శ్రీ కృష్ణుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. దుష్ఠులను శిక్షించడానికి ఆయా కాలాలలో అతను ఎత్తిన అవతారాలలో శ్రీకృష్ణావతారం ఒకటి. శ్రీ కృష్ణుడు జగానికి ఆద్యుడు. భారత దేశంలోనే కాక చాలా దేశాలలో కూడా శ్రీకృష్ణ మందిరాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని కొలిస్తే ఓ అనిర్వచనియమైన ఆనందం కలుగుతుంది. సకల కళా వల్ల భుడు శ్రీకృష్ణుడు. 1966 లో అమెరికా దేశంలో ఇస్కాన్ మందిరాన్ని శ్రీల ప్రభుపాద దాస్ గారు స్థాపించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 108 ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. ఇస్కాన్ అనగా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్ నెస్ అని అర్ధం. శ్రీకృష్ణుని గురించి చెప్పాలంటే ఒక ఉద్ గ్రంధమే అవుతుంది. చాలా మంది వేలాది మంది భార్యలు ఉన్నారు అని చెబుతారు. వేలాది మంది అతన్ని కోరి వచ్చినవారే కాని శ్రీకృష్ణుడు ఎవరిని మోహించలేదు, చెరపట్ట లేదు, మోసగించ లేదు. స్వాతహాగా అతన్ని ఆరాధించి భార్యలు అయిన వారు ఉన్నారు. రుక్మిణి ఆ విధంగానే భార్య అయింది. రుక్మిణి హృదయంలో ఎప్పుడు శ్రీ కృష్ణుడు ఉండేవాడు. ఆమె చాలా ఆరాధనగా శ్రీ కృష్ణుని ప్రేమించింది. అతని భార్యగా కావాలి అనుకుంది. అలా ఇష్ట సఖిలలో ఒకరిగా రుక్మిణి స్థానం పదిలం.
పసితనంలో శ్రీకృష్ణుని లీలలు ఇన్నీ, అన్నీ కావు. చూడముచ్చటగా ఉండటం, అందమైన వర్చస్తు, చెరగని చిరునవ్వు శ్రీ కృష్ణుని సొంతం. బుడి, బుడి అడుగులు వేస్తూ రేపల్లె అంతా కలియతిరిగేవాడు. కృష్ణుని అల్లరి అంతా, ఇంతా కాదు. వెన్న దొంగ అని అందరూ పిలిచేవారు. అందుకే ఉట్టిపై వెన్న కుండ ఉంచేవారు. కృష్ణుడు తెలివిగా తన పరివారంతో వెళ్ళి, వారి వీపు పై ఎక్కి వెన్న ఉట్టి అందుకుని తనివి తీరా తలఆడిస్తూ తాను అరగించి తన మిత్రులకు ఇచ్చే వాడు. అలా ప్రతి ఇంటిలో వెన్న లేకుండా పాయింది. వెన్న పోవడం చూసి అమ్మ లక్కలు లబోదిబో అనే వారు. వాళ్ళందరిని శ్రీ కృష్ణుడు నవ్వుతూ చూసేవాడు. గృహలలో వెన్నపోతే మాత్రమేమి కృష్ణుడు అడుగు పెట్టిన ప్రతి ఇంటికి వెన్న లాంటి లాభలే వచ్చి పడ్డాయట. అలా రేపల్లెలో అందరి వాడైనాడు గోపాలుడు.
కురు పాండవులకు ఇద్దరికీ కావాల్సిన వ్యక్తి శ్రీ కృష్ణుడు. కృష్ణునికి అర్జునుడంటే ఇష్టం, ఆయన సోదరుడు బాలరాముడికి దుర్యోధనుదు అంటే మహాఇష్టం. అలా అన్నదమ్ములు ఇద్దరు చెరో పక్షం ఉండవలసి వచ్చింది. పాండవులకు అసాంతం శ్రీ కృష్ణుడు అండగా ఉన్నాడు. కృష్ణుడి అండనే లేకపోతే పాండవులు ఏ పాటివారో అందరికీ తెలుసు. అయినా పాండవులు శ్రీకృష్ణుని ఎన్నడూ తులనాడ లేదు. పైగా ఆయన అంటే మంచి భక్తి, విధేయత ఉంది. వాళ్ళు కృష్ణుని ఆరాధించారు. ధర్మజుడు రాజసూయాగం చేసినప్పుడు అగ్రాధిపత్యం ఎవరికీ ఇవ్వాలి అని ఆలోచనలో ఉండగా మీ అందరికీ ఆప్తుడు, మాకు ఇష్టమైన వాడు శ్రీకృష్ణునికే అధిపత్యం అని అందరూ చెప్పారు. ఇది కౌరవులకు ఇష్టం లేదు. పైకి ఏమి అనకుండా గుంబనంగా ఉన్నారు. అందరి మాట గౌరవించి పాండవులు శ్రీ కృష్ణునికి అధిపత్యం ఇస్తున్న తరుణంలో, అదే సమయంలో శిశుపాలుడు శ్రీ కృష్ణుని తులనాడటం, కృష్ణుడు ఆనాడు తన అత్తకు ఇచ్చిన మాట నెరవేర్చడం, శిశుపాలుని వధించటం అంతా కృష్ణ లీలే. హే ముకుందా అని పిలువగానే కరుణించే ప్రదాత శ్రీ కృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామంలో బీష్ముడు పాండవుల సేనను చీల్చి చెండాడటం, పాండవులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ఇప్పుడే బిష్ముని సంహారించి యుద్దానికి ముగింపు పలుకుతా అని శ్రీ కృష్ణుడు రధం దిగి చక్రం సంధించగా, బీష్ముడు అది చూసి ‘హే ముకుందా! శ్రీ కృష్ణా నీ చేతులలో చావడం అంటే అంత కన్నా అదృష్టం ఏముంది, రా కృష్ణా.. ముకుందా సంహారించు అని వినమ్రంగా బీష్ముడు చేతులు జోడించి వేడుకున్నప్పుడు, బీష్మ మాటలకు కదిలిపోయాడు శ్రీ కృష్ణుడు. ఓ మహానుభావుడు ఎదురులేని యోధుడిని సంహారించక అతని మాటలకు కరిగి పోయాడు. తర్వాత పరిణామాలు బీష్ముడు ఎలా మరణించాడో అందరికీ తెలిసినదే. శ్రీ కృష్ణుని ‘ కపట నాటక సూత్రాధారి ‘అని పిలిచింది ఒక్క దుర్యోధనుడే.
కురుక్షేత్ర సమరం జరగరాదని సకల విధాలా ప్రయత్నించిన వ్యక్తి శ్రీకృష్ణుడే. యుద్ధం రాకూడదని ఇరువురు ’రాజీ ’కావాలని స్వయంగా హస్తినకు బయలు దేరారు. అక్కడ దుర్యోధనుని మందిరంకు వెళ్లకుండా, విధురుని గృహంలో దిగాడు. కారణం అక్కడ స్వాగతం చెప్పటానికి దుర్యోధనుడు రాడు, తన పరివారాన్ని పంపుతాడు. మర్యాదలన్నీ బాగా జరుగుతాయి కాని దుర్యోధనుడు ఉండడు. భోజన సమయంలో కూడా అంతే. పలకరింపు, ప్రేమ, ఆప్యాయుత ఉండవు. అది తెలిసే శ్రీ కృష్ణుడు విధురుని ఇంటికే వెళ్ళాడు. అక్కడ రాజ వైభవం ఉండదు. కాని ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయుత ఉంటుంది, అనురాగం ఉంటుంది. స్వయంగా విధురుడే ఎదురేగి ఎంతో గౌరవిస్తాడు. అతిధి మర్యాదలు చేసి ఉన్నత ఆసనంపై కూర్చో బెట్టి, శ్రీ కృష్ణుని చూసి పరవశం చెందుతాడు. ఆ పరవశంలో ’హే కృష్ణా.. ముకుందా అంటూ అరటి పండు పల్లెంలో పెట్టి, తన్మయంతో తోలు అందిస్తాడు. అతిధి ఇచ్చినది ఏదయినా అమృత ప్రాయమైనదని తలచి అరటి తోలు అరగిస్తాడు. తర్వాత జరిగిన తప్పుకు విధురుడు క్షమించమని కోరుతూ ప్రాధేయ పడతాడు. శ్రీ కృష్ణుడు చిరునవ్వు నవ్వి విధురుని అలింగనం చేసుకుని ‘నీ భక్తి అనన్య సామాన్యం, నీ చరిత్ర అజరామరం అని కీర్తిస్తాడు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ఆ విధంగా తనను పొగడుతుంటే విధురుడు పొంగి పోయి ‘హే కృష్ణా!ముకుందా ఈ జన్మకు ఇది చాలు ‘అని శ్రీ కృష్ణుని పలు విధాలుగా పొగడుతాడు. చిరునవ్వుతోనే శ్రీ కృష్ణుడు విధురుని హత్తుకుని దీవిస్తాడు.
జనులు ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు ‘ హే కృష్ణా.. ముకుందా ‘అంటే కష్టాలు తొలగుతాయని నమ్మిక. ఈ కృష్ణాష్టమి సందర్బంగా జనుల కష్టాలు అన్నీ తొలగి ఆయురారోగ్యాలతో ఉందురు గాక. ‘సర్వే జనా సుఖీ నోభవంతి’
- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027.