Kapula Reservation Bill: కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కాపులకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన 5శాతం రిజర్వేషన్ చెల్లుతుందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబిసి రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
2019లో టీడీపీ ప్రభుత్వం హయాంలో కేంద్రం ఓబీసీ కోటా నుంచి కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్దమేనని, అది చెల్లుతుందని కేంద్రం తెలిపింది. 103 రాజ్యాంగ సవరణ చట్టం-2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10శాతం రిజర్వేషన్ల కల్పించవచ్చని కేంద్రం తెలిపింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చునని కేంద్రం తెలిపింది.