చైనాలో కరోనా మరోసారి విజృంభించి.. మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వేరియంట్ ను భారత్ లోనూ గుర్తించారు. చైనాను వణికిస్తోన్న బీఎఫ్ 7 వేరియంట్.. భారత్ లోనూ వ్యాపిస్తోందని తాజాగా వెల్లడైంది. ఇప్పటి వరకూ భారత్ లో మూడు బీఎఫ్ 7 కేసులు నమోదవ్వగా.. మొదటి కేసును ఈ ఏడాది అక్టోబరులోనే గుర్తించారు. గుజరాత్ బయోటెక్నాలజీ సెంటర్లో బీఎఫ్ 7 వేరియంట్ ను గుర్తించారు. మిగతా రెండు కేసుల్లో ఒకటి గుజరాత్ లో.. మరొకటి ఒడిశాలోనూ బయటపడ్డాయి.
ప్రపంచ దేశాల్లో కరోనా పెరుగుదల, భారత్ లో కరోనా పరిస్థితులపై.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం (డిసెంబర్ 21) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భారత్ లో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో ప్రస్తుతం పెరుగుదల లేకపోయినప్పటికీ.. కొత్త వేరియంట్లపై నిఘా ఉంచాలని సూచించారు. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కొవిడ్ ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని, అధికారులు నిశితంగా పరిశీలిస్తుండాలని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మనదేశంలో భయపడాల్సిన అవసరంలేదన్న కేంద్రం.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది.