పరాయి భాషల ప్రభావంతో కన్నతల్లినే (మాతృ భాషనే) కాదంటున్న వికృత పరిస్థితులకు చెల్లు చీటి ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించాలి. పసి ప్రాయంలోనే తల్లిదండ్రులు ఆంగ్ల భాష మోజులో ‘మమ్మీ, డాడీ అని పిలిపించుకోవాలని తాపత్రయంతో మూల కణాలపై కేనర్స్ లాంటి వ్యాధిని ప్రవేశ పెట్టడం వలన తరానికి మన మూలమైన అమృత భాష తెలుగు తెలియకుండా పోతుంది. ఏ వస్తువును ఏమంటారో తెలుగులో చెప్పలేని, నేర్వ లేని దుస్థితి.
ప్రపంచ మహాసభల పేరిట ఒక ఉద్యమంగా ఉవెత్తున ఎగసిన కెటరం తన ధాటితో లక్ష్యాన్ని సాధించలేక పోయింది. కొద్ది రోజుల హడావుడి తరువాత చప్పబడి పోయింది. ఆంధ్రులు ఆరంభ శూరులు అన్న మాట యధార్ధమేమో, ‘ ఆ’ స్థానంలో ‘ఏ’ అనేది అమ్మకు ఎన్న టికి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.
ఏ భాష నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషము ఎవరికోసమురా
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెదవెందుకురా
తెలుగు వాడిపై తెలుగు రాదనుచూ
సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా.
కాళోజి నారాయణరావు అన్నట్లు వ్యామోహం వదలి కన్నతల్లిని ప్రేమించినట్లు భాషను ప్రేమిస్తూ తరువాత తరానికి ఆ తియ్యదనాన్ని రుచి చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మా అబ్బాయి / అమ్మాయి ఎల్.కె.జి. ఫీజు రూ.4,00,000/- లు అని గొప్పలు చెప్పు కుంటున్న వారు అసలు ఎందుకు కడుతున్నామో, దేనికోసం కడుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. మూడేళ్లు కూడా నిండని పసి మొగ్గను ఆధునిక చెరసాలల్లో వేసి మురిసి పోతున్న తల్లిదండ్రులను చూచి నవ్వాలో ? ఏడవాలో తెలియడం లేదు.
వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యా లు, ప్రబంధాలు, నవలలు, కథలు, కథానికలు, కవితలు మొదలైన సమగ్ర సాహిత్య సంపద కలిగిన అపూర్వ భాష మన తెలుగు భాష, ఇది మృత భాష కావడం అంటే మన ప్రకృతిని మనమే విధ్వంసం చేయడం. మన కన్న తల్లిని మనమే హత్య చేయడం అన్న విషయం ప్రతి ఒక్కరు అర్ధం చేసు కోవాలి. ఇటాలియన్ ఆప్ ఈస్టుగా ప్రపంచంలోనే అతి సుందరమైన లిపులలో రెండవ స్థానం కలిగిన లిపి మన తెలుగు లిపి అని తెలుసుకోండి.
మా అమ్మ, మా నాన్న, మా అన్న అని పరిచయం చేయడానికి మొహమాటమేమిటో? అంతస్తుల తారత మ్యాలు ఏమిటో ఎప్పటికి అర్ధం కావు. కుటుంబ బంధాలు అంతర్ సూత్రం ఆ పిలుపులే అన్నది సుస్పష్టం. గ్రామాల న్నింటిలో కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరిని బాం ధవ్యాలతో కట్టి పడేసినవి ఈ వరుసలే అన్నది యధార్థం. వాటి స్థానాల్లో అంకుల్, ఆంటీలు వచ్చి చేరి వారు మనకు ఏమి అవుతారో తెలియని సందిగ్ధావస్థలోకి నెట్టారు. అన్నయ్య, తమ్ముడు స్థానం ’ బ్రో’ల సంస్కృతి వచ్చి ’ బేర్ ’ మనిపిస్తుంది. ఇది ఒక ప్రక్క అయితే మరోప్రక్క తల్లులు సౌందర్య లాలసతో చనుబాలు ఇవ్వని స్థితిలో భాషా మ్మదనాన్ని వారికి అందకుండా శ్రీకారం చుడుతున్నా రేమో ? అజంతమైన భాష మహోన్నత రూపాన్ని ఒక్కసారి ఆ బిడ్డకు రుచి చూపిస్తే ‘మందార మకరందమున దేలు ‘ అన్నట్లు ఆ అమృత వర్షంలో తడిచి ముద్దై పునీతుడౌతాడు.
ఇది ప్రభుత్వాలు, సంస్థలు చేయవలసిన పని కాదు. ప్రతి తల్లి పూనుకుంటేనే ఇది సాధ్యం. అక్షరమాల, గుణింతాలు, పదాలు చిన్ననాడే ఔపాసన పట్టించాలంటే ప్రతి తల్లి విధిగా అవి నేర్చుకోవాలి. ’ క్రష్ ’ లు ఎన్నటికి బాల్యాన్ని చిదిమేసేవే అవుతాయి తప్ప ‘అమ్మలు ’ కాలేవు. ప్రాశ్చాత్య నాగరికత, పరుగులెత్తే ఉద్యోగాలు, అర్ధం లేని జీవన గమనాలు బిడ్డ బాల్యాన్ని కఠినతరం చేస్తున్నాయి.
మాతృ భాష వంట పట్టినంతగా పరాయి భాష హత్తుకోలేదు. ఒక పాట మనిషి జీవితాన్ని మారుస్తూ ఉందంటే ఆ గొప్ప దనం ఆ పాటలోని సునిశిత అక్షరాలు, అర్ధవంతమైన పదాల వలననే అని గమనించాలి. వాటి అన్నింటిని కలిపి మనకు చేరుస్తున్న గొప్ప దనం భాషది మాత్రమే.
అగాధమగు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నటులే ’ అన్న’ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందన్నా మనం ఉప్పొంగి పోయామంటే తెలుగు భాష మనల్ని అమ్మలా అక్కున చేర్చుకొని ఓదార్చినట్లుగా భావించడం వల్లనే అనేది సుస్పష్టం.
బ్రతుకు తెరువు వేరు, బ్రతుకు వేరు ఈ తేడాను గమ నించక పోవడం వలననే ఇన్ని అనర్ధాలు. జీవించడానికి కావలసిన ఆర్థిక అవసరాలు ‘బ్రతుకు తెరువు’ అను బంధాలు, మనస్సును నియంత్రించుకోవడానికి కావలసిన అండ, ఓదార్పు, ప్రేమ, అభిమానం, వాత్సల్యం, నైతిక విలువలు, ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం ఇవన్ని కలిపితే ’ బ్రతుకు ‘ ఆ బ్రతుకుకు మూలం తెలుగు భాష. నీకు కష్టం వచ్చినపుడు నీ తల్లి ఒడిలో పొందే ఓదార్పుకు, నాన్న చిటికిన వేలు పట్టు కొని నడిచిన స్థైర్యానికి మూలాధారం మాతృ భాష అని గుర్తించాలి..
శరీరంలోని శ్వాస, రక్తంలా మన భావ పరంపరకు అక్షర రూపంగా నిలిచిన అజరామరమైన మాతృభాష తెలుగును మనలో జీర్ణం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడైన విజయం సాధించ వచ్చనే నగ్న సత్యాన్ని నమ్మండి.
అన్య భాషలలో మన సౌలభ్యం కోసం కొన్ని పదాలను అరువు తెచ్చుకొని అదే పిల్లలకు నేర్పిస్తూ అసలైన మన మాతృ భాషను సంకరం కానివ్వొద్దు. తర తరాలుగా మన వారసత్వ సంపదగా వస్తున్న తెలుగు భాషపై ఏ దాడిని సహించొద్దు. అమ్మా అనే మధురమైన పిలుపుకు దూరం కావడం అంటే మన కన్న తల్లి మనకు దూరం కావడమే అని గ్రహించడి. బిడ్డ ప్రతి కదలికను అబ్బురంగా చూచే అమ్మలా భాషలో ప్రతి అక్షర మాధు ర్యానికి మహాదానంద పడేది భాషా మాతృమూర్తి. తెలుగు దేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స. .అన్న శ్రీకృష్ణ దేవరాయుల ఆత్మశక్తి కేవటం తెలుగుభాషే అన్నది నగ్న సత్యం. మనలోని భావాల ప్రసరణకు ఆయువు పట్టు తెలుగు భాష. ఎదుటి వారి హృదయాలను కదిలించా లన్నా, వారికి మనం దగ్గర అవ్వాలన్నా, మన మనస్సు వారికి తెలియాలన్నా కేవలం మాతృభాష వల్లనే సాధ్యం.
వృక్షో రక్షతి రక్షతి : అన్నట్లు అక్షరో రక్షతి రక్షతి : ‘చెట్టు ప్రకృతిని కాపాడినట్లు అక్షరం సమాజాన్ని కాపా డుతుంది. ఉద్యోగమైనా, సద్యోగమైనా ఆంగ్ల భాష వస్తేనే అన్న పిచ్చితనంతో మధురమై మాతృభాషను కాలదన్ని వికట్టహాసం చేస్తున్న తరం తెలుసుకోవలసింది. కన్న తల్లి తన బిడ్డ అవసరాలను చూచి ప్రేమతో లాలించి పెంచినట్లే భాష కూడా తన అభిమానిని పెంచి పోషించి అద్భుతమైన స్థానంలో నిలబెడుతుందని గుర్తించాలి.
ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికి ‘పద్యం’ మన భాష సొత్తు అవ్వడానికి ఒకే ఒక్క కారణం మన భాష అజంతం కావడం. ‘ఎక్కడి నుండి రాక’ చెల్లియో చెల్లకో ‘అదిగో ద్వారకా’ వంటి పద్యాలు’ ఉప్పు కప్పురంబు నొక్క ‘పోలి కనుండు’ సాధనమున పనులు సమకూరు ధరలోన ‘పలికెడిది భాగవతమట’ మందార మకరందం వంటి పద్యాలు కేవలం తిరుపతి వేంకట కవులు, పోతన, వేమన ల చేతనే కాదు. ప్రతి తెలుగు వాని హృదయ వాణి.
‘ఇచ్చోటనే సత్కవీంద్రుల’ ‘ఇచట కనులు మోడ్చిన మందబాగ్యుండొక్కడు’ అంటూ జీవన వైరాగ్యాన్ని చెప్పిన అక్షరాలు జాషువావే కావు, మనందరివి కూడా. కాబట్టి ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టిన తెలుగు భాషను కాదనడం, ఎందుకూ కొరగాదనడం మూర్ఖత్వం. ‘తెలుగుభాషే మనకు జీవనాడి’ భాషే గెలుపుకు దారి.
అట్లూరి వెంకటరమణ
- 9550776152