వలసల పాలమూరు నేడు ఐటీ పాలమూరు అయ్యిందని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయన మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలో ఉన్న ఐటీ టవర్ లో జువెన్ టెక్ ఇంక్, ఉపర్ టెక్ కంపెనీల కార్యకలాపాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ పాలమూరు ఐటి పట్టణానికి మరో మణిహారమని, 400 ఎకరాలలో ఏర్పాటుచేసిన మహబూబ్నగర్ ఐటి యువతకు బంగారు భవిష్యత్తు అని, వారి అభివృద్ధికి మంచి బాటలు వేస్తుందని తెలిపారు. ఇక్కడే ఇండియాలోనే అతిపెద్దదైన సెల్ కంపెనీ ను ఏర్పాటు చేయబోతున్నామని ,ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నీటిని విడుదల చేసిన అనంతరం మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కాబోతున్నదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మూడు నెలల్లోనే ఐటీ టవర్ కు 400 ఎకరాల భూమిని సేకరించి ఎవరు ఊహించనంతగా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని చెల్లించి ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు.
శుక్రవారం ప్రారంభించిన ఐటీ టవర్ లోని రెండు కంపెనీల ద్వారా 11000 మందికి ఉద్యోగాలు పొందగా, 11,000 కుటుంబాలు ఇక్కడకు రానున్నాయని, భవిష్యత్తులో 30 ,40 వేల కుటుంబాలు ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని, ఇప్పటికే ఐదు లక్షల రూపాయలు ఉన్న ఎకరా స్థలం మూడు, నాలుగు కోట్లకు పెరిగిందని, పాలమూరు- రంగారెడ్డి తో ఈ ప్రాంతం సస్యశ్యామలమైతే పారిశ్రామికంగా కూడా అభివృద్ధి సాధిస్తామని, స్థానికంగా భూములకు, ఆస్తులకు విలువలు పెరుగుతాయని అన్నారు. ఇకపై జిల్లా యువత బతుకుదేరువు కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదని, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల వారందరికీ ఉద్యోగాలు వచ్చేలా శ్రమిస్తామని మంత్రి తెలిపారు.
మహబూబ్నగర్ ఐటీ లో ఉద్యోగాలు పొందిన వారు బాగా ఎదగాలని, వచ్చిన ఉద్యోగంలో ముందుగా చేరి ఉన్నత స్థానాలకు వెళ్లాలని మంత్రి అన్నారు. జువేన్ టెక్ అధినేత జిల్లాకు చెందిన బిడ్డ ఉమాకాంత్ ,కంపెనీ ప్రతినిధి ప్రవీణ్,ముందుకు వచ్చి 100 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను మహబూబ్నగర్ ఐటి నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జువెన్ టెక్ అధినేత ప్రవీణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.