ్యాఖ్యానించ డాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. భారత్‌ ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి రుణాలు తీసుకోవడం లేదని, కేవలం దేశీయంగానే రుణాలు సేకరించడం జరుగుతోందని, దీన్ని ఉన్నత స్థాయి రుణాల కింద ఎలా జమకడుతున్నారని అది ప్రశ్నించింది. ఇంతకన్నా దారుణమైన సాంఘిక సంక్షోభాలు, యుద్ధ వాతావరణాలు, రాజకీయ సమస్యలున్న దేశాలకు కూడా మూడీ ఉన్నత స్థాయి రేటింగ్‌ ఇవ్వడాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అయిన అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆక్షేపించారు. భారత, చైనా దేశాలకు రేటింగ్‌ ఇవ్వడంలో మూడీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కూడా ఆయన విమర్శించారు. ఈ రేటింగ్‌ సంస్థలు భారత్‌ వంటి వర్ధమాన దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయన్న విమర్శలో నిజం ఉంది. అయితే, భారత్‌ కూడా మూడీ పేర్కొన్న అంశాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
సాధారణంగా యుద్ధాలు, సంక్షోభాలు ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా బలహీనపరిచే అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్న పక్షంలో సామాజిక వాతావరణం సుస్థిరంగా ఉండక తప్పదు. విదేశీ పెట్టుబడిదార్లకు సామాజిక భద్రత చాలా ముఖ్యమనే విషయాన్ని విస్మరించకూడదు. భారతదేశ ఆర్థిక పురోగతిపై మూడీ సంస్థ వ్యక్తం చేసిన అభిప్రాయం తుది అభిప్రాయం కాకపోవచ్చు. అయితే, అంతర్జాతీయ పెట్టుబడిదార్లకు ఈ రేటింగ్స్‌ ను సీరియస్‌ గా తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News