ప్రపంచ దేశాల్లో కరోనా విలవతాండవం మళ్లీ మొదలైంది. రెండున్నరేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుండి విజృంభిస్తుండడం మిగతా దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. మరోవైపు నిపుణులు.. కరోనా ఫోర్త్ వేవ్ కు ఇవి సంకేతాలు కావొచ్చని, అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఏ వేరియంట్ కు చెందినవో తెలుసుకోవాలని తెలిపింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతుండటం.. మాయదారి మహమ్మారి ముప్పు ఇంకా తొలపోలేదనేందుకు అద్దంపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. అందుకే కరోనా టెస్టుల శాంపిళ్లను ముందుగానే జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా.. ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులు భారత్ లో ఉండబోవని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా ప్రముఖ జాతీయ మీడియాకు తెలిపారు. మన దగ్గర దాదాపు అందరికీ టీకాలు ఇవ్వడంతోపాటు, అధిక శాతం కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన విషయాలను ప్రస్తావించారు. చైనా, ఇటలీ పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన సన్నద్ధతతో ఉండడం మంచిదేనన్నారు. తొలిసారి కరోనా మనదేశంలోకి ప్రవేశించేటప్పకి మనకు దానిపై అవగాహన లేకపోవడం, దానిని ఎదుర్కొనే రోగనిరోధకశక్తి లేకపోవడంతో కేసులు పెరిగాయన్నారు. ఇప్పుడు మన దగ్గర టీకాలతో పాటు, రోగనిరోధక శక్తి కూడా కావలసిన స్థాయిలో ఉండటం మంచిదేనని గులేరియా పేర్కొన్నారు. చైనాలో పెరుగుతున్న కేసులను చూసి ఆందోళన చెందవద్దని సూచించారు.