అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మినీ యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కౌశిక్ రెడ్డికి అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కరీంనగర్ జిల్లాలోనే ఏకైక పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని టెంపుల్ సిటీగా మార్చుకుందామని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో రూ,25 కోట్లు కేటాయించుకొని కనివిని ఎరుగని రీతిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆలయ ఆవరణలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతానని, రిజర్వాయర్ ను టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతానన్నారు. ఇల్లందకుంటను నూతన మండలంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ సరి అయిన ప్రభుత్వ స్థలం లేక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని వచ్చే సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించడమే తన అలవాటని తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లాగా మార్చి చూపిస్తానన్నారు. మార్పు కోసం ఒక అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఆలయ సమీపంలోని చౌరస్తాను అద్భుతంగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం ఉందని అన్నారు.
ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తామని, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడమే తన లక్ష్యమన్నారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో స్థానిక ప్రజల సహకారం అవసరమన్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కెసిఆర్ ఏనని తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, ఆలయ ఈవో కందుల సుధాకర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు మోటపోతుల ఐలయ్య, ఎంపీటీసీ సభ్యులు దాంసాని విజయకుమార్, ఎక్కేటి సంజీవరెడ్డి, తెడ్ల ఓదెలు, సర్పంచులు పుట్ట రాజు, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, కంది దిలీప్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.