గతంలో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులు అప్పు చేయాల్సి వచ్చేదని ,అంతేకాక ఆరోగ్యం బాగా లేకుంటే ఆస్తులు అమ్ముకొని చూపించుకునే పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే పేద ప్రజల కష్టాలను గమనించి పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ కింద లక్ష 11,16 రూపాయలు కానుకగా ఇస్తున్నదని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్నగర్ మున్సిపల్ ,అర్బన్ పరిధిలో 346 మంది లబ్ధిదారులకు సుమారు మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల విలువచేసె కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శిల్పారామంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతినెల రెండు మూడుసార్లు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ కింద చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఇచ్చిన ప్రతిసారి 300 నుండి 500 మందికి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా ఆరోగ్యం బాగా లేని వారికి ఎల్ ఓ సి రూపంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నామని, గతంలో ఆరోగ్యం బాగా లేకుంటే వైద్యం చేయించుకునేందుకు ఉన్న ఆస్తులు ఆమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, అంతేకాకుండా పేదవారు వారి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తే అప్పు చేసి పెళ్లి చేసేవారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ కింద లక్ష 1116 ఇవ్వడం జరుగుతున్నదని, అంతేకాకుండా నిరుపేదలకు ఆసరా పెన్షన్లు, వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసిలు ఇస్తున్నామని అన్నారు. అర్ధరాత్రి ఆపద వచ్చిన ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ప్రజల్లో కల్పించామని, గతంలో తాగడానికి మంచినీళ్లు లేక బతుకుతెరువు కోసం దుబాయ్ ,బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లేవారని ఇప్పుడు ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీటితో పాటు, ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి బతుకుదెరువుకు భరోసా కల్పించామని అన్నారు. శిల్పారామం గతంలో చెత్తకుప్పలా ఉండేదని, అదేవిధంగా ట్యాంక్ బండ్ కాలు మోపటానికి సైతం సందు లేనివిధంగా ఉండేదని, దానిని అత్యంత సుందరంగా తీర్చి దిద్ది శిల్పారామం నిర్మించామని, పట్టణంలో రోడ్లు ,పార్కులు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పాత కలెక్టరేట్ స్థానంలో గాంధీ ఆసుపత్రి లాంటి 1000 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, ఇకపై జిల్లా ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడే కల్పిస్తున్నామని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలే కాకుండా రాయచూరు, కర్నూలు వంటి ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని కులాలు, వర్గాలు, రైతులతో మొదలుకొని అన్ని కులాలు, వర్గాల వారు సంతోషంగా ఉండాలన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు. లబ్ధిదారులు కల్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర గొర్రె కాపరుల సంఘం అధ్యక్షుడు బాలరాజు, జిల్లా గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింలు, మూడా అధ్యక్షులు గంజి వెంకన్న,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్ష్యులు గిరిధర్ రెడ్డి, మహబూబ్నగర్ అర్బన్ తహసిల్దార్ నాగార్జున్ ,డిప్యూటీ తహసిల్దార్ రాజగోపాల్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Srinivas Goud: అర్ధరాత్రి ఆపద వచ్చినా ఆదుకుంటాం
అర్హులకు చెక్కుల పంపిణీ