సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళ నాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించడమే కాకుండా, బీజేపీని కలవరపాటుకు గురి చేశాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు, సినిమా హీరో కూడా అయిన ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ, సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కోవిడ్ లాంటిదని, దీన్ని దూరం పెట్టడం కాకుండా పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సహజంగానే ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడమే కాకుండా, వాడి వేడి చర్యకు కూడా దారితీశాయి. నిజానికి, ఈ వ్యాఖ్యలు తమిళనాడులో ఎటువంటి సంచలనాన్నీ కలిగించలేదు. ఎవరూ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోలేదు కూడా. తమిళనాడులో ఇటువంటి వ్యాఖ్యలు చర్వితచర్వణంగా ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. మొదటి నుంచీ ఇది డి.ఎం.కె సిద్ధాంతం. దాదాపు ఇటువంటి సిద్ధాంతాలను అనుసరించే పార్టీలతోనే అది పొత్తు కుదర్చుకుంది. తమిళనాడులో అతి కొద్ది బలం ఉన్న బీజేపీకి డి.ఎం.కె హిందూ వ్యతిరేక పార్టీ అన్న విషయం బాగానే తెలుసు.
ఈ పార్టీని వ్యతిరేకించే పార్టీలు మాత్రం ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించాయి. ద్రవిడ కళగం, పెరియార్ లు మొదటి నుంచీ హిందూమతానికి వ్యతిరేకం అయినప్పటికీ, అవి మతాలను, కులాలను తీవ్రంగా ఖండించినప్పటికీ, డి.ఎం.కె మాత్రం చాలాకాలంగా ఈ మతాలు, కులాల ప్రస్తావనకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ పార్టీ హిందువులను అతిగా లేదా మోతాదును మించి విమర్శించడం ఈ మధ్య కాలంలో ఏనాడూ జరగలేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆయన పిలుపునివ్వడం వెనుక ఉన్న అర్థం హిందూ మతంలోని దురాచారాలను, దుష్ట సంప్రదాయాలను నిర్మూలించడం. ఇందులోని కుల వ్యవస్థను, లింగ వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలించాలని చెప్పడం ఉదయనిధి ఉద్దేశం కావచ్చు.
డి.ఎం.కెను ఇరకాటంలో పెట్టడానికి, ఆ పార్టీని బలహీనపరచడానికి కొందరికి, కొన్ని పార్టీలకు ఇదొక రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతోంది. ఉదయనిధి హిందూ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారంటూ బీజేపీతో సహా కొన్ని పార్టీలు బహిరంగ ప్రకటనలు జారీ చేయడం ప్రారంభించాయి. ఈ సందర్భాన్ని రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ఉపయోగించుకోవడానికి కొన్ని మీడియా విభాగాలు చర్చలు, గోష్టులు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో కూడా కొన్ని పార్టీలు దీనిపై స్పందించి తమకు తోచిన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది. తన వ్యాఖ్యలకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని ఉదయనిధి తేల్చి చెప్పారు. అయితే, ఇండియా కూటమిలోని పార్టీలకు మాత్రం ఇది మింగుడుపడని వ్యవహారం అయింది. ఉదయనిధి హిందూ మత వ్యతిరేక వ్యాఖ్యలు పాలక పక్షానికి బ్రహ్మాస్త్రంగా మారతాయని ఈ ప్రతిపక్ష కూటమిలో ఆందోళన ప్రారంభం అయింది.
సనాతన ధర్మం హిందూ మతమేనన్న అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. సనాతన ధర్మమనేది విశ్వవ్యాప్తం, సార్వజనీనం అని, దాన్ని హిందూ మతానికి పరిమితం చేయకూడదనే అభిప్రాయాన్ని పరిశోధకులు, చరిత్రకారులు వెల్లడించడం కూడా జరుగుతోంది. అయితే, బీజేపీ మాత్రమే సనాతన ధర్మాన్ని హిందూ మతంగా పేర్కొంటోందనుకుంటే పొరపాటు. ఉదయనిధి స్టాలిన్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారనే విషయం ఆయన వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతోంది. ఆయన పార్టీ సిద్ధాంతాలే సనాతన ధర్మానికి, హిందూ మతానికి, బ్రాహ్మణత్వానికి వ్యతిరేకం అయినందువల్ల ఆయన సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు వీటన్నిటికీ కూడా వర్తిస్తాయనే విషయం మరచిపోకూడదు.
Sanatana Dharma: రచ్చ లేపిన సనాతన ధర్మం
ఇండియా కూటమిలోని మింగుడుపడని వ్యవహారం